రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాలకులు తమతమ స్థాయిలలో ఎంత కృషి చేస్తున్నా.. ఇంకా కీలకమైన మౌళిక సదుపాయాల విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ఇలాంటి సందర్భాలలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ప్రభుత్వం కావడంతో రాష్ట్రంలో కూడా కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు రంగం సిద్దమవుతోంది. అందులోనూ విజయవాడకు, ముఖ్యంగా అమరావతి రాజధానికి కీలకమైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు విజ్ఞప్తులు ఫలిస్తున్నాయి. అందులో ఇదొకటి.
విజయవాడ తూర్పు బైపాస్. ఇది విజయవాడ నగర ప్రజలకు సుదీర్ఘ కల. నగరం మధ్యలో జాతీయ రహదారి ఉండడం, చుట్టూ కొండ ప్రాంతాలు, మరోవైపు కృష్ణా నది కావడంతో విజయవాడలో ట్రాఫిక్ అంటే నరకమే అన్నట్టు ఇక్కడి ప్రజలు నిరంతరం ఆ బాధను అనుభవిస్తున్నారు. దీంతో తూర్పు బైపాస్ ఎప్పటినుంచో ప్రత్యామ్నాయంగా ఉంది. దీనికి సంబంధించి విజయవాడలో 7 కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులను నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చడంతో విజయవాడ వాసుల్లో సరికొత్త భరోసా ఏర్పడింది.
గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి నుంచి ఇబ్రహీంపట్నం మండలం కాజా వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌కు పూర్తి అభిముఖంగా తూర్పువైపు మరో బైపాస్ నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇది మొత్తం 50 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ బైపాస్ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ 2,716 కోట్లు కేటాయించింది. దీనికోసం కన్సల్టెన్సీ మూడు ఎలైన్మెంట్లు సిద్ధంచేసింది. వాటి వివరాలను జాతీయ హైవేస్ అభివృద్ధి సంస్థ ఈ వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి ప్రెజెంటేషన్ ఇవ్వనుంది.
ఈ నెలాఖరుకు ఇప్పటికే ఖరారు చేసిన మూడు ఎలైన్మెంట్లను ఎన్‌హెచ్‌ఏఐ హెడ్ క్వార్టర్స్‌కు పంపి వాటిలో ఒకటి ఖరారు చేసి దానిని బట్టి డీపీఆర్ సిద్ధం చేయాలని భావిస్తున్నారు అధికారులు.
ప్రస్తుతం చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే విజయవాడ నగరం మధ్యలో వెళ్తుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ కారణంగా మహానాడు కూడలి నుంచి రామవరప్పాడు రింగ్, నిడమానూరు వరకు.. ప్రస్తుతం ఉన్న హైవేపై నాలుగు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇయర్ ప్లాన్‌లో మెన్షన్ చేసారు. ఏడు కిలోమీటర్ల మేర ఇన్నోవేటివ్ సూపర్ స్ట్రక్చర్ డిజైన్‌తో ఈ వంతెన నిర్మించాలన్నది అధికారుల ఆలోచన. ఇందుకోసం 669 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్టు అంచనాలను రూపొందించారు. దీనివల్ల మళ్ళీ లాండ్ అక్విజిషన్ అవసరం ఉండదు, ప్రస్తుతమున్న హైవే డివైడర్ల స్థానంలో పిల్లర్లు వేసి నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు. ఈ సూపర్ స్ట్రక్చర్ పైనా కలెక్టర్లతో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించదానికి ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం అవుతోంది. దీనికి ల్యాండ్ అక్విజిషన్ అవసరం లేకపోవడంతో డీపీఆర్ సిద్ధంచేసి, టెండర్లు పిలిచి, మార్చి నాటికి గుత్తేదారుకు పనులు అప్పగించేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేసారు అధికారులు
ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..