ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ-7 సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పర్సనల్ విషయాలపై నోరు జారారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి తన భార్య (ఫస్ట్ లేడీ) మెలనియాకు తెలుసునని ఆయన అన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ జర్నలిస్టు ఇరాన్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా… తమ దేశ రియల్ ఎస్టేట్ గురించి.. నార్త్ కొరియా, కిమ్ గురించి నాలుగు ముక్కలు మాట్లాడాడు. ‘ బై ది వే ! నార్త్ కొరియా అన్నా, కిమ్ అన్నా నాకెంతో గౌరవం.. అలాగే కిమ్ గురించి మెలనియాకు కూడా తెలుసు. బహుశా ఆమె నాతో ఏకీభవిస్తుందని అనుకుంటున్నా.. ‘ అన్నారు. కిమ్ మంచి రాజకీయ పరిణతి గల నేత అని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ వెంటనే వివరణ ఇచ్చింది. మెలనియా ట్రంప్ అసలు కిమ్ ని కలుసుకోనేలేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ స్పష్టం చేశారు. కిమ్ కు సంబంధించిన అన్ని విషయాల గురించి ట్రంప్ తన భార్యతో పంచుకుంటారని, కానీ… మెలనియా కిమ్ ను ఎప్పుడూ కలుసుకోలేదని ఆమె పేర్కొన్నారు.
2018 జూన్ లో సింగపూర్ లో మొట్టమొదటిసారిగా ట్రంప్ కిమ్ తో భేటీ అయ్యారు. తన వెంట తన భార్య ఇక్కడికి రావాల్సి ఉన్నప్పటికీ, విమాన ప్రయాణం చేయవద్దని డాక్టర్లు ఆమెకు సలహా ఇచ్చారని ఆయన చెప్పారు. అంతకుముందు నెలలోనే ఆమెకు పెద్ద ఆపరేషన్ (నాలుగు గంటలపాటు) జరిగిందన్నారు. ఇలా అంతర్జాతీయ భేటీల్లో ట్రంప్ తన పర్సనల్ విషయాలు మాట్లాడడం, దాన్ని ఖండిస్తున్నట్టుగా వైట్ హౌస్ వివరణలు ఇవ్వడం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.