ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సమస్యలకు పరిష్కారం కనుగొనేలా విద్యార్దులు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. ప్రస్తుత కాలంలో ఆరోగ్య రంగంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే వాటి పరిష్కారం దిశగా పాఠశాల నుండే విద్యార్ధులు వినూత్న ఆవిష్కరణల కోసం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరులోని వివా పాఠశాలకు చెందిన పదమూడు మంది విద్యార్ధులు జర్మనికి చెందిన మరో పదమూడు మంది విద్యార్ధులతో కలిసి చేసిన మూడు ప్రయోగాలు విజయవంతం అయ్యాయి.
మేక్ థాన్–24లో భాగంగా వివా విద్యార్ధులు పదమూడు మంది జర్మనీలోని న్యూరెంబర్గ్ నగరానికి చెందిన డ్యూరర్,మార్టిన్ బెహం పాఠశాలకు చెందిన మరో పదమూడు మంది విద్యార్ధులతో కలిసి పనిచేసేందుకు ఓ బృందంగా ఏర్పడ్డారు. వీరికి ప్రొఫెసర్ బెర్నార్డ్ సూచనలు, సలహాలు అందజేశారు. అంధులు నడిచేందుకు అవసరమైన స్టిక్‌ను ఆధునిక సాంకేతికత ఉపయోగించి తయారు చేశారు. ఎకో మోషన్ షూస్‌ని తయారు చేశారు. మరొక్కటి పల్స్ పెడల్‌ను కూడా తయారు చేశారు. ఈ మూడు పరికరాలు తయారీ విజయవంతం కావడంతో విద్యార్థులు వాటిని మాజీ డీజీపీ మాలకొండయ్య ఎదుట ప్రదర్శించారు.