Loneliness| ఒంటరితనం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని 87 ఏళ్ల నాటి సుదీర్ఘ ప్రయోగంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం ఓ వ్యక్తి సంతోషం, ఆరోగ్యంపై ఒంటరితనం ప్రభావం ఉంటుందని IFL సైన్స్ రీసెర్చ్ నివేదించింది. హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్‌మెంట్ 1938లో రెండు వేర్వేరు అధ్యయనాలు ప్రారంభించింది. మొదటిది గ్రాంట్ స్టడీ. దీనికి విలియం టి. గ్రాంట్ ఫౌండేషన్ నిధులు సమకూర్చింది. డాక్టర్ జార్జ్ ఇ. వైలెంట్(George E. Vaillant) నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం(Harvard University)లో 268 మంది అండర్ గ్రాడ్యుయేట్ పురుష విద్యార్థుల తో పాటు బోస్టన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 456 మంది పురుషుల మీద కూడా ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొనేవారిని జీవితకాలమంతా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వారి వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటున్నారా అని తెలుసుకోవడం ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం. ఇందులో పాల్గొన్నవారిలో US అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ(John F Kennedy) కూడా ఉన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు కొద్ది మంది ఇప్పటికీ బతికే ఉన్నారు. దీంతో వారి పిల్లలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సైకియాట్రిస్ట్ డాక్టర్ రాబర్ట్ వాల్డింగర్(Robert Waldinger) నాయకత్వం వహిస్తున్నారు.
ఈ అధ్యయనంలో ముఖ్యంగా తేలింది ఏంటంటే మనం ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని 2017లో ది హార్వర్డ్ గెజెట్‌లో వాల్డింగర్ తెలిపారు. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మీ సంబంధాలను చూసుకోవడం కూడా అంతే ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా COVID-19 లాంటి క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఒంటరితనం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం ద్వారా కనుగొన్నారు. ఇతర అధ్యయనాల ప్రకారం, ఒంటరితనం ప్రభావాలు ధూమపానం లేదా ఊబకాయం వల్ల ఉంటాయని తేలాయి. వృద్ధులలో, ఒంటరితనం గుండె జబ్బులకు కారణమవుతుంది. అయితే ఇందుకు విరుద్ధంగా, సామాజిక సంబంధాలను కలిగి ఉండటం కూడా మెరుగైన మెదడు ఆరోగ్యానికి దారితీస్తుంది.
ఒంటరితనం(Loneliness) అనేది తీవ్రమైన సమస్యగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. ఈ సమస్యను ప్రపంచ ప్రజారోగ్య ప్రాధాన్యతగా గుర్తించాలని పిలుపునిచ్చింది. కొంతమంది వ్యక్తులు ఎక్కువ మందితో కలిసి జీవించలేరని.. ఎంత మందితో ఉన్నామనే దాని కంటే సంబంధాలు ఎంత బలంగా ఉంటున్నాయో ఆలోచిస్తారని వాల్డింగర్ పేర్కొన్నారు.