ఖా అంటే తిండి. దీ అంటే ఇచ్చేది. ఖాదీ అంటే తిండిని పెట్టేది అని హిందీ భాష చెబుతున్న పరమార్థం. తెలుగునాట పొందూరు ఖాదీ కూడా దశాబ్దాల తరబడి పొందూరు ప్రాంతానికి తిండి పెట్టి పోషిస్తోంది. దానికి ప్రతిఫలంగా దేశానికి గర్వించదగ్గ ఖద్దరు వస్త్రాన్నిస్తోంది మన పొందూరు. ఎస్.. పొందూరు ఖద్దరుది ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ప్రతిష్ట. అందుకే.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ముగ్గురు పొందూరు ఖాదీ నేతన్నల్ని ఢిల్లీకి పిలిచి విశిష్ట సత్కారం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సాటి తెలుగువారుగా మనకూ ఇది గర్వకారణమే.
చుట్టుకుంటే సోయగం.. కట్టుకుంటే సౌందర్యం.. చేతపట్టుకుంటే చేజారిపోయే సుగుణం. టోటల్‌గా.. పొందూరు ఖద్దరు వస్త్రం అంటేనే అత్యంత విశిష్టం.
నాటి గాంధీ నుంచి నేటి గల్లీ లీడర్ల దాకా.. పొందూరు ఖద్దరును ధరించి దర్పం ప్రదర్శించినవాళ్లే. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తెలుగు రాష్ట్రానికొచ్చినప్పుడు అపురూప బహుమతిగా అందుకున్నదీ ఈ పొందూరు ఖాదీనే. ఖాదీ స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో.. ఆంధ్రప్రాంతంలో వాడుకలో ఉన్న సన్న నూలు వస్త్రం గాంధీజీ దృష్టికి వచ్చింది. పొందూరు ఖాదీ కళావైభవాన్ని ప్రశంసిస్తూ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం కూడా రాశారాయన. అంతటి చరిత్ర కలిగిన పొందూరు ఖాదీ.. స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా తన ఉనికిని చాటుకుంటూనే వస్తోంది.
పంద్రాగస్టు సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన విశిష్ట అతిథుల జాబితాలో పొందూరు ఖాదీ పరిశ్రమకు చెందిన ముగ్గురి పేర్లు కూడా ఉన్నాయంటే.. ఆధునిక శకంలో కూడా పొందూరు ఖద్దరు కాలరెగరేసినట్టే.
దేశంలో రెండు వేలకు పైగా సర్టిఫైడ్ ఖాదీ సంస్థలున్నా.. పొందూరు ఖాదీయే ఎందుకంత స్పెషల్? మిగతా ఖాదీలకు మించి పొందూరు ఖాదీలో అంత గొప్ప ప్రత్యేకతలు ఏమున్నట్టు? గార్మెంట్ ఇండస్ట్రీలో ఇన్నేసి రెవల్యూషన్లొచ్చినా… మోడ్రన్ యుగంలో కూడా ఎలా సత్తా చాటుతోంది? ఈ ప్రశ్నలన్నిటికీ పొందూరు నేత కార్మిక శ్రమైక జీవనమే సమాధానం.
చేతితో వడికిన నూలుతో, చేమగ్గం మీద నేసిన వస్త్రాన్నే ఖద్దరు అంటాం. దేశంలోని అన్ని ఖద్దరు వస్త్రాల్లోకీ అత్యున్నత ప్రమాణాలు గల సన్నటి ఖద్దరు శ్రీకాకుళం జిల్లా పొందూరులో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ సన్న ఖాదీనే నూరుకౌంట్ అని కూడా పిలుస్తారు. దీనికోసం వాడే పత్తి కూడా ప్రత్యేకమే. ఇక్కడ పండే కొండపత్తితో మాత్రమే నూలు వడుకుతారు.
పొందూరు ఖాదీ ఉత్పత్తిలో స్త్రీలదే ప్రధాన పాత్ర. తమ కురులను సవరించుకున్నంత సున్నితంగా వారు పత్తి కాయలోని ఒక్కో పోగునూ బైటికి తీస్తారు. నిజానికి పొందూరు ఖద్దరు నెయ్యడం అంటే ఆషామాషీ కాదు. అత్యంత క్లిష్టమైన తర్ఫీదు అవసరం. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్త బరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం.. ఇలా ఎనిమిది దశలు దాటితే తప్ప పత్తి శుద్ధి కాదు. కుటుంబాలకు కుటుంబాలే అదే వృత్తిగా రేయింబవళ్లు శ్రమిస్తారు కనుకే ఈ ఖాదీ అంత అపురూపమైంది.
పొందూరు ఖద్దర్‌కి ఆ మెరుపంతా ఒక చేప ద్వారా వస్తాయనేది నమ్మలేని నిజం. వాలుగు చేప దవడల్ని నాలుగు భాగాలుగా కోసి.. పెన్సిల్ సైజ్ కర్రలకి గట్టిగా కట్టి.. వాటి సాయంతో ముడి పత్తిని శుభ్రం చేస్తారు. ఖాదీ తయారీలో వాడే కొండ పత్తికి కొత్త ధగధగలు దక్కేది కూడా ఈ చేప పల్లే.
పొందూరు ఖాదీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. తయారీలో ఎటువంటి రసాయనాల్ని ఉపయెగించరు. అందుకే ఈ ఖాదీని ధరిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఒక్కసారి పొందూరు ఖాదీ వాడకం మొదలెడితే మరో ఖాదీ వైపు కన్నెత్తి చూడరు.
వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండడం పొందూరు ఖాదీకుండే మరో సహజ గుణం. ఇన్నేసి క్వాలిటీలుండబట్టే పొందూరు ఖాదీకి నకిలీలు పుట్టుకొచ్చి… అడ్డదారిన సంపాదన మొదలైంది. అదే గ్యాప్‌లో పొందూరు ఖాదీ ప్రతిష్ట మసకబారే ప్రమాదం కూడా ఏర్పడింది.
ఖాదీ అంటే కేవలం వస్త్రం కాదు.. నిజాయితీకి, శుచికి సంకేతం. దేశంలో రెండు వేలకు పైగా సర్టిఫైడ్ ఖాదీ సంస్థలున్నా.. చుక్కల్లో చంద్రుడిలా మెరుస్తూనే ఉంది పొందూరు ఖాదీ. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆధునిక వస్త్ర పోకడలతో పోరాడి గెలుస్తూనే ఉంది పొందూరు ఖాదీ. ఇప్పుడు… పంద్రాగస్టు సందర్భంగా కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి పొందూరు ఖాదీకి కిరీటం పెట్టిందంటే.. ఈ ఖద్దరు వజ్రంతో సమానమని, ఎప్పటికీ నిలిచే ఉంటుందని చెప్పుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..