కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ వైదొలగడంపై అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైకి గుంభనంగా కనిపిస్తున్నప్పటికీ ఏఐసీసీలో సీనియర్లు నాలుగు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణాలపై పరిశోధనాత్మక ఆత్మావలోకనం చేసుకుంటున్నారు. సల్మాన్ ఖుర్షీద్ వంటి సీనియర్ నేతలు తమదైన శైలిలో ఓటమిని విశ్లేషిస్తున్నారు. అడపాదడపా ఖుర్షీద్ లాంటి వారు చేస్తున్న కామెంట్లు పార్టీలో జరుగుతున్న లోతైన ఆత్మావలోకన తాలూకు అంశాలపై ఊహాగానాలకు తెరలేపుతున్నాయి.
నిజానికి ఎన్నికల ప్రచారం సమయంలో సీనియర్ల సలహాలను రాహుల్ గాంధీ బేఖాతరు చేసి, తాను, తన సొంత థింక్ ట్యాంక్ వ్యూహాలను మాత్రమే ఫాలో అవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ 2014 నాటి ఎన్నికల ఫలితాలనే 2019లోను పొందినట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో చాలా మంది విశ్వసిస్తున్నారు. ఈ విషయం గ్రహించడం వల్లనే ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాహుల్ గాంధీ తాను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం కూడా వ్యూహాత్మకమేనని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే.. ఎన్నికల ప్రచార సమయంలో సీనియర్ల సలహాలను పెడచెవిన పెట్టిన విషయం ఫలితాల వెల్లడి తర్వాత జరిగే సమీక్షల్లో వెలుగులోకి వచ్చి, సమీక్షా సమావేశాల్లో తనపైనే నెపం మోపే అవకాశం వుందన్న కారణంతోనే రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా చర్చ జరగడానికి ముందే పదవి నుంచి తప్పుకుని సీనియర్లకు షాకిచ్చినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికల తర్వాత సోనియా గాంధీ.. సీనియర్ నేత ఏకే ఆంటొనీ సారథ్యంలో ఓ కమిటీ వేసి, సమీక్షకు ఆదేశించారు. ఆయనిచ్చిన నివేదిక ప్రచారం 2019 ఎన్నికల స్ట్రాటెజీని ఖరారు చేయాలని భావించారు. అయితే.. ఎన్నికలకు చాలా ముందుగానే పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ సీనియర్ల మాటలు పక్కన పెట్టి.. తన సొంత థింక్ ట్యాంక్ పైనే ఎక్కువగా ఆధార పడ్డారు. నోట్ల రద్దు, అనంతర ఆర్థిక పరిస్థితులు, జీఎస్టీతో పడిన ఇబ్బందులు, దేశవ్యాప్తంగా సంక్షోభంలో పడిన వ్యవసాయ రంగం, పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, సామాజిక అణచివేతలు, మూక దాడులు, నిరుద్యోగం వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినియోగించుకోవాలని పార్టీ సీనియర్లు చేసిన సూచనలను రాహుల్ గాంధీ బేఖాతరు చేయడమే కాకుండా.. పెద్దగా ఆధారాలు లేకుండా రాఫెల్ డీల్ ఆధారంగా ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రచారం చేయడం ఎన్నికల్లో బెడిసి కొట్టిందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి పైన పేర్కొన్న అంశాలతోపాటు రాఫెల్ ను ఒక సాధారణ అంశంగానే ప్రచారంలో ప్రస్తావించాలని కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీకి సూచించగా.. రాహుల్ గాంధీ మాత్రం 80వ దశకంలో దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం తరహాలో రాఫెల్ డీల్ ని భావించడం పెద్ద తప్పని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. బోఫోర్స్ కుంభకోణం అంతగా ప్రభావం చూపి, రాజీవ్ గాంధీ ఓటమికి కారణమైందంటే దానికి కారణం విపి సింగ్ లాంటి సొంత పార్టీ సీనియర్ నేతే దాన్ని వెలుగులోకి తీసుకురావడం పెద్ద విషయంగా ప్రజలు భావించారు. విపిసింగ్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగుర వేసి బోఫోర్స్ కుంభకోణాన్ని వెలుగులోకి తేవడం అప్పట్లో రాజీవ్ గాంధీకి విఘాతంగా మారింది. కానీ ఇప్పుడు రాఫెల్ డీల్ విషయంలో కేవలం బిజెపి సీనియర్ నేతలే కాదు.. ఎన్డీయేలోకి అన్ని పక్షాలు నరేంద్ర మోదీకి అండగా నిలబడ్డాయి. దానికి తోడు మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను రాహుల్ గాంధీ ప్రజల ముందుంచలేకపోయారు. దాంతో రాహల్ గాంధీ చేసిన చౌకీ దార్ చోర్ హై నినాదాన్ని ప్రజలు విశ్వసించకపోవడంతో ఎన్నికల్లో పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.
అదే సమయంలో బాలాకోట్ దాడుల తర్వాత దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన జాతీయతా భావాన్ని మోదీ, అమిత్ షా ద్వయం సక్సెస్ ఫుల్ గా తమకు అనుకూలంగా మలచుకోగలిగింది. దాంతో స్వత్రంత్య భారత చరిత్రలో తొలిసారి కాంగ్రెసేతర పార్టీ బంపర్ మెజారిటీతో రెండోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అదేసమయంలో పనికిరాని మాటలతో హోరెత్తించే నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ, శామ్ పిట్రోడా లాంటి వారిని పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రమోట్ చేయడం కూడా బిజెపి విజయానికి బోనస్ ఓట్లను అందించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి ఎన్నికల ప్రచారంలో ఒంటెద్దు పోకడలను ప్రదర్శించినందువల్ల.. ఆ తర్వాత జరిగే పోస్ట్ మార్టమ్ లో తననే అందరూ టార్గెట్ చేసే అవకాశాలున్నాయని భావించిన రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా ముందే అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగి సీనియర్లే తనను బతిమాలేలా చేసుకున్నారని ఏఐసీసీ ఇన్నర్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దానికి సల్మాన్ ఖుర్షీద్ లాంటి వారు చేస్తున్న కామెంట్లు బలాన్నిస్తున్నాయి.