Ayman al-Zawahiri Death: పక్కా ప్లాన్‌తో అల్ జవహరిని మట్టుబెట్టిన అమెరికా.. CIA ఆపరేషన్‌ గురించి ఆసక్తికర విషయాలు

|

Aug 04, 2022 | 11:52 AM

Al Qaeda leader Ayman al-Zawahiri Death: క్షిపణి దాడిలో అల్ జవహరిని హతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన తర్వాత అసలు అమెరికా ఆ కరుడు గట్టిన ఉగ్రవాదిని ఎలా ట్రాక్ చేసిందన్న చర్చ మొదలైంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి. 

Ayman al-Zawahiri Death: పక్కా ప్లాన్‌తో అల్ జవహరిని మట్టుబెట్టిన అమెరికా.. CIA ఆపరేషన్‌ గురించి ఆసక్తికర విషయాలు
Al Qaeda leader Ayman al-Zawahiri (File Photo)
Follow us on

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి(al-Zawahiri)ని అంతమొందించేందుకు అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (CIA) ఎప్పటినుండో ప్లాన్ చేసింది. అల్ జవహరి ఎక్కడ ఉంటున్నారో ఖచ్చితమైన సమాచారం వచ్చిన తర్వాత… అతడ్ని అంతమొందించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లింది. క్షిపణి దాడిలో అల్ జవహరిని హతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన తర్వాత అసలు అమెరికా ఆ కరుడు గట్టిన ఉగ్రవాదిని ఎలా ట్రాక్ చేసిందన్న చర్చ మొదలైంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి.  అమెరికాలో 9/11 దాడుల సూత్రధారి అయిన అల్ జవహరి ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఆచూకీని గుర్తించి మట్టుబెట్టేందుకు అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది.

అల్ జవహరికి మద్దతు ఇచ్చే ఒక నెట్‌వర్క్ గురించి అమెరికా తెలుసుకుంది. గత ఏడాది ఆఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిన తరువాత, ఆ దేశంలో అల్ ఖైదా అగ్రనేతల ఉనికిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఈ ఏడాది అల్ జవహరి కుటుంబం.. కాబూల్‌లో ఒక సురక్షిత ప్రాంతంలోని ఇంటికి మారినట్టు సమాచారం అందింది. ఆ తరువాత అల్ జవహిరి కూడా అదే ఇంట్లో ఉన్నట్టు అమెరికా ఇంటెలిజన్స్ అధికారులు గుర్తించారు.

కొన్ని నెలల పాటు సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(CIA) అధికారులు అల్ జవహిరి కదలికలను గమనిస్తూ వచ్చారు. ఆయన అదే ఇంట్లో ఉంటున్నట్టు ధ్రువీకరించుకున్నారు. ఏప్రిల్‌లో ఈ సమాచారాన్ని అమెరికా సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సీఐఏ అందించింది. తరువాత, నేషనల్ సెక్యూరిటీ సలహాదారు జాక్ సుల్లివన్ ఈ సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌కు అందించారు. జవహరి కదలికలపై సీఐఏ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.  అల్ జవహిరి కాబుల్‌లో ఇంటికి మారిన తరువాత, ఇల్లు విడిచి ఎప్పుడూ బయటకు వెళ్లలేదని నిర్థారించుకున్నారు. చాలాసార్లు ఆ ఇంటి బాల్కనీలో ఒంటరిగా తిరుగుతూ ఉండటాన్ని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. అలాగే బాల్కనీలో ఒంటరిగా ఉంటూ చదువుకునే అలవాటు జవహరికి ఉందని గుర్తించారు.  జవహరి నివసిస్తున్న ఆ ఇంటి నిర్మాణం, స్వభావాన్ని, అందులో నివసిస్తున్న వారిని నిశితంగా పరిశీలించారు. బైడెన్ సూచన మేరకు అల్ జవహరి ఇంట్లో నివసిస్తున్న ఆయన కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఏ హానీ కలగకుండా ఆపరేషన్ నిర్వహించేందుకు అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ప్రతిరోజూ ఉదయాన తన కాబూల్ సేఫ్ హౌస్ బాల్కనీలో కొంతసేపు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారనే విషయం గుర్తించారు. ఈ అలవాటే జవహరి కొంపముంచింది.  ఈ విషయాన్ని నిర్థారించుకున్న తర్వాత సీఐఏ  అల్ జవహరి బాల్కనీలో ఉండగా.. క్షిపణి దాడితో అంతమొందించింది. ప్లాన్ ప్రకారం జవహరి ఇంట్లో ఇతరులు ఎవరికీ చిన్న గాయమైనా కాకుండానే తన మిషన్‌ను సీఐఏ పూర్తి చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..