“మా తెలుగు తల్లికి మల్లెపూదండ”కి అందిన పారితోషికం, ఈ పాట ఎప్పుడు.. ఎందుకు.. ఎవరు రాశారో, ఎలా పుట్టిందో తెలుసా.?

|

Aug 10, 2021 | 9:29 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" వెలకట్టలేని ఈ పాటకి అందిన పారితోషకం 116/- . ఈ పాట ఎప్పుడు? ఎందుకు? ఎవరు? రాశారో.. అసలా పాట ఎలా పుట్టిందో మీకు తెలుసా.?

మా తెలుగు తల్లికి మల్లెపూదండకి అందిన పారితోషికం, ఈ పాట ఎప్పుడు.. ఎందుకు.. ఎవరు రాశారో, ఎలా పుట్టిందో తెలుసా.?
Sankarambadi Sundara Chary
Follow us on

Sri Sankarambadi Sundarachari: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” వెలకట్టలేని ఈ పాటకి అందిన పారితోషికం 116/- . ఈ పాట ఎప్పుడు? ఎందుకు? ఎవరు? రాశారో.. అసలా పాట ఎలా పుట్టిందో మీకు తెలుసా.? వాస్తవానికి ఈ పాట ఒక సినిమా కోసం రాసిన పాట. ఆ సినిమా పేరు “దీన బంధు” పలు కారణాల చేత ఆ పాట సినిమా కోసం ఉపయోగించలేదు. HMV కంపెనీ వారు ఈ పాటని 116/- రూపాయల పారితోషకంతో కొన్నారు. పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది టంగుటూరి సూర్యకుమారి, యస్. బాల సరస్వతి. అయితే దీని రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు. ఈయన 1914 ఆగష్టు 10  తిరుపతిలో జన్మించారు. అతని మాతృభాష తమిళం. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు. ఈ రోజు సుందరాచారి వారి 107 వ జయంతి.

ఒకరోజు దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని శంకరంబాడిని అడిగారు. దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని ఎదురు ప్రశ్నవాసారాయన. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను. అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని అన్నారు. శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసారు.

సుందరచార్యులు భుక్తి కొరకు ఎన్నో పనులు చేసారు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసారు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసారు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసారాయన. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలై మరణించారు. కూతురు కూడా 5 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. ఈ కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు.

సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు. శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. నాస్వామి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృతులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యుడు వంటి ప్రబోధ రచనలు చేశారు. అందులో బుద్ధ గీత అత్యధికంగా 10,000 కాపీలు అమ్ముడుపోయింది.

సుందరాచారి రచనలకు విశేష ఆదరణ లభించింది. అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చేతులమీదుగా సత్కారం పొందారు. ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచనే ‘మా తెలుగు తల్లికి’.. దేశానికి ‘జనగణమన’ జాతీయ గీతమైనట్లే, తెలుగు జాతికి రాష్ట్రగీతమైంది. 1975లో తెలుగు ప్రపంచ మహా సభలో, ఏపీ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి విధిగా పాడాలని ఆదేశించింది.

శ్రవణ్ కుమార్. బి, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్

Read also: NEDCAP: బాబు హయాంలో జరిగిన రూ. 22,868 కోట్ల అవినీతికి పక్కా సాక్ష్యాలు.. స్కాం బయటకు తీస్తాం: నెడ్‌క్యాప్ చైర్మన్