Janasena: పొత్తుల కోసం జనసేనాని త్యాగం.. ఆ కారణంతోనే పవన్ నెంబర్ తగ్గించారా.?

|

Mar 12, 2024 | 10:00 PM

ముఖ్యమంత్రిని నేనే అన్నారు ఒకప్పుడు. ఇప్పుడా స్లోగనే ప్రాచుర్యంలో లేకుండాపోయింది. గౌరవప్రదమైన సీట్లు ఖాయం అన్నారు. అదీ పక్కకెళ్లిపోయింది. విశ్వామిత్రుడు, గాయత్రి మంత్రం అంటూ 24 నెంబర్ చెప్పారు. అది కాస్తా చిక్కిపోయింది. ఓవరాల్‌గా పవన్‌ స్వరం మారుతూ వచ్చింది. ఇక్కడ తగ్గిందల్లా జనసేనాని మాత్రమే. ఎందుకలా..?

Janasena: పొత్తుల కోసం జనసేనాని త్యాగం.. ఆ కారణంతోనే పవన్ నెంబర్ తగ్గించారా.?
Pawan Kalyan
Follow us on

ముఖ్యమంత్రిని నేనే అన్నారు ఒకప్పుడు. ఇప్పుడా స్లోగనే ప్రాచుర్యంలో లేకుండాపోయింది. గౌరవప్రదమైన సీట్లు ఖాయం అన్నారు. అదీ పక్కకెళ్లిపోయింది. విశ్వామిత్రుడు, గాయత్రి మంత్రం అంటూ 24 నెంబర్ చెప్పారు. అది కాస్తా చిక్కిపోయింది. ఓవరాల్‌గా పవన్‌ స్వరం మారుతూ వచ్చింది. ఇక్కడ తగ్గిందల్లా జనసేనాని మాత్రమే. ఎందుకలా..? ఓట్లు చీలనివ్వబోనన్న ఒక్క కారణానికే ఇంతలా తగ్గాలా?

జనసేనకు 20 సీట్లే ఇస్తారట. ఒకప్పుడు ఇదే ప్రచారం జరిగింది.. గుర్తుందా..! దానికి పవన్‌ రియాక్షన్.. ” ఏంటీ జస్ట్ 20 సీట్లా.. నెవ్వర్” అంటూ ఆ ప్రచారాన్ని ఖండించారు. మరి ఇప్పుడేం జరిగింది? చివరికి చేతికి ఎన్ని మిగిలాయి? అవే 20కి ఒక సీటు పెరిగింది. అంతేనా..! ఓవరాల్‌గా జనసైనికులు భయపడిందే జరిగింది. బయట జరిగిన ప్రచారమే అంతిమంగా నిజమైంది.

పవన్‌ కల్యాణ్‌ స్వరం ఇంత ఫాస్ట్‌గా తగ్గుతుందని ఎవరూ అనుకోలేదు. సరిగ్గా ఆరు నెలల క్రితం విశాఖలో వారాహి యాత్ర ముగిసిన తరువాత మీడియాతో చాలాసేపు మాట్లాడిన పవన్.. ‘ఎస్.. ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి సంసిద్ధంగా ఉన్నా’ అని అన్నారు. పవన్‌ రోడ్డుమీదకు వచ్చిన ప్రతిసారీ.. అభిమానులు, కార్యకర్తలు సీఎం సీఎం అని అరుస్తుంటే.. ఒకసారి వారిని ఎంకరేజ్‌ చేశారు కూడా. ఒకసారి సీఎం అని మళ్లీ అనండి అని. పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి స్థానంలో అంతగా ఊహించుకున్నారు కార్యకర్తలు, అభిమానులు. కాని, ఆ తరువాతే కాస్త స్వరం మారింది. సీఎం అనే స్లోగన్స్‌ ఇవ్వగానే ముఖ్యమంత్రిని అయిపోను.. ముందుగా ఎమ్మెల్యేగా గెలిపించాలి అనడం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు వచ్చాయి, ఇప్పుడు గోదావరి జిల్లాల్లో అటుఇటుగా 35 శాతం ఓట్లు ఉన్నాయి.. ఈ ఓట్లతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం అనేశారు.

మొదట సీఎం అనే పదాన్ని తీసేశారు. ఆ తరువాత ఉన్న ఓట్లకి అన్నేసి సీట్లు అడగడం కూడా కరెక్ట్‌ కాదని ఇండైరెక్టుగా అన్నారు. కాకపోతే, గౌరవప్రద సీట్లు మాత్రం దక్కించుకుని తీరతాం అన్నారు. ఎంతసేపూ జనసేన మాత్రమే కాదు.. ఒక్కసారైనా అవతలి వారు కూడా తగ్గాలి అన్నారు. ఈ స్టేట్‌మెంట్‌ విన్నాక పవన్‌ కల్యాణ్‌ కచ్చితంగా 50కి పైనే సీట్లు అడుగుతారు అనుకున్నారు. కాని, ఈ స్వరం కూడా మారింది. ముందుగా ప్రభుత్వ ఓట్లు చీలకూడదు, దానికోసం తానే ఓ మెట్టు దిగుతాను అనడం మొదలుపెట్టారు. కేంద్రంలోని బీజేపీ సహకారం కూడా ఉంటేనే వైసీపీ ప్రభుత్వాన్ని దించగలం అని నమ్మినందుకు.. ఢిల్లీలో చీవాట్లు కూడా తిన్నానని చెప్పుకొచ్చారు.

ఇంత చెప్పిన తరువాత టీడీపీ-జనసేన కలిసి సీట్లు ప్రకటించినప్పుడు 24 సీట్లు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆనాడు కూడా నెంబర్‌ ఎంత అనేది తనకు ముఖ్యం కాదు.. 98 శాతం మంది జనసేన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లడమే తన టార్గెట్ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ 24 సీట్లకే ఒప్పుకున్నప్పుడు ఏపీలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. జనసైనికులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అప్పుడే మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు పవన్‌ కల్యాణ్. 24 నెంబర్‌కు హిందూ పురాణాల్లో ఎంత పవర్‌ఫుల్‌ పొజిషన్‌ ఉందో తెలుసా అంటూ మాట్లాడారు.

మెల్లమెల్లగా పవన్‌ ఇచ్చిన షాక్‌ నుంచి బయటకు వచ్చి, 24 నెంబర్‌ను ఫిక్స్‌ అయిపోయారు జనసైనికులు. మైండ్‌లో ఒక నెంబర్‌ ఫిక్స్‌ అయిన తరువాత మళ్లీ 21 సీట్లకు తగ్గారు. దీన్ని మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక బయటకు చెప్పి నిరసన వ్యక్తం చేసే ఓపిక లేక అలా ఉండిపోయారు తప్ప.. జనసేన నేతలకు కూడా ఈ నెంబర్‌ నచ్చలేదు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అర్థమవుతోందో లేదో గానీ.. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు నలిగిపోతున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ను ఫేస్‌ చేయలేకపోతున్నారు. మీకు దక్కిన గౌరవప్రద సీట్లు ఇవేనా అని 24 సీట్లకు ఒప్పుకున్నప్పటి నుంచే సోషల్‌ మీడియాలో జనసైనికులను ఆటాడేసుకుంటున్నారు. ఇప్పుడు మరో నాలుగు సీట్లు తగ్గించుకున్నారు. దీంతో ఈ తాకిడి మరింత ఎక్కువైంది. ఇప్పుడు ప్రత్యర్ధులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారు జనసైనికులు.

అసలు జనసేన ఎందుకని తగ్గాలి? అందులోనూ బీజేపీ కోసం ఎందుకని నెంబర్ తగ్గించుకోవాలి? అదే బీజేపీ కోసం టీడీపీనే ఇంకాస్త ఎక్కువగా తగ్గొచ్చు కదా. నిజానికి టీడీపీకి కీలక సమయంలో అండగా ఉన్నది జనసేన మాత్రమే. బీజేపీ కాదు. అయినా సరే బీజేపీ కోసం త్యాగానికి సిద్ధపడ్డారు పవన్ కల్యాణ్. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి వెళ్లి, టీడీపీకి మనోధైర్యం ఇచ్చి, ఆ పార్టీ క్యాడర్‌లో ఓ ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఇంత పెద్ద పని చేసినందుకు టీడీపీనే రుణపడి ఉంటుంది. టీడీపీనే జనసేన కోసం త్యాగం చేయాలి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీజేపీ పాత్ర లేనే లేదు. కాని, బీజేపీ కోసం టీడీపీ ఒక్క సీటు తగ్గితే.. పవన్‌ మాత్రం నాలుగు సీట్లు తగ్గించుకున్నారు. ఎందుకని..? ఎందుకంటే.. ఈ కూటమిలోకి బీజేపీని పట్టుబట్టి తీసుకొచ్చిందే పవన్‌ కల్యాణ్‌ కాబట్టి. అటు బీజేపీ, ఇటు టీడీపీ.. ఈ రెండు పార్టీలు కావాలన్నదే పవన్ కల్యాణ్ కాబట్టి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఒకే ఒక్క కారణంగా బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చారు. సో, ఇక్కడ త్యాగం చేయాల్సింది కూడా జనసేననే. ఆ బీజేపీ కోసం అనకాపల్లి ఎంపీ సీటును కూడా వదులుకుంటోందనే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ నాగబాబు పోటీ చేయాలనుకున్నారు. కాని, అలాంటి సీటును కూడా బీజేపీకి ఇచ్చి మరింత త్యాగానికి సిద్ధపడుతున్నారు పవన్. ఎంపీ సీట్ల విషయంలో జనసేన కంటే బీజేపీకే మూడు రెట్లు ఎక్కువ సీట్లు దక్కాయి. 7 శాతం ఓట్లు వచ్చిన జనసేన రెండు ఎంపీ స్థానాలు తీసుకుంటే.. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాత్రం 6 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ పవన్ మాత్రమే ఎక్కువ సీట్లు తగ్గించుకోడానికి మరో కారణం కూడా చెబుతున్నారు. మొన్న 24 సీట్లు ఇచ్చినప్పుడు కేవలం 5 స్థానాలను మాత్రమే ప్రకటించగలిగారు పవన్. ఇప్పుడు 21 సీట్లే తీసుకున్నా సరే.. మిగిలిన అభ్యర్ధులను ఇంకా ప్రకటించలేదు. కారణం.. ఇప్పటికీ జనసేనకు గట్టి అభ్యర్థులు లేరనే అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే, బీజేపీ కోసం జనసేననే తగ్గిందని చెబుతున్నారు.

ఒకటి మాత్రం నిజం. పవన్‌ కల్యాణ్‌ అంతరంగాన్ని అభిమానులు, కార్యకర్తలు అర్థం చేసుకోలేకపోతున్నారు. పాతికేళ్ల పాటు రాజకీయం చేయడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి జగన్‌ను సీఎం కానివ్వొద్దనేదే టార్గెట్. అంతే తప్ప తాను సీఎం అవడమో, కాపు సీఎం, కాపులకు రాజ్యాధికారం.. ఇవేవీ పవన్‌ లక్ష్యం కాదు. తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నా సరే.. ఎందుకనో కార్యకర్తలే అంతగా అర్థం చేసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మొత్తానికి 2014లో అలా త్యాగం చేసి, 2024కి ఇలా త్యాగం చేస్తున్నారు.