Sankranti: సంక్రాంతి పండగ జరుపుకోని గ్రామం.. ఇళ్లు ఊడవరు, ముగ్గులు వేయరు.. ఎందుకో తెలుసా?

| Edited By: Balaraju Goud

Jan 14, 2025 | 11:47 AM

సంక్రాంతి అంటే సందళ్ల పుట్ట. సరదాల గుట్ట. జ్ఞాపకాల తేనె తుట్టె. ప్రతి ఏటా వచ్చినా, సంక్రాంతి మనల్ని కొత్తగా పలకరిస్తూనే ఉంటుంది. పెద్ద పండుగ కదా.. సంబరాలు కూడా పెద్దవే. సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకొచ్చేది రంగు రంగుల ముగ్గులు, గొబ్బలు. అయితే ఆ ఊరికి మాత్రం చేదు జ్ఞాపకాలు..

Sankranti:  సంక్రాంతి పండగ జరుపుకోని గ్రామం.. ఇళ్లు ఊడవరు, ముగ్గులు వేయరు.. ఎందుకో తెలుసా?
P Kothapalli
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రతి పల్లె సంక్రాంతి సంబరాలతో కోలాహలంగా మారిపోయిందిఉం. కానీ పండుగ వేళ ఆ గ్రామం వెలవెలబోతోంది. అసలు ఆ గ్రామంలో 200 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగే జరుపుకోరట. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి. కొత్తపల్లి కథ ఇది. పి. కొత్తపల్లి గ్రామంలో గడిచిన 2వందల ఏళ్ళ నుంచి సంక్రాంతి పండుగకు దూరంగా ఉంటున్నారు గ్రామస్తులు.

సంక్రాంతి అంటేనే.. భోగి మంటలు… పిండివంటలు. గంగిరెద్దులు..మేళాలుతాళాలు. తెలుగు మాట ఆట పాట ఒక్కచోట కలిస్తే సంక్రాంతి. అయితే, ఇక్కడ మాత్రం ఇల్లు అలంకరణ.. పూజలు దీపారాధన కాదు కదా.. కనీసం ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు కూడా వేయరు. సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు కనిపిస్తాయి. కానీ పి కొత్తపల్లి గ్రామంలో ఏ సంక్రాంతి పండుగకు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టిందే లేదు.

అసలు ఎందుకు పి. కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండగే జరుపుకోరు అంటే.. దానికి 200 ఏళ్ళ కిందటి కథే చెబుతున్నారు గ్రామస్తులు. పి కొత్తపల్లి గ్రామంలోని తమ పూర్వీకులు సంక్రాంతి పండుగ రోజు సంతకు వెళ్లి.. తిరిగి రాలేదని, సంక్రాంతి పండుగ రోజు సంతకి వెళ్లినవారు చనిపోవడంతో.. సంక్రాంతి పండుగ జరుపుకుంటే అశుభం అని భావిస్తున్నారు గ్రామస్తులు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు పి. కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండుగ చేసుకోవడం మానేశారు. దీంతో ఏకంగా సంక్రాంతి పండుగనే బహిష్కరించారు ఆ గ్రామస్తులు.

సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ప్రతి ఇల్లు రంగుల ముగ్గులు, పిండి వంటలు, చుట్టాలతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ 200 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజు సంతకు వెళ్లి చనిపోయారని, టీ కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండుగను జరుపుకోవడమే మానేయడం వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. ఇది నిజం..! అలా సంక్రాంతికి పండుగకు దూరంగా పి. కొత్తపల్లి గ్రామం ఉండడం విశేషం..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..