Weather Alert: ఈదురుగాలులు, పిడుగులతో వానలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Weather Alert: ఈదురుగాలులు, పిడుగులతో వానలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక!
Ap And Telangana Weather Alert

Updated on: Oct 19, 2026 | 1:56 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దాని అనుబంధ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో, ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం నిలకడగా కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య ద్రోణి విస్తరించి ఉంది. దీనితో పాటు లక్షద్వీప్ నుంచి కర్ణాటక, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కూడా కొనసాగుతోంది.

కోస్తాంధ్ర – యానాం

సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో, గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మంగళవారం ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.

రాయలసీమ

సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే సూచనలున్నాయి. బుధవారం రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ వాతావరణ సూచన – హెచ్చరికలు

తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో కోస్తాంధ్ర మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us