
సంఖ్యాశాస్త్రంలో (Numerology) మూల సంఖ్య (Root Number)కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని ఒక్క అంకె వచ్చే వరకు కలిపి మూల సంఖ్యను నిర్ణయిస్తారు. ఈ సంఖ్య ఆధారంగా వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం, ఆర్థిక పరిస్థితి, వృత్తి, భవిష్యత్తు అవకాశాల గురించి అంచనా వేస్తారు. మూల సంఖ్యలు 1 నుంచి 9 వరకు ఉంటాయి. ప్రతి సంఖ్యకు ఒక అధిపతి గ్రహం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావం ఆయా వ్యక్తుల జీవితంపై ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అలాంటి సంఖ్యల్లో మూల సంఖ్య 7 అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంఖ్య కలిగిన వ్యక్తులకు అద్భుతమైన అంతర్‌దృష్టి (Intuition) ఉంటుందని, కొన్ని సందర్భాల్లో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే ఊహించే సామర్థ్యం కూడా ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతారు. వీరు చూసే కలల్లో చాలా వరకు నిజమవుతాయని కూడా నమ్మకం.
నెలలో 7, 16 లేదా 25వ తేదీన జన్మించిన వారి మూల సంఖ్య7 అవుతుంది. ఉదాహరణకు, 16వ తేదీన జన్మిస్తే 1+6 = 7, 25వ తేదీన జన్మిస్తే 2+5 = 7.
మూల సంఖ్య 7కు అధిపతి కేతు గ్రహం. జ్యోతిష్యంలో కేతువును ఆధ్యాత్మికత, జ్ఞానం, అంతర్‌దృష్టికి ప్రతీకగా భావిస్తారు. కనిపించని విషయాలను గ్రహించే శక్తి కేతువుకు ఉందని విశ్వసిస్తారు. అందుకే మూల సంఖ్య 7 కలిగినవారిలో కూడా లోతైన ఆలోచన, పరిశీలనా శక్తి, ముందస్తు అంచనా వేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని చెబుతారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 7 కలిగిన వ్యక్తులు స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. మోసం, వంచన వంటి వాటికి దూరంగా ఉంటారు. వీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే వారికి మంచి జరుగుతుందని, అదే బాధతో లేదా ఆవేదనతో పలికిన మాటలు కూడా నిజమయ్యే అవకాశముందని విశ్వాసం ఉంది. వీరు ఇతరుల స్వభావాన్ని సులభంగా అర్థం చేసుకోగలరు. ఎదుటివారి నిజమైన ఉద్దేశాలను త్వరగా గుర్తిస్తారు. అందువల్ల ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని చాలా సందర్భాల్లో సరైన రీతిలో నిర్ణయించగలుగుతారు.
మూల సంఖ్య 7 ఉన్నవారు లోతైన అధ్యయనం, పరిశోధన, రచన, బోధన, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, తత్వశాస్త్రం వంటి రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతూ, తమ ప్రత్యేక ఆలోచనా విధానంతో గుర్తింపు పొందుతారు.
(Disclaimer: సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఈ వివరాలు సంప్రదాయ విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు నిర్ధారించబడలేదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)