మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అన్న కూతురును మూడో అంతస్తు నుంచి కింద పడేసిన ఘటన విజయవాడ శివారులో చోటుచేసుకుంది. నున్న రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని వాంబేకాలనీలో అమానుష ఘటన జరిగింది. వాంబేకాలనీలోని సీ2, 35వ బ్లాక్‌లో అపార్టుమెంట్‌లో కొండ్రాజు ఏసుబాబు, శ్రీదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికిద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఏసుబాబు సోదరుడైన కృష్ణతో కలిసి టైల్స్ పనులు చేస్తుంటాడు.
మద్యానికి బానిసైన కృష్ణ.. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో… అన్న ఏసుబాబు దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు. ఆదివారం మద్యం తాగివచ్చిన కృష్ణ… అన్నా, వదినెలతో గొడవకు దిగి… అక్కడే ఉన్న ఆరేళ్ల అన్న కూతురు జానకిని మూడో అంతస్తు భవనం పై నుంచి కిందకు విసిరేశాడు. దీంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. తల వెనుక భాగంలో తగిలిన గాయాలతో.. అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కృష్ణను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.