ఎన్నికల సమయంలో జెండాలు మోయటం, పార్టీ ఎజెండా ప్రజల్లోకి తీసుకుని వెళ్లటం, ఓట్లు వేయండయ్యా.. అంటూ ప్రజలను రిక్వెస్ట్ చేయటం ఇది సగటు పార్టీ కార్యకర్తలు పని అనుకుంటాం. కానీ పోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేశారు. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే పెద్ద ఎత్తున హడావుడి ఉంటుంది. ఎమ్మెల్యే కారుతోపాటు, పక్కన పదుల సంఖ్యలో చోటా మూటా నాయకులు ఉంటారు. అలాంటిది మోటార్ సైకిల్‌పై నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేను చూసిన కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. ఏకంగా ఓ కారును ఎమ్మెల్యేకు బహుమతిగా ఇచ్చారు.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలరాజు సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించే ఎమ్మెల్యేకు కనీసం కారు కూడా లేదు. సామాన్య గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన బాలరాజుకు కారు కొనుగోలు చేసే స్థోమత లేకపోవటంతో బైక్‌పైనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన జనసైనికులు తమ అభిమాన ఎమ్మెల్యేకు కారును కొనిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బాలరాజుకు కారు కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చారు కార్యకర్తలు.
పోలవరం లాంటి మారుమూల నియోజకవర్గంలో ప్రతి గిరిజన గ్రామం తిరగాలంటే ఖచ్చితంగా వెహికల్ ఉండాల్సిందే. ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కారు అలవెన్సులు లభిస్తాయి. అయితే రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు లభించిన జీతంలో సదరు శాసనసభ్యుడు భరించాలి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిస్థితి ని అర్ధం చేసుకున్నారు. పోలవరం నియోజక జనసేన కార్యకర్తలు. తమ నేత కోసం కారును గిఫ్ట్ గా ఇవ్వాలని భావించారు. అనుకున్నదే తడవుగా అందరూ ఒక్కటై లగ్జరీ కారును గిఫ్ట్ గా అందచేశారు. తమకు తోచినంత విరాళాలు వేసుకొని రూ.10 లక్షలు పోగుచేశారు. ఈ సొమ్మును డౌన్ పేమెంట్ కట్టి, ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును కొనిచ్చారు. మిగిలిన సొమ్మును నెలనెలా ఈఎంఐ రూపంలో ఎమ్మెల్యే బాలరాజు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. జనసైనికులు తన పట్ల చూపిన అభిమానానికి ఎమ్మెల్యే బాలరాజు సంతోషం వ్యక్తం చేశారు. ఇది గతంలో ఎన్నడూ జరగని ఓ విచిత్ర ఘటనగా ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
చిర్రి బాలరాజు 2019 ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూటమి తరుపున టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఇదే సందర్భంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొరగం శ్రీనివాస్ తనకు టికెట్ కావాలని. చివరి వరకు గట్టిగానే ఒత్తిడి చేశారు. అయితే జనసేనకు పొత్తులో భాగంగా టికెట్ కేటాయించటంతో చిర్రి బాలరాజు గెలిచారు. ఎమ్మెల్యేలు సాధారణంగా ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు. ఇలాంటి సమయంలో సామాన్య వ్యక్తి గా రాజకీయాల్లోకి వచ్చిన బాలరాజు ఇతర శాసనసభ్యులు ముందు తక్కువగా ఉండకూడదని భావించారు జనసేన కార్యకర్తలు. వెంటనే ఆచరణలో పెట్టేశారు. ఏదేమైనా పుచ్చలపల్లి సుందరయ్య లా సైకిల్ పై వెళ్లి రాజకీయాలు చేసే రోజులు కాదు కదా.. డిజిటల్ యుగంలో కాలంతో పాటు పరుగెట్టాలంటే ఈ కాలానికి అనుగుణమైన విధానాలు పాటించటమూ మంచిదే అనే భావన ఈ ఘటనకు అద్దం పడుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…