Chandrababu Naidu Arrest: చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తిస్తుంది.. స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ రిపోర్ట్ ఇదే..

|

Sep 11, 2023 | 6:53 AM

నరాలు తెగె ఉత్కంఠ.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా..? రాదా..? కోర్టు రిమాండ్ కు పంపిస్తుందా..? అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.. ఈ క్రమంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ విజయవాడ ACB కోర్టు తీర్పు చెప్పింది. దాదాపు 40 గంటల ఉత్కంఠ తరువాత.. ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధిస్తూ విజయవాడ ACB కోర్టు తీర్పును వెలువరించింది.

Chandrababu Naidu Arrest: చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తిస్తుంది.. స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ రిపోర్ట్ ఇదే..
Chandrababu Naidu Arrest
Follow us on

నరాలు తెగె ఉత్కంఠ.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా..? రాదా..? కోర్టు రిమాండ్ కు పంపిస్తుందా..? అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.. ఈ క్రమంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ విజయవాడ ACB కోర్టు తీర్పు చెప్పింది. దాదాపు 40 గంటల ఉత్కంఠ తరువాత.. ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధిస్తూ విజయవాడ ACB కోర్టు తీర్పును వెలువరించింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని ACB కోర్టు జడ్జి తన తీర్పులో ఆదేశించారు. రిమాండ్‌ను తిరస్కరించాలన్న చంద్రబాబు వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసులో ఆయన చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఈ కేసులో సీఐడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సిట్ వాదనలతో ఏకీభవించింది. ఏసిబి కోర్టు ఎదుట అన్ని ఆధారాలను ప్రవేశ పెట్టిన సిట్ నివేదికను ఏసిబి కోర్టు న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుని ఫైనల్ నిర్ణయాన్ని ఆదివారం సాయంత్రం వెలువరించారు. నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్న న్యాయమూర్తి.. ఆయనకు 409 సెక్షన్ వర్తిస్తుందని వివరించారు. దీని ప్రకారం 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు తెలిపారు. కాగా.. చంద్రబాబును రేపు రాజమండి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ రాత్రికి సీట్ ఆఫీస్ కి తీసుకువెళ్లనున్న పోలీసులు.. రేపు రాజమండ్రి తరలించనున్నారు.

చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా.. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సిద్ధార్థ్‌ లూథ్రా చంద్రబాబుకు బెయిల్ కోసం కీలక వాదనలను వినిపించారు. మొత్తం టెక్నికల్‌ పాయింట్స్‌పైనే లూథ్రా వాదన సాగింది. స్కిల్ స్కామ్.. కేసులో చంద్రబాబు కూడా స్వయంగా కోర్టు ముందు వాదనలు వినిపించారు.

అయితే, సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గట్టి వాదనలు వినిపించారు. స్కిల్‌ స్కాంలో చంద్రబాబే కీలక సూత్రధారి అని.. ఈ స్కాంపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందంటూ పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజ్ అయ్యాయని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారని.. దీనికి సంబంధించి మొత్తం 28పేజీలతో రిపోర్టును కూడా సమర్పించినట్లు వివరించారు. చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

కేసు విచారణ సందర్భంగా విజయవాడలో టెన్షన్‌ వాతావరణం కనిపించింది. కోర్టు ప్రాంగణంలో ఎటూ చూసిన పోలీసులే కనిపించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పెద్ద సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించారు. మూడు విడతలుగా ఈ కేసులో వాదనలు జరిగాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఆ తర్వాత నుంచి కోర్టు తీర్పు కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇక చంద్రబాబును గృహనిర్బంధం చేయాలంటూ దాఖలు చేసిన రెండు పిటిషన్‌లపై, సీఐడీ వేసిన కస్టడీ పిటీషన్ పై విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..