అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంగన్‌వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో 2 జారీ చేసింది. ఈ మేరకు వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా ప్రభుత్వం పరిగణించింది. దీంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వారితో ప్రభుత్వం పలుసార్లు చర్చలు కూడా జరిపింది. మంత్రి వర్గ ఉపసంఘంతో అంగన్‌వాడీ సంఘాల నేతలు చర్చించారు. అయితే జీతాలు పెంచేందుకు మాత్రం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్ పరిపాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. మరోవైపు ఎస్మాకు భయపడేది లేదని సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు చెబుతున్నారు.
‘ఎస్మా’ అంటే ఏమిటి..?
‘ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్‌టీనెన్స్ యాక్ట్’ (నిత్యవసర సేవల నిర్వహణ చట్టం)ను షార్ట్ కట్‌లో ఎస్మా అంటారు. హర్తాళ్లు, సమ్మెలు వంటి సమయాల్లో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ నిర్విరామంగా కొనసాగేలా చూసేందుకు 1981లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అత్యవసర సేవలు అందించేవారు.. విధుల్లోకి రాకుండా.. సమ్మె చేస్తే.. ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. ఎస్మా చట్టాన్ని అతిక్రమించి.. ఎవరైనా సమ్మెకు దిగితే.. వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జరిమానా, జైలు శిక్ష, లేదా రెండూ విధించే విధంగా నిబంధనలు ఉన్నాయి. ఎస్మా చట్టం ప్రయోగిస్తే.. సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..