టీడీపీకి మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌కు అక్రమ మైనింగ్ కేసులో ఉచ్చుబిగుస్తోంది. ఆయనపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. యరపతినేని శ్రీనివాస్‌తో పాటు మరో 15 మందిపై కేసులు నమోదు చేసింది. గురజాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం యరపతినేనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఆ తర్వాత 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లి, కొండమోడు, పిడుగురాళ్ల, నడికుడి, అమరావతి ప్రాంతాలకు చెందిన మరో 15 మందిపై 17 కేసులు నమోదయ్యాయి.
ఇక ఈ వ్యవహారంలో వైసీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో నారా లోకేష్‌కు కూడా వాటాలు ముట్టాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఈ స్కామ్‌లో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు యరపతినేని మైనింగ్ కేసును.. సీబీఐకి అప్పగించడంపై జిల్లా టీడీపీ నేతలు ఎవ్వరూ స్పందించడం లేదు. అయితే స్థానిక నేతలు మాత్రం ఇది.. టీడీపీని దెబ్బతీసేందుకే.. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు.
ఈ అక్రమ మైనింగ్ కేసులో వేముల శ్రీనివాసరావు, తిప్పవజుల నారాయణశర్మలపై రెండేసి కేసులు, మరో 13 మందిపై ఒక్కో కేసు నమోదైంది. యరపతినేనితో కలిపి మొత్తం 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల మండలం కేసనుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణా.. దాచేపల్లి మండలం నడికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరిగినట్టు గుర్తించారు. కోనంకిలో 690, 691, 692 సర్వే నంబర్‌లోను, కేసనుపల్లిలోని 324/ఎ, 336/1బి, 336/5, 336/6లోను, నడికుడిలోని 17/4, 17/5, 17/6, 17/7, 15 సర్వే నంబర్లలో అక్రమ మైనింగ్ జరిగినట్టు నిర్ధారించారు.
యరపతినేని, అనుచరులపై కేసులు
యరపతినేని శ్రీనివాసరావు–హైకోర్టు పిల్ 170/2016, మీనిగ అంజిబాబు– 308/2018
తిప్పవజుల నారాయణశర్మ–309/2018, గ్రంధి అజయ్‌కుమార్–310/2018
తిప్పవజుల నారాయణశర్మ–311/2018, రాజేటి జాకబ్–312/2018
గుదె వెంకట కోటేశ్వరరావు–313/2018, వర్సు ప్రకాశ్–314/2018
వర్ల రత్నం దానయ్య–315/2018, నంద్యాల నాగరాజు–316/2018
నీరుమళ్ల శ్రీనివాసరావు–317/2018, ఆలపాటి నాగేశ్వరరావు–318/2018
వేముల శ్రీనివాసరావు–181/2018, వర్సు వెంకటేశ్వరరావు–182/2018
వేముల ఏడుకొండలు–183/2018, ఈర్ల వెంకటరావు–184/2018
బి. నరసింహారావు–185/2018, వి. శ్రీనివాసరావు–186/2018