Wonder Plants: పర్యావరణహితం కోసం టీవీ9 సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌.. ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు

|

Aug 12, 2022 | 6:58 AM

అనంతపురంలో పర్యావరణంపై ఏజీఎస్‌ సంస్థ ఇప్పటికే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌ పేరుతో టీవీ9 కూడా ప్రకృతి మేలు కోరుతుండడంతో.. కలిసికట్టుగా ముందుకు సాగితే సాధించందంటూ ఏదీ ఉండదంటూ పలు స్వచ్చంద సంస్థలు మేము ఉన్నామంటూ ముందుకొస్తున్నాయి

Wonder Plants: పర్యావరణహితం కోసం టీవీ9 సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌.. ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు
Tv9 Seed Ball Campaign
Follow us on

Wonder Plants: నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు.. అలాంటి మహావృక్షాలతో ధరిత్రి కళకళలాడేందుకు రేపటి పౌరులే అందుకు పాత్రధారులు కావాలి. ఇప్పటి నుంచే వారికి పర్యావరణంపై అవగాహన కల్పించాలి. గ్లోబల్‌ వార్మింగ్‌, పర్యావరణం విసురుతున్న సవాళ్ల నుంచి గట్టెక్కాలంటే.. మొక్కల పెంపకం మస్ట్‌. గ్రీన్‌ అనంతపురం పేరుతో ఓ సంస్థ సాగిస్తున్న యజ్ఞం.. టీవీ9 చేపట్టిన సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌ లక్ష్యం ఒక్కటే కావడంతో.. పర్యావరణంపై మరింత చైతన్యం తెచ్చేయత్నం చేస్తోంది. ప్రకృతి పరిఢవిల్లాలి.. పక్షులు కిలకిలరావాలతో అలరించాలి.. మొత్తంగా పర్యావరణం పచ్చగా విరబూయాలి. అందుకోసం సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌తో పాటు మొక్కల పెంపకంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. గ్రీన్‌ అనంతపురం పేరుతో ఇప్పటికే AGS అనే స్వచ్ఛంద సంస్థ నేచర్‌ను కాపాడేపనిలో పడింది. చెట్ల నరికివేత, ప్లాస్టిక్‌ వాడకంపై చైతన్యం తెస్తోంది.

అంతేకాదు.. నేటి బాలలే రేపటి పౌరులు కావడంతో.. వారి నుంచే ఈ మహాయజ్ఞాన్ని తీసుకెళ్తోంది. అందుకోసం వినూత్నంగా పెన్నుల రూపంలో మొలిచే మొక్కలను పంపిణీ చేస్తోంది. పక్షుల కోసం గూళ్లు… పెన్నుల రూపంలో ఉండే మొక్కలను పంపిణీ చేస్తోంది ఏజీఎస్‌ సంస్థ. మన ఇల్లే కాదు.. పర్యావరణం కూడా మనకు ముఖ్యమే అని చాటుతున్నారు. అంతరించిపోతున్న చెట్లతో పాటు పక్షులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరితపిస్తున్నారు. ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రకృతిని కాపాడేందుకు ప్రతీ ఒక్కరినీ మేల్కొలుపుతున్నారు. కొందరు యువతతో కలిసి హోమ్‌ ఫర్‌ బర్డ్స్‌ సొసైటీని కూడా ప్రారంభించారు. ప్రకృతిపై ప్రేమ ఉన్నవారితో జనంలోకి వెళ్తున్నారు.

టీవీ9 చేపట్టిన సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌ కూడా ప్రకృతికి మేలు చేసేదే కావడంతో.. పర్యావరణహితం కోసం అందరూ కలిసిరావాలని కోరుతున్నారు. నేచర్‌ను కాపాడుకుంటేనే మనకు మనుగడ ఉంటుందని చాటుతున్నారు. ఈ బిజీ లైఫ్‌లో పర్యావరణాన్ని పట్టించుకోకుండా ఉండడమే కాదు.. ప్రకృతికి చేస్తున్న చెడుతో మన మనుగడను మనమే అంధకారంలో పడేసుకుంటున్నాము. అలా కాకుండా.. అందరూ ఆలోచించి ప్రకృతి పరిరక్షణకు ముందుకు రావాలి. చిన్నారులకు పుస్తకాలతో పాటు ప్రకృతికి మేలు చేసే పెన్నులను పంపిణీ చేస్తూ.. అవగాహన పెంచుతున్నారు. వాడి పడేసినా.. లేదంటే దాన్ని మొక్కల రూపంలో నాటినా చెట్లుగా పెరుగుతాయని చెబుతున్నారు. వాడిపడేసే అట్టముక్కలతో తయారు చేసిన ఈ పెన్నుల్లో వెనుక భాగంలో సీడ్స్‌ను ఉంచారు. వాటిని భూమిలో పాతితే మొక్కలుగా మొలిచి.. చెట్లుగా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

అనంతపురంలో పర్యావరణంపై ఏజీఎస్‌ సంస్థ ఇప్పటికే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌ పేరుతో టీవీ9 కూడా ప్రకృతి మేలు కోరుతుండడంతో.. కలిసికట్టుగా ముందుకు సాగితే సాధించందంటూ ఏదీ ఉండదంటూ పలు స్వచ్చంద సంస్థలు మేము ఉన్నామంటూ ముందుకొస్తున్నాయి. ఉన్న చెట్లను కాపాడుకుంటేనే.. మొక్కలు, సీడ్‌బాల్‌ రూపంలో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారు.

ప్రస్తుత నాగరిక సమాజంలో గ్రామాల్లో కూడా పక్షుల కిలకిలలు లేకుండా పోయాయి. చాలా రకాల పక్షులు అంతరించిపోగా.. చెట్లను కూడా అవసరాల కోసం నరికివేస్తున్నారు. దీంతో గ్లోబల్‌వార్మింగ్‌.. డేంజర్‌ బెల్స్‌ను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పల్లెలైనా, పట్టణాలైనా పర్యావరణంతో పచ్చగా ఉండాలంటే.. సీడ్‌బాల్‌ వంటి క్యాంపెయిన్‌లో పాల్గొనడం, మొక్కలను పెంచడం ఒక్కటే మార్గం. చెట్లు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మొక్కల పెంపకంతో పాటు సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చూస్తున్నారు. సమాజంలో ఉన్న ప్రతీ అంశాన్ని పర్యావరణం కోసం వినియోగించాలన్న భావనతో పెన్ను తయారు చేసినట్టు తెలిపారు అనిల్‌కుమార్‌. ప్లాస్టిక్‌ నిషేధంతో పాటు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని నినదిస్తున్నారు.

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి.. పర్యావరణహితంగా ఉండే వాటినే వాడేలా చూస్తున్నారు. రెండోవైపు నేచర్‌ ఇప్పటికే మనకు చాలా ఇచ్చింది. ఈ క్షణం నుంచి మనం తిరిగి నేచర్‌కు సమయం కేటాయించి.. ప్రకృతిని కాపాడుకునేలా ముందుకు కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం సీడ్‌బాల్‌ క్యాంపెయిన్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..