ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం(సెప్టెంబర్ 20) శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పూర్తైన నేపథ్యంలో “ఇది మన ప్రభుత్వం” పేరిట జిల్లాలోని కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఆయన పాల్గొనున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజులపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు పార్టీ వర్గాలు.
ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లభ్డిని వివరించటoతోపాటు ప్రతిపక్షం చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టేలా ప్రజలను చైతన్యo చేసే దిశగా చంద్రబాబు మాట్లాడనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ సభ ద్వారా గ్రామస్తులతో ఇంట్రాక్ట్ అవుతూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలువురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితోను ముచ్చటించనున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చాపురం నియోజకవర్గం ఈశాన్య దిక్కు కావడంతో ఇక్కడి నుంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు చంద్రబాబు. ఈశాన్య దిక్కు నుoచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే అది తప్పకుండా విజయవంతం అవుతుందన్న సెంటిమెంటుతో రాజపురం వేదికగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. కార్యక్రమం నిర్వహణకు ఒక్కరోజే గడువు ఉండడంతో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
MLA బెందాళం అశోక్ తో కలిసి జిల్లా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి, JC ఫర్మాన్ అహ్మద్ లు ఉదయాన్నే గ్రామానికి చేరుకుని దగ్గరుండి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వింధ్యగిరిలో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ ను అధికారులు పరిశీలించారు. అక్కడ నుంచి రాజపురంలో గ్రామసభ నిర్వహించే వేదిక, రూట్ మ్యాప్ లను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి జిల్లాకు వస్తోన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రాక కేడర్ కు నూతనోత్సహాన్ని నింపుతుందని జిల్లా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..