Andhra News: రైతన్న డొక్కపై మురసు ఎఫెక్ట్.. 30,661 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు!

అర్నబ్ తుఫాన్‌ నుంచి తేలుకొక ముందే ఆంధ్రప్రదేశ్‌ను మురసు తుఫాను అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ కారణంగా గంటకు 110 కి.మీ వేగంతో గాలులు, భారీ వర్షం కురవడంతో రాష్టవ్యాప్తంగా 112 విద్యుత్‌ స్తంభాలు, వందలాది చెట్లు నేల కూలాయి. 30,661 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయితే అదృష్టశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Andhra News: రైతన్న డొక్కపై మురసు ఎఫెక్ట్.. 30,661 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు!
Murasu Cyclone Lashes Ap

Updated on: Nov 04, 2026 | 11:14 AM

మురసు తుపాను ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది. ఈ తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో దక్షిణ కోస్తా తీరాన్ని దాటిన మురసు తుఫాన్..గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులతో విరుచుకుపడింది. తీరం దాటిన తర్వాత కూడా తుపాను ప్రభావం తగ్గలేదు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.  గాలులకు 112 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో వందలాది చెట్లు నేలకూలాయి. కోస్తా ప్రాంతాల్లో మత్స్యకారుల పడవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో 30,661 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో నష్టం ఎక్కువగా కనిపించింది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 350 హెక్టార్ల పంట నీట మునిగింది. మరోవైపు తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 10,805 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 171 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితులకు 14,810 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 13 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా 613 జనరేటర్లను సిద్ధం చేశారు. చెట్లు కూలిపోవడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు అగ్నిమాపక శాఖకు చెందిన 185 బృందాలు పనిచేశాయి. ముందస్తు జాగ్రత్తగా 3,066 మంది గర్భిణులను, 1,008 మంది బాలింతలను ఆసుపత్రులకు తరలించారు. 13 జిల్లాల్లో 725 వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర వైద్య సేవల కోసం 362 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

ఎన్నడూలేని విధంగా వరుస తుఫాన్‌లో రాష్ట్రం ఎదుర్కొందని, అయినా ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు భారీ ప్రణాళికతో ముందుకు వెళ్లామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. RTGSద్వారా కచ్చితమైన ట్రాకింగ్ సిస్టమ్‌తో తుపాన్‌ కదలికలను గమనిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్న చంద్రబాబు తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us