అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జాబితా సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతుండగానే దేశవ్యాప్తంగా దానిని అమలు చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించడంతో మరోసారి ఈ ఇష్యూ దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. నిజానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, భారీ స్థాయిలో ప్రభుత్వ సిబ్బందిని వినియోగించి రూపొందించిన ఈ జాబితా పలు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించింది. దాదాపుగా 20లక్షల మంది స్థానికుల పేర్లు అసోం జాబితాలో గల్లంతయ్యాయి. భార్యాభర్తల్లో ఒకరి పేరుంటే మరొకరి పేరు జాబితాలో లేదు. తల్లిదండ్రుల పేర్లుంటే పిల్లల పేర్లు కనపడవు. తోబుట్టువుల్లో ఒకరు పౌరసత్వానికి అర్హులైతే, మిగిలిన వారు అనర్హులు అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసోం బోర్డర్ దాటి వచ్చి.. అక్కడ స్థిరపడిన వారెందరున్నారో ఈ జాబితా కళ్లకు కట్టింది. జాబితాలో లేని వారంతా.. భారతీయలు కారని, దేశం విడిచి వెళ్ళాల్సిందేనని పలువరు డిమాండ్ చేస్తున్నారు. ‘హిందువులు, బుద్దులు, సిక్కులు, జైనులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తాం. వారిలో ఎవరైనా శరణార్ధులున్నా దేశం నుంచి బయటకు పంపకుండా అన్ని జాగ్రత్తలను కేంద్రం తీసుకుంటుంది’ అంటూ నిన్నగాక మొన్న కోల్‌కతాలో అమిత్‌షా ప్రకటించి చాలా మంది నెత్తిన పాలు పోశారు.
సరిహద్దు రాష్ట్రమైన అసోంలో ఎన్‌ఆర్‌సీని తయారు చేయడానికి చారిత్రిక కారణాల రీత్యా గట్టి ప్రాతిపదికనే ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలలోను కొన్ని చోట్ల ఎన్.ఆర్.సి. నిర్వహిస్తామని ప్రకటించడంతో పలువురు ఉలిక్కి పడ్డారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛందంగా ఎన్.ఆర్.సి.కి ఆమోదం తెలుపుతుండగా.. మైనారిటీ ఓట్ల మీద రాజకీయం చేసే పలువురు ముఖ్యమంత్రులు మాత్రం మోకాలడ్డేందుకు ప్రయత్నిస్తున్నారు.
దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950లో జరిగిన ఒక బహిరంగ సభలో దేశంలోని ప్రతి ముస్లిమూ తనను తాను భారతీయుడిగా భావించుకోవాలని, ఇతరులతో పాటే తనకూ సమాన హక్కులు ఉన్నాయని నమ్మాలని అన్నారు. అంతేకాదు, అలా వారిలో నమ్మకాన్ని కలిగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ముస్లింలకు పటేల్ ఇచ్చిన భరోసా అది. ఆల్ మోస్ట్ అలాంటి భరోసానే ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. అయితే.. బిజెపి పాలిత రాష్ట్రాలు మినహా ఇతరులు పాలిస్తున్న రాష్ట్రాలలో ఎన్.ఆర్.సి.కి గట్టి అభ్యంతరాలే వ్యక్తమవుతున్నాయి. నిజానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు అక్రమంగా వచ్చి స్థిరపడ్డారు. అలాంటి వారిని సాగనంపేందుకు అక్కడి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కాలు అడ్డం పెడుతున్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్ వంటి నగరానికి కూడా వుంది. పలు మార్లు బంగ్లాదేశీయులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్డన్ సెర్చుల్లో పట్టుబడం మనం చూశాం. మరి.. ఈ దేశంలో పుట్టని, ఈ దేశమంటే గౌరవం లేని వారిని గుర్తించడం ఎలా ? అందుకే ఎన్.ఆర్.సి.అని అంటోంది కేంద్రం.
పౌరసత్వ చట్టంలోని 3వ అధికరణం ప్రకారం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన మరుక్షణం నుంచి 1987 జూన్ 31 వరకు దేశంలో జన్మించిన వారందరికి పుట్టుకతో పౌరసత్వం లభిస్తుంది. ఎన్‌ఆర్‌సీ కోసం కేంద్రం రూపొందించిన నిబంధనల్లో ఈ తేదీని మార్చి 24, 1971కి అర్ధరాత్రిగా కేంద్రం పేర్కొంది. బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని దృష్టిలో పెట్టుకునే ఇలా చేసిందన్నది నిర్వివాదాంశం! దీంతో ఇప్పుడు అసోం ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు కోల్పోయిన లక్షలాది మంది 1971కి ముందు నుంచే తమ మూలాలు ఇక్కడే ఉన్నాయని చూపడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆధార్ కార్డుల కోసం కనిపించిన ప్రతి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఒక్క అసోం లాంటి చిన్న రాష్ట్రంలోనే 20 లక్షల మంది అక్రమంగా వచ్చి స్థిరపడిన వారున్నారు అంటే.. మరి బంగ్లాదేశ్ కు చుట్టూ వున్న రాష్ట్రాలలో ఇంకెంత మంది అక్రమవలస దారులున్నారో లెక్కే లేదు. దానికి తోడు.. .బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి.. ఎలాగోలా కోల్ కతా చేరుకుని.. అక్కడ్నించి రైళ్ళలో చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, భోపాల్, భువనేశ్వర్ వంటి ప్రాంతాలకు విస్తరించిన వారెందరున్నారన్న ఊహిస్తేనే భయం వేసే పరిస్థితి.
ఈ దేశం భారతీయులదే. దానికి మతం ప్రాతిపదిక కానే కాదు. మనది లౌకిక దేశం. ఈ దేశంలో మూలాలుండి.. ఇక్కడ పుట్టి.. ఈ దేశాన్ని గౌరవించే వారందరూ భారతీయులే. అది తేలాలంటే ఎన్.ఆర్.సి. లాంటి చర్యలు జరగాల్సిందే.