పరిషత్ లెక్క తేలింది.. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి సత్తా.. వైసీపీ ఎన్ని గెలిచిందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. 582 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 406, వైసీపీ 76, జనసేన 73, బీజేపీ 20 స్థానాలు గెలుచుకున్నాయి. 7,768 ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి పార్టీలకు భారీ విజయం దక్కింది. 28 జడ్పీ పీఠాల్లో 27 కూటమి ఖాతాలోకి వెళ్లడంతో చైర్మన్ పదవుల పంపకాలపై ఆసక్తి నెలకొంది.

పరిషత్ లెక్క తేలింది.. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి సత్తా..  వైసీపీ ఎన్ని గెలిచిందో తెలుసా?
Ap Zptc And Mptc Election Final Results

Updated on: Nov 09, 2026 | 9:44 AM

బ్యాలెట్‌ బాక్సుల దగ్గర పోరు ముగిసింది..! ఇప్పుడు అసలు రాజకీయ ఎపిసోడ్‌ మొదలైంది..! ఎన్నికల్లో కలిసి కదిలిన కూటమి నేతలకు.. పదవుల దగ్గర కొత్త పరీక్ష ఎదురవుతోంది. ముఖ్యంగా జడ్పీ చైర్మన్‌ కుర్చీల దగ్గరే అసలు లెక్కలు మొదలయ్యాయి. పెద్దన్న పాత్రలో ఉన్న టీడీపీకి.. మిత్రపక్షాల నుంచి వాటాల డిమాండ్‌ వినిపిస్తోంది. మరి మున్సిపాలిటీల్లో అనుసరించిన సర్దుబాట్ల ఫార్ములానే పరిషత్‌లకూ వర్తింపజేస్తారా..? జడ్పీ పీఠాల్లో జనసేన, బీజేపీలకు ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది..? పరోక్ష ఎన్నిక కావడంతో తెరవెనుక సమీకరణాలు ఎలా మారబోతున్నాయి..? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్‌ టాపిక్‌!

పరిషత్‌ ఎన్నికల్లో కూటమి జోరు చూపించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన తుది ఫలితాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు సత్తాచాటారు. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించగా… అందులో టీడీపీ ఏకంగా 406 స్థానాలను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. వైసీపీ 76 స్థానాలకే పరిమితం కాగా, జనసేన 73 స్థానాల్లో విజయం సాధించి బలమైన ఉనికిని చాటుకుంది. బీజేపీ 20 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులలో స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాలను దక్కించుకోగా, సీపీఐ(ఎం) ఒక స్థానంలో విజయం సాధించింది.

ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,768 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరగగా.. కూటమి పార్టీలు పెద్ద ఎత్తున స్థానాలను గెలుచుకున్నాయి.

  • 7,768 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
  • 4,806 స్థానాలతో టీడీపీ విజయం
  • 1,711 స్థానాల్లో వైసీపీ గెలుపు
  • 938 స్థానాలను కైవసం చేసుకున్న జనసేన
  • 117 స్థానాల్లో బీజేపీ గెలుపు
  • 162 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల విజయం
  • సీపీఐ(ఎం)15, కాంగ్రెస్ 9, బీఎస్పీ 3, ఇతర పార్టీలు 7 స్థానాల్లో గెలుపొందాయి.

కూటమి ఖాతాలో 27 జడ్పీ స్థానాలు.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ

ఇక జిల్లా పరిషత్‌ల లెక్కలోనూ కూటమిదే పైచేయి. మొత్తం 28 జెడ్పీ స్థానాలకు గాను.. 27 చోట్ల కూటమి విజయం సాధించింది. వైసీపీ ఒక్క స్థానానికే పరిమితమైంది. దీంతో స్థానిక సంస్థల్లోనూ కూటమి పట్టు స్పష్టమైంది. అయితే అసలు రాజకీయ ఎపిసోడ్‌ ఇప్పుడే మొదలైంది. జెడ్పీ చైర్మన్‌ పీఠాలపై ఎవరెవరు కూర్చుంటారన్నదే కీలకంగా మారింది. మిత్రపక్షాల మధ్య వాటాల లెక్క తెరపైకి వచ్చింది. 27 జడ్పీ స్థానాల్లో తమకూ వాటా కావాలంటున్నాయి జనసేన, బీజేపీ.

బరిలో సీనియర్లు.. రాజకీయ వారసులు

జెడ్పీ చైర్మన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొన్నిచోట్ల సీనియర్లు.. మరికొన్నిచోట్ల రాజకీయ నేతల వారసులు రేసులో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. సంఖ్యాబలం టీడీపీకి అనుకూలంగా ఉన్నా.. మిత్రపక్షాల ఆశలు మాత్రం చిన్నవి కావు. తమకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలంటూ జనసేన, బీజేపీ పట్టుబడుతున్నాయి. దీంతో ఏ జిల్లాలో ఎవరికి అవకాశం ఇవ్వాలి..? జనసేనకు ఎక్కడ ప్రాధాన్యం కల్పించాలి..? బీజేపీకి ఎన్ని జెడ్పీ చైర్మన్‌ స్థానాలు కేటాయించాలి..? అన్నదానిపై కూటమి పార్టీల మధ్య కసరత్తు సాగుతోంది. మరోవైపు జెడ్పీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం రేపోమాపో శ్రీకారం చుట్టే అవకాశముంది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ.. మిత్రపక్షాల మధ్య చర్చలు మొదలయ్యాయి. మరి ఫైనల్‌గా ఎవరికి ఏ పీఠం దక్కుతుందో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us