మోసపోయేవాళ్లు ఉండాలే గానీ.. మోసం చేసేవారికి కొదవే లేదు ఈ సమాజంలో. నిత్యం ఏదో చోట మోసానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. అమాయకుల అవసరాలు, ఆశలే ఆసరాగా.. మోసగాళ్లు రెచ్చిపోయి అందినకాడికి దోచేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘరానా మోసం అనకాపల్లిలో వెలుగు చూసింది. పెళ్లి అనే వీక్‌నెస్‌ను అడ్డుపెట్టుకుని ఓ యువకుడి వద్ద నుంచి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 10 లక్షలు కాజేసింది యువతి, ఆమె కుటుంబం. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా గవరపాలెనికి చెందిన రాంప్రసాద్ అనే యువకుడు పెళ్లి కోసం మ్యాట్రిమోని తన డిటైల్స్ పెట్టాడు. అది గమనించిన హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి కుటుంబం అతనికి పరిచయం అయ్యింది. అయితే, రాంప్రసాద్‌కు గతంలోనే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. ఇదే విషయాన్ని వారికి చెప్పాడు. వారు కూడా అంగీకరించారు. మాటా మాటా కలిపారు. నమ్మకం కుదిరేలా చేశారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, పెళ్లికి ముందే ఉద్యోగంలో చేరితో బాగుంటుందంటూ నమ్మబలికారు. ఇందుకోసం రూ. 10 లక్షలు ఖర్చు అవుతుందంటూ.. ముందుగానే అతని వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు.
అయితే, రోజులు గడుస్తున్నా ఉద్యోగం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు యువతి కుటంబ సభ్యులు. ఈ క్రమంలోనే ఉన్నట్లుండి ముఖం చేశారు. దాంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు రాంప్రసాద్.. పోలీసులను ఆశ్రయించాడు. యువతి కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పేరుతో రాంప్రసాద్‌ను ట్రాప్ చేశారని గుర్తించిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..