కెమికల్ ఫ్యాక్టరీలో పని అంటే.. ప్రాణాలను పణంగా పెట్టాలా? జరుగుతున్న ప్రమాదాలను చూసి సగటు మనిషికి కలుగుతున్న అభిప్రాయం ఇది. ఎందుకంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని చూసినవాళ్లు.. అంత పెద్ద సంస్థల్లో.. అందునా రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీల్లో పనిచేసేవారి ప్రాణాలకు విలువ లేదా? వారికి యాజమాన్యాలు.. ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేవా? వారికి భద్రతను కల్పించలేవా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనను పెంచుతున్నాయి. రియాక్టర్ల పేలుళ్లు ఏకంగా ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి.
అచ్యుతాపురం సెజ్ లో 208 పరిశ్రమలు ఉంటే.. పరవాడ జేఎన్ ఫార్మా సిటీలో సుమారు 90 సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో 130 వరకు రెడ్ కేటగిరీవే. 2009లో ఏర్పాటు అయిన అచ్యుతాపురం సెజ్ లో ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన అని చెప్పవచ్చు. అంతకుముందు.. అంటే 1997లో HPCLలో రిఫైనరీ పేలింది. ఆ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
కంపెనీ.. భద్రత విషయంలో సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంస్థ దుర్ఘటనే నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. రెడ్ క్యాటగిరీ కంపెనీలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. కారణాలు ఏవైనా సరే.. సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు. గత ఐదేళ్లలో 119 ప్రమాదాలు జరిగాయని…అందులో 120 మంది చనిపోయారని తెలిపారు. సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప.. ఈ ప్రమాదాలు ఆగవన్నారు. అందుకే రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇంటర్నల్ సేఫ్టీ ఆడిట్ చెయ్యాలని.. లోపాలను సరిచేసుకోవాలని కోరారు. ప్రస్తుత సంఘటన ఆధారంగా హైలెవల్ కమిటీని వేస్తున్నామన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాదానికి కంపెనీలో యాజమానుల మధ్య విభేదాలు కూడా కారణమయ్యాయని సీఎం చంద్రబాబు చెప్పారు. సేఫ్టీ ఆడిట్ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
నిజానికి ఫార్మా కంపెనీల నిర్వహణ, భద్రత.. సవాల్ తో కూడుకున్నది. విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వీటిలో రియాక్టర్ల వద్ద టెంపరేచర్, ప్రెషర్ గేజ్ ల పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ప్రెజర్ ఎక్కువైతే.. వెంటనే అలారం మోగాలి. దీని కోసం సెన్సర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిజానికి రియాక్టర్ కు ఉండే రప్చర్ డిస్క్.. ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఊడిపోతుంది. ఇలా జరిగినప్పుడు అక్కడుండే ఆవిరి బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. దీనిని బట్టి ఇది ఎంత కీలకమైన వ్యవస్థో అర్థమై ఉంటుంది. మరి అలాంటప్పుడు దీని బాధ్యతలు ఎవరికి అప్పగించాలి… అనుభవం ఉన్న నిపుణులకు ఇవ్వాలి. కానీ ఇది సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కిందటి సంవత్సరం.. ఓ ఫార్మా సంస్థలో రియాక్టర్ లో సాల్వెంట్ నింపే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
సాధారణంగా ఇలాంటి పరిశ్రమల్లో ప్రమాదం జరిగితే.. దాని తీవ్రతను తగ్గించడానికి దశలవారీగా సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేస్తారు. అంటే.. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండి.. అది పరిశ్రమను దాటి బయటకు వచ్చినట్లయితే.. వెంటనే.. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ను అమల్లో పెట్టాలి. మామూలుగా అయితే జిల్లాలో ఉండే పరిశ్రమల శాఖ దీనిని వర్కవుట్ చేయాలి. కానీ గత 15 ఏళ్లుగా ఈ ప్లాన్ ను అప్ డేట్ చేయలేదని తెలుస్తోంది. తరువాత జిల్లాల విభజన జరిగింది. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు వచ్చాయి. వాటిలో రెడ్ కేటగిరీలో ఉన్నవాటి విషయంలోనూ ప్లాన్ అప్ డేట్ విషయంలో చొరవ తీసుకోలేదని తెలుస్తోంది. అయినా పరిస్థితి మాత్రం మారలేదు. ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు.. బాధితులకు వెంటనే చికిత్స అందించాలంటే.. విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ కు తరలించాలి. ఈలోపు పరిస్థితి విషమించినా, సకాలంలో సరైన వైద్యం అందకపోయినా.. మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి.
ఎసెన్షియా ఫార్మా కంపెనీ యజమానుల మధ్య ఉన్న అభిప్రాయ బేధాల వల్ల సేఫ్టీ మెజర్స్ సరిగా తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డైరెక్ట్ గా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో.. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టయ్యింది.
అచ్యుతాపురం – పరవాడ పరిధిలో లేటెస్ట్ సదుపాయాలతో ఓ ఆసుపత్రిని నిర్మించడానికి ప్లాన్ చేశారు. దీనికోసం అక్కడి ఇండస్ట్రియల్ పార్క్ లో ప్లేస్ కూడా చూశారు. హాస్పటల్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడానికి కొన్ని కంపెనీలు కూడా సిద్ధమయ్యాయి. కానీ ఆ ప్రతిపాదన ఎందుకో ముందుకు కదలలేదు. బర్న్స్ వార్డ్ ఉన్న ఆసుపత్రిని నిర్మించినా.. లేదా దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో బర్న్స్ వార్డ్ ని ఏర్పాటు చేసినా ఫలితం ఉంటుంది. లేకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రమాదకర పరిశ్రమల్లో చెకింగ్స్ కోసం గతంలో రెండు జీవోలను తీసుకువచ్చారు. 2020లో 156 జీవో, 2022లో 79 జీవోను తీసుకువచ్చారు. థర్డ్ పార్టీతో సేఫ్టీ ఆడిట్స్ నిర్వహణకు సంబంధించిన అంశం కూడా ఉంది. అయితే.. పరిశ్రమలు వీటి విషయంలో అలసత్వం వహిస్తున్నాయి. దీంతో ఇలాంటి భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగుల ప్రాణాలను బలిగొంటున్నాయి.
ఇక్కడ మరో సమస్య గురించి కూడా ప్రస్తావించాలి. ఈ సెజ్ లో ఉన్నవాటిలో ఫార్మా కంపెనీలు అధికం. అందులోనూ కెమికల్స్ తయారీతోపాటు వాటిని నిల్వ చేసే సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రమాదం జరగడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే.. ఇక్కడున్నది మాత్రం ఒకే ఒక్క ఫైరింజన్. ఏమైనా ప్రమాదాలు జరిగితే.. దగ్గరలో ఉండే ఫైరింజన్లను తెప్పించాల్సి వస్తోంది. దీనివల్ల సకాలంలో మంటలు ఆర్పే పరిస్థితి కూడా ఉండడం లేదు. మామూలుగా అయితే.. ఇలాంటి పరిశ్రమల్లో బాయిలర్లు పేలడం, రియాక్టర్లు పేలడం జరుగుతాయి. కానీ ప్రస్తుత ప్రమాద ఘటనలో వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోజివ్ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి సంఘటనల్లో గ్యాస్ లీకయ్యాక అది గాలిలో కలిస్తే డేంజర్ ఉండదు. ఒకవేళ క్లోజ్డ్ రూమ్ లో ఆ గ్యాస్ ఉండిపోతే.. అది మేఘంలా మార్పు చెందుతుంది. ఆ సమయంలో చిన్న స్పార్క్ తో కూడా భారీ పేలుడు తప్పదు. ఎసెన్షియా ప్రమాద ఘటనను పరిశీలిస్తే.. బిల్డింగ్ మొత్తం క్లోజ్డ్ గా ఉంది. దీంతో అక్కడ ఆ గ్యాస్ పొగలా అలముకుంది. అక్కడున్న ఎలక్ట్రికల్ ప్యానళ్ల ద్వారా.. బిల్డింగ్ లోని మూలమూలలకూ వ్యాపించింది. తరువాత మంటలు చెలరేగాక.. అప్పటికే పైపుల్లో ఉన్న ఆవిరి మేఘం విచ్ఛిన్నమై.. రియాక్టర్ పేలిందంటున్నారు అధికారులు.
ఈ కంపెనీలో జూనియర్లు, ఫ్రెషర్లూ ఉండడం.. ఎక్స్ పీరియన్స్ ఉన్న నిపుణులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఇక సంస్థలో.. మూడో అంతస్తులో ఉన్న రియాక్టర్ నుంచి దాని కింద ఫ్లోర్ లోకి సాల్వెంట్ ను తరలిస్తున్నప్పుడు అది లీకైనా.. దానిని అక్కడున్నవారు గుర్తించలేకపోయారు. దీనికి వారికి అనుభవం లేకపోవడమే కారణం. ఒకవేళ సీనియర్ ఉద్యోగులైతే.. లీకులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టేవారు. ఆవిరి మేఘాన్ని గుర్తించి.. వెంటనే యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేవారు. కానీ ఈ ఘటనలో అలా జరగలేదు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమల్లో కెమికల్ గోడౌన్స్, కెమికల్ పైప్ లైన్స్, ట్యాంక్స్, బాయిలర్లు, రియాక్టర్లు, ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఇలాంటివాటిపై కచ్చితంగా నిరంతరం పర్యవేక్షణ ఉండాల్సిందే. ఇక కార్మికులంతా.. ఎక్స్ పీరియన్స్ ఉన్న కెమిస్టులు, సేఫ్టీ మేనేజర్లు, షిఫ్ట్ ఇన్ ఛార్జ్ ల పర్యవేక్షణలో వర్క్ చేయాలి. ఎప్పటికప్పుడు ఉద్యోగులకు అవగాహనా సదస్సులతోపాటు మాక్ డ్రిల్ ను ఏర్పాటు చేయాలి. సంబంధిత శాఖల అధికారులు కూడా తనిఖీలను నిర్వహించాలి. ఇలాంటి కంపెనీల్లో మరికొన్ని చర్యలను కూడా చేపట్టాలి. బాయిలర్ల దగ్గర వాటర్ లెవెల్ తో పాటు టెంపరేచర్ కూడా చెక్ చేయాలి. సరైన సేఫ్టీ మెజర్స్ లేకుండా రియాక్టర్ల లోపల శుభ్రం చేయకూడదు. కెమికల్స్ ఉన్న డ్రమ్ములను దగ్గర దగ్గరగా నిల్వ చేస్తే.. ప్రమాదం తీవ్రత పెరుగుతుంది. అలాగే రియాక్టర్లలో కెమికల్స్ ఛార్జ్ చేసినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎక్స్ పైరీ డేట్ దాటిన రియాక్టర్లతో పాటు ఎక్విప్ మెంట్ ను ఉపయోగించినా సమస్యలు తప్పవు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి