ఏపీలో మళ్లీ రాజుకున్న ఎన్నికల వేడి.. ఈసీ ఏర్పాట్లు షురూ.. నవంబర్ 25లోగా పూర్తి?

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మున్సిపల్ ఎన్నికల సందడి మొదలుకానుంది. పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమవుతోంది. కోర్టు నుంచి అనుమతులు లభించడంతో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో రాజకీయ పోరు మొదలుకానుంది.

ఏపీలో మళ్లీ రాజుకున్న ఎన్నికల వేడి.. ఈసీ ఏర్పాట్లు షురూ.. నవంబర్ 25లోగా పూర్తి?
Urban Local Bodies Polls

Updated on: Nov 12, 2026 | 7:49 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మున్సిపల్ ఎన్నికల సందడి మొదలుకానుంది. పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమవుతోంది. కోర్టు నుంచి అనుమతులు లభించడంతో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో రాజకీయ పోరు మొదలుకానుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.

ఎన్నికలు జరగనున్న 23 పట్టణ స్థానిక సంస్థలు ఇవే!

రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, ఇప్పటికే 100 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల్లో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్లు:

1. శ్రీకాకుళం

2. కాకినాడ

3. రాజమహేంద్రవరం

4. మంగళగిరి-తాడేపల్లి

మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు:

ఆముదాలవలస, రాజాం, అల్లూరు, బి.కొత్తకోట, తాడిగడప, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, గుడివాడ, చింతలపూడి, నరసరావుపేట, పొన్నూరు, బాపట్ల, పొదిలి, కందుకూరు, గూడూరు, కావలి, శ్రీకాళహస్తి.

ఈ 23 పట్టణ స్థానిక సంస్థలకు నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే తుది షెడ్యూల్‌ను SEC అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రిజర్వేషన్లు ఖరారు.. పార్టీల్లో సీట్ల సర్దుబాటు!

ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో మేయర్, చైర్‌పర్సన్, వార్డు స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. నాలుగు కార్పొరేషన్లలో మొత్తం 260 డివిజన్లు, మిగిలిన 19 పట్టణ స్థానిక సంస్థల్లో 749 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు అధికార కూటమిలోనూ సీట్ల పంపకాలపై రాజకీయ కసరత్తు జరుగుతోంది. శ్రీకాకుళం, కాకినాడ కార్పొరేషన్లలో జనసేన, రాజమహేంద్రవరంలో బీజేపీ, మంగళగిరి-తాడేపల్లి పరిధిలో టీడీపీ పోటీ చేయనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లోనూ మూడు పార్టీల మధ్య స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు జరగనుంది.

కూటమికి మరో పరీక్ష.. వైసీపీ సవాల్!

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలతో ఉత్సాహంగా ఉన్న కూటమి పార్టీలు ఈ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాయి. మరోవైపు వైసీపీ కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి కూటమికి గట్టి పోటీ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తోంది. దీంతో పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచనున్నాయి. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపు, ప్రచార వ్యూహాలు రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us