E-Commerce: ఈ రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ సర్వ సాధారణమైపోయింది. చాలా మంది మునుపు కొనుగోలు చేసిన వినియోగదారులు ఇచ్చే రివ్యూలను ముందుగా పరిశీలిస్తుంటారు. దేశంలో పాపులర్ అయిన అమెజాన్, ఫిప్ కార్ట్ వంటి సైట్లలో సదరు వస్తువులకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్ లను బట్టి నిర్ణయం తీసుకుంటుంటారు. ఇదే సమయంలో.. సదరు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో నకిలీ రివ్యూలపై కేంద్రం దృష్టి సారించింది. దీనికి సంబంధించి.. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI)తో పాటు, ఈ-కామర్స్ కంపెనీలతో సహా అన్ని వాటాదారులతో ఈరోజు సమావేశం నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు, సేవలను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదారి పట్టించే ఫేక్ రివ్యూల గురించి ఈ ప్రభావం సమావేశంలో ప్రధానంగా వారు చర్చించనున్నారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే తప్పుడు రివ్యూల ప్రభావాన్ని అంచనా వేయడం, అటువంటి అవకతవకలను నిరోధించడానికి చర్యలు తీసుకోవడంపై చర్చిచటమే ఈ సమావేశంలో లక్ష్యమని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సంబంధిత వర్గాలకు లేఖ రాశారు. వీటిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా సన్స్, రిలయన్స్ రిటైల్ వంటి ప్రధాన ఈ-కామర్స్ సంస్థలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ లోని 223 ప్రధాన వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్ రివ్యూలపై స్క్రీనింగ్‌ను సెక్రటరీ అన్ని వాటాదారులతో పంచుకున్నారు. దాదాపు 55 శాతం వెబ్‌సైట్‌లు వ్యాపార అలవాట్లు EU మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నాయని స్క్రీనింగ్ వెల్లడించింది. అదే సమయంలో.. మెుత్తం 223 వెబ్‌సైట్‌లలో 144 వెబ్‌సైట్లలో వ్యాపారులు తమ వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసిన సమీక్షలు సరైనవా కాదా అని నిర్ధారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అధికారులు గుర్తించారు. ఉదాహరణకు.. ఉత్పత్తి లేదా సేవను సమీక్షించిన ఎవరైనా వాస్తవానికి ఆ ఉత్పత్తి లేదా సేవను కొనుగోలు చేశారా లేదా అనే విషయాన్ని కూడా వారు పరిశీలించటం లేదని తెలుస్తోంది.
ఆన్‌లైన్ షాపింగ్‌లో ట్రెండ్ పెరుగుతున్న తరుణంలో షాపింగ్ చేసే వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలోని ఉత్పత్తులను అక్కడ డిస్ల్రే చేసిన ఫోటోలను చూసి కొనుగోలు చేస్తారని ఆయన అన్నారు. ఫిజికల్ స్టోర్లలో కనిపించే విధంగా కస్టమర్లు తమ చేతులతో వస్తువులను పరిశీలించలేక పోతున్నారని అన్నారు. అటువంటి పరిస్థితిలో.. చాలా మంది కస్టమర్లు ఏదైనా వస్తువును కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన రివ్యూలను చూసి నిజమేనని భావిస్తారు. వారు పంచుకున్న వివరాలు, అనుభవం ఆధారంగా.. కస్టమర్ వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఫేక్, తప్పుదారి పట్టించే సమీక్షలు వినియోగదారుల రక్షణ చట్టం- 2019 ప్రకారం సమాచారం పొందే హక్కును ఉల్లంఘిస్తాయని ఆయన లేఖలో తెలిపారు.