ఏలూరు, ఫిబ్రవరి 17: ఏదో ఒక మూల ఏదో ఒక వింత ప్రతిరోజు జరుగుతూనే ఉంది. అయితే కొన్ని వింత సంఘటన కొందరు దేవుడు మహిమగా భావిస్తుంటే మరికొందరు దానికి సైంటిఫిక్ రీజన్స్ చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రజలు మాత్రం వారి నమ్మకానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నారు. ఒకచోట ఆవుకు పంది పిల్ల పుట్టింది అంటే మరోచోట అమ్మవారు కళ్ళు తెరిచారు అనే వింత సంఘటన గురించి మనం ఇప్పటికే విన్నాం. అసలు వింతల గురించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అని మీకు డౌట్ రావచ్చు. అలాంటి వింత ఒకటి మన చుట్టుపక్కల జరిగితే మనకు ఎలా ఉంటుంది.. దాని గురించి అక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు.. ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలి పాలెంలో వేప చెట్టుకి పాలు కారుతున్నాయనే వార్త చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ చెట్టుకు పూజలు చేసేస్తున్నారు. కంసాలి పాలెం గ్రామం ఊరు చివరన ఓ చెరువు వద్ద వేపచెట్టు ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ వేప చెట్టులో నుంచి ధారాళంగా పాలు కారుతున్నాయి. అయితే వేపచెట్టు నుంచి పాలు కారడాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు. వెంటనే విషయం ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల గ్రామాల్లో సైతం ఈ ఘటన తెగ వైరల్ గా మారిపోయింది.
వింత గురించి విన్నవాళ్ళు ఊరికే ఉంటారా.. చెట్టు నుంచి పాలు ఎలా కారుతున్నాయి చూద్దాము అని కొందరు వస్తుంటే.. మరికొందరు అది ఏకంగా దేవుడు మహిమ అని ఆ వేప చెట్టుకు పసుపు, కుంకుమ పూలు జల్లి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ పాపాల నుంచి తమ రక్షించమని మొక్కులు మొక్కేస్తున్నారు. దాంతో మహిళలు అక్కడికి తండోప తండాలుగా చేరి పూజలు చేయడానికి క్యూలు కట్టేస్తున్నారు. మరోవైపు కంసాలి పాలెం గ్రామస్తులు శుభ పరిణామం అని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగానే తమ గ్రామంలో వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని చెబుతున్నారు. దాంతో తూర్పుగోదావరి జిల్లాలో కంసాలిపాలెం గ్రామం ఇప్పుడు ఫేమస్ అయిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..