Danger Bridges: బీటలు వారుతున్న అలనాటి వంతెనలు.. వందేళ్లకు పైగా సేవలందించిన వంతెనలకు ‘నో రిపేర్’..

రాబోయే తరాల అవసరాల్ని ముందే గ్రహించి... వాళ్ల మనుగడ సజావుగా సాగడం కోసం అలనాటి పాలకులు నిర్మించిన వంతెనలు... ఇప్పుడు బీటలుబారిపోయాయి. ఏళ్లూపూళ్లూ గడిచిపోయి పాడుబడ్డ స్థితికి చేరుకున్నా అవే ఇక్కడివాళ్లకు జీవనాధారాలు...

Danger Bridges: బీటలు వారుతున్న అలనాటి వంతెనలు.. వందేళ్లకు పైగా సేవలందించిన వంతెనలకు 'నో రిపేర్'..
Danger Bridges
Sanjay Kasula

|

Sep 23, 2022 | 10:05 PM

వందేళ్ల చరిత్ర.. శిథిలావస్థకు చేరుకుంటోంది. అలనాటి మహా ప్రభువులు ఎవరైతేనేం.. ప్రజోపయోగం కోసం వాళ్లు కట్టిపెట్టిన బ్రిడ్జిలు కొన్ని.. కాలం చెల్లి క్లయిమాక్స్‌ దశకు చేరుకున్నాయి. బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఈ పురాతన వంతెనలు కనీస మరమ్మతులకు నోచుకోక.. స్థానికుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కళ్లముందే పెచ్చులూడి.. బీటలు వారి.. పగుళ్లిచ్చినా.. అటువైపు చూసే నాధుడే కరువయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లాలో పాడుబడ్డ వంతెనలే ఆధారంగా ప్రమాదపుటంచుల్లో సాగుతున్న ప్రయాణాలు. రాబోయే తరాల అవసరాల్ని ముందే గ్రహించి.. వాళ్ల మనుగడ సజావుగా సాగడం కోసం అలనాటి పాలకులు నిర్మించిన వంతెనలు.. ఇప్పుడు బీటలుబారిపోయాయి. ఏళ్లూపూళ్లూ గడిచిపోయి పాడుబడ్డ స్థితికి చేరుకున్నా అవే ఇక్కడివాళ్లకు జీవనాధారాలు.

మరి.. వాటి ఆలనాపాలనా పట్టించుకునే నాధుడెవ్వడు? కొత్తవి కట్టరు.. పాతవాటికి కనీస మరమ్మతులు చెయ్యరు.. దినమొక గండం అవుతోంది మా బతుకు అంటూ వాపోతున్నారు పశ్చిమగోదావరి జిల్లా వాసులు. తాడేపల్లిగూడెం నుంచి గుండుగొలను వరకు ఏలూరు కాల్వపై బ్రిటిష్ కాలంలో నిర్మితమైన పురాతన బ్రిడ్జిలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఇటీవల గుండుగొలను వద్ద ఉన్న బ్రిడ్జి పాక్షికంగా ధ్వంసమైంది. దాదాపు 20 కొల్లేరు లంక గ్రామాల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.

గుండుగొలను బ్రిడ్జిపై అవతల వైపునకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం పాదచారులు, ద్విచక్ర వాహనాల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో కొల్లేరు లంక గ్రామాలకు వెళ్లే ప్రజలకు దిక్కుతోచని పరిస్థితి. నిత్యం వెయ్యిమందికి పైగా విద్యార్థులు, రెండువేల మందికి పైగా కూలీలు, వ్యాపారస్తులు ఈ ప్రమాదకర వంతెన మీదే ప్రయాణిస్తున్నారు.

భీమడోలు మండలం పూళ్ల దగ్గరున్న మరో పురాతన బ్రిడ్జిది కూడా ఇదే శిధిలావస్థ. వందేళ్ల కిందట 1919లో కట్టిన ఈ బ్రిడ్జిపై ఇప్పటికీ రద్దీగా రాకపోకలు జరుగుతాయి. ప్రతిరోజూ 300 టన్నుల ఆక్వా ఎగుమతులకు ఈ బ్రిడ్జి ఒక్కటే దారి. గుండుగొలను బ్రిడ్జిలాగే ఇది కూడా కూలిపోయే ప్రమాదం ఉందన్నది స్థానికుల ఆందోళన. అధికారులు ముందుగానే మేలుకుని దానికి దగ్గర్లోనే బ్రెయిలీ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇది ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద మరో బ్రిడ్జి. ఏ క్షణాన కుప్పకూలుతుందో తెలీనంత శిథిలావస్థలో ఉంది. అయినా గణపవరం, భీమవరం వెళ్లాలంటే ఈ దారే దిక్కు. చుట్టుపక్కల ప్రాంతమంతా ఐస్ ఫ్యాక్టరీలతో రద్దీగా ఉంటుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు స్థానికులు. ఇక్కడ కూడా మరో కొత్త బ్రిడ్జిని కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉంగుటూరులో ఉండే మరో బ్రిడ్జి కూడా శిథిలావస్థకు చేరడంతో, ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేశారు. పది గ్రామాల ప్రజలు ఆ బ్రిడ్జి పై నుంచే రాకపోకలు సాగించాలి కనుక పూర్తిస్థాయిలో రిపేర్లు చేయాలని కోరుతున్నారు.

ఇలా.. తాడేపల్లిగూడెం నుంచి గుండుగొలను వరకు… ఉంగుటూరు, నారాయణపురం, పూళ్ల, గుండుగొలను బ్రిడ్జిలు వంద సంవత్సరాలకుపైగా ప్రజలకు సేవలందించి ప్రస్తుతం ప్రమాదపుటంచులకు చేరాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన సమయంలో మేలుకుని శాశ్వత ప్రాతిపదికన ఏలూరు కాలవపై కొత్త వంతెనలు నిర్మాణాలు చేపట్టి.. ప్రమాదాలకు ఎదురెళ్లాల్సిన అగత్యం నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu