ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను కష్టాలు వీడటం లేదు. భర్తపై పోరాటానికి దిగిన భార్య వాణి ఆందోళన 16వ రోజుకు చేరింది. మరో వైపు శ్రీనివాస్‌కి వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. టెక్కలి సెగ్మెంట్‌లో పార్టీ ఇన్‌చార్జ్‌గా ఆయనను తొలగించి, పేరాడ తిలక్‌ను నియమించింది. ఇకపై నియోజకవర్గ సమన్వయ బాధ్యత తిలక్‌దే అని స్పష్టం చేసింది. దువ్వాడ శ్రీనివాస్‌ని టెక్కలి ఇన్‌చార్జ్ పోస్ట్ నుంచి తప్పించారు వైసీపీ అధినేత జగన్. కొన్నిరోజులుగా కుటుంబ వివాదంతో రోడ్డున పడ్డ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంతో పార్టీ పలుచన అవుతుంది అనుకున్నారో ఏమో.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నాయుడిపై పోటీచేసి ఓడిపోయారు దువ్వాడ శ్రీను. అయితే అప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ హోదా ఉండడంతో అది మాత్రం ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. పార్టీ పరంగా మాత్రం నియోజకవర్గాన్ని సమన్వయ పరిచే కీలక బాధ్యతల నుంచి తప్పించారు జగన్. రెండు రోజుల క్రితం తన ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చారు దువ్వాడ. ఈ క్రమంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది.
అటు రాష్ట్రస్థాయిలో మరికొన్ని మార్పుల చేసింది వైసీపీ హైకమాండ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వేంపల్లి సతీష్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను నియమించింది. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి ఇటీవల ఆళ్ల నాని రాజీనామా చేయడంతో ఆ పోస్ట్‌ను దూలం నాగేశ్వరరావుకు ఇచ్చారు. అటు యువజన విభాగం- రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాను నియమించారు. ఎస్సీ విభాగం- మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం- గంజి చిరంజీవి, బీసీ విభాగం- ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..