USA: కదం తొక్కిన అమెరికన్లు.. ‘కావాల్సింది గన్స్‌ కాదు, రక్షణ’ అంటూ నినాదాలు..

|

Jun 12, 2022 | 8:08 AM

USA: ప్రపంచానికి పెద్దన్న, అగ్రరాజ్యం, స్వేచ్ఛకు కేరాఫ్‌ అడ్రస్‌ ఇవీ.. అమెరికా గురించి అందరికీ తెలిసింది. అయితే ఇలాంటి అగ్రరాజ్యాన్ని సైతం గన్‌ కల్చర్‌ కలవరపెడుతోంది...

USA: కదం తొక్కిన అమెరికన్లు.. కావాల్సింది గన్స్‌ కాదు, రక్షణ అంటూ నినాదాలు..
Follow us on

USA: ప్రపంచానికి పెద్దన్న, అగ్రరాజ్యం, స్వేచ్ఛకు కేరాఫ్‌ అడ్రస్‌ ఇవీ.. అమెరికా గురించి అందరికీ తెలిసింది. అయితే ఇలాంటి అగ్రరాజ్యాన్ని సైతం గన్‌ కల్చర్‌ కలవరపెడుతోంది. అమెరికాను పట్టి పీడిస్తున్న వినాశకరమైన తుపాకీ సంస్కృతితో ఏటా ఎంతో మంది అమెరికన్లు బలి అవుతున్నారు. తుపాకులు విరివిగా లభించడంతో వాటి ఉపయోగం కంటే దుర్వినియోగమే ఎక్కువగా జరుగుతోంది. అమెరాకాలో కాల్పులకు సంబంధించిన సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దీంతో ఈ గన్‌ కల్చర్‌కు ముగింపు పలకాలని అమెరికన్లు నినదించే పరిస్థితి వచ్చింది. తమకు కావాల్సింది గన్స్‌ కాదు, రక్షణ అంటూ శనివారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ నిరసనలు తెలిపారు.

వాషింగ్టన్‌లోని నేషనల్‌ మాల్‌లోకి చేరుకున్న ప్రజలు నినాదాలు చేశారు. అక్కడ తుపాకీ హింస నివారణ బృందం 45,000 పై చిలుకు పువ్వులను ఏర్పాటు చేసింది. గన్‌ కల్చర్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘గన్స్ కాదు.. ప్రజలను రక్షించండి’ అంటూ అమెరికన్లు పెద్ద ఎత్తున నినదించారు. ‘మార్చ్‌ ఫర్‌ అవర్‌ లైవ్స్‌’ పేరిట భారీ ప్రదర్శన చేపట్టారు. చిన్నారులను కాల్చి చంపుతుండడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. గన్‌ కల్చర్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. ర్యాలీలో పాల్గొన్న వారు ‘యామ్ ఐ నెక్స్ట్.?, బుక్స్.. నాట్ బుల్లెట్ ప్రూఫ్ బ్యాక్ ప్యాక్స్’వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

తుపాకీ చట్టాలను మరింత కఠినంగా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాల్పులను నేరస్థుడి మానసిక ఆరోగ్య సమస్యగా చిత్రీకరనిస్తున్నారు. కానీ దానిని ఆయుధాల సమస్యగా భావించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా గన్స్‌ను పూర్తిగా నిషేధించడంపై రిపబ్లికన్‌ సభ్యులు వ్యతిరేకంగా ఉండడంతోనే చట్టాల మార్పులు సాధ్యంకావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..