SRILANKA CRISIS: శ్రీలంకలో మరింత ముదిరిన ఆర్థిక సంక్షోభం.. హ్యాండిచ్చిన డ్రాగన్.. ఆదుకునే దిశగా భారత్

| Edited By: Ram Naramaneni

Mar 31, 2022 | 3:34 PM

శ్రీలంక పర్యాటక రంగం దెబ్బతినడం ప్రారంభమైంది. అదే క్రమంలో 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి విరుచుకుపడడం శ్రీలంకకు శాపంగా మారింది. అప్పటి నుంచి శ్రీలంక కోలుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం శ్రీలంక తీవ్రమైన ఆహార, ఆర్థిక సంక్షోభాలను...

SRILANKA CRISIS: శ్రీలంకలో మరింత ముదిరిన ఆర్థిక సంక్షోభం.. హ్యాండిచ్చిన డ్రాగన్.. ఆదుకునే దిశగా భారత్
Gotabaya Rajapaksa, Modi, Jinping
Follow us on

SRILANKA CRISIS WORSENING FURTHER CHINA ESCAPED INDIA TO HELP: సుందర ద్వీప దేశం శ్రీలంక అయోమయ స్థితిలో పడిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఆదేశాన్ని ముంచెత్తింది. కరోనా (CORONAVIRUS) కష్టకాలంలో మొదలైన దుష్పరిణామాలు తాజాగా రష్యా(russia), యుక్రెయిన్(ukraine) యుద్ధం కారణంగా మరింత పెరిగిపోయాయి. శ్రీలంక ఇప్పుడు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థికంగా హీనస్థితిలో కి దిగజారిపోయింది. గతంలో 26 ఏళ్ళపాటు ఎల్టీటీఈ కారణంగా కొనసాగిన అంతర్యుద్ధం అప్పట్లో శ్రీలంకను ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఎల్టీటీఈని పూర్తిగా అంతం చేసిన తర్వాత శ్రీలంక క్రమంగా కోలుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ కరోనా కారణంగా మళ్ళీ ఆ దేశంలో దుష్పరిణామాలు మొదలయ్యాయి. శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగమే. ప్రపంచంలో పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని పొందుతున్న తొలి పది దేశాలలో శ్రీలంక ఒకటి. శ్రీలంక గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GDP)లో 10 శాతం పర్యాటక రంగానిదే. విదేశీ పర్యాటకుల ద్వారా శ్రీలంకకు భారీ ఎత్తున విదేశీ కరెన్సీ వచ్చేది. కానీ 2020 మార్చి తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం లాక్ డౌన్‌లో పడిపోయిన సందర్భంలో శ్రీలంక (SRILANKA) దారుణంగా దెబ్బతిన్నది. ఆదేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది కరోనా లాక్ డౌన్ (CORONA LOCK-DOWN). టూరిజం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న లక్షలాదిమంది ఉపాధి కరువై రోడ్డున పడ్డారు. ప్రతి సంవత్సరం 360 కోట్ల అమెరికన్ డాలర్లను శ్రీలంక పర్యాటక రంగం ద్వారా పొందుతూ ఉండేది. కానీ కరోనా ప్రభావిత సంవత్సరంలో అది ఒక్కసారిగా 60 కోట్ల అమెరికన్ డాలర్లకు పడిపోయింది. దాంతో టూరిజం మీద ఆధారపడి బతుకుతున్న దాదాపు 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈకారణంగా ఆర్థిక వ్యవస్థ కునారిల్లి పోయింది. అయితే కరోనా కంటే ముందే 2019 సంవత్సరంలో ఈస్టర్ పండుగ నాడు 3 స్టార్ హోటల్స్, మరో మూడు చర్చిల పైన జరిగిన బాంబు దాడులు శ్రీలంక పర్యాటక రంగాన్ని పెద్ద దెబ్బ కొట్టాయి. ఆనాటి పేలుళ్ళలో మొత్తం 45 మంది విదేశీ పర్యాటకులు మరణించారు. ఆ వరుస పేలుళ్లలో మొత్తం 269 మంది దుర్మరణం పాలు కాగా వందలాది మంది గాయపడ్డారు. అప్పటి నుంచి శ్రీలంక పర్యాటక రంగం దెబ్బతినడం ప్రారంభమైంది. అదే క్రమంలో 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి విరుచుకుపడడం శ్రీలంకకు శాపంగా మారింది. అప్పటి నుంచి శ్రీలంక కోలుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం శ్రీలంక తీవ్రమైన ఆహార, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటుంది. సాయం చేసే దేశాల వైపు వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది.

నిజానికి 2019 కంటే ముందే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైంది. అప్పట్లో లంక పాలకులు అవలంబించిన అనాలోచిత విధానాల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. రుణభారం పెరిగిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. పాలకుల అనాలోచిత విధానాలు కొనసాగుతున్న తరుణంలోనే 2019 బాంబు పేలుళ్ళు.. ఆ తర్వాత క్రమంలో కరోనా లాక్ డౌన్లు దేశాన్ని అతలాకుతలం చేశాయి. అన్నిరకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలు చుక్కలనంటాయి. ఫలితంగా దేశంలో ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతానికి ఎగబాకింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు లంక ప్రభుత్వం 7,586 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ప్యాకేజీని ప్రకటించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పాలు, బియ్యం, కోడిగుడ్లు, చక్కెర, కిరోసిన్, చికెన్, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు ఆకాశాన్నంటాయి. ఒక కోడి గుడ్డు 300 రూపాయలు పలికింది అంటే శ్రీలంక లో ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ లీటర్ 283 రూపాయలకు చేరింది. శ్రీలంక తాజాగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో గంటలకొద్దీ కరెంటు కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన డీజిల్ కొరత ఏర్పడడంతో అవసరమైన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ప్రతి రోజు 10 గంటలకు పైగా కరెంటు కోత విధించాల్సి వస్తుంది. డిమాండ్‌కు అనుగుణంగా కరెంటు ఉత్పత్తి కావడం లేదని, కరెంటు కోతలు తప్ప మరోదారి లేదని ఆ దేశపు విద్యుత్ బోర్డు వెల్లడించింది. కరెంటు కోతలు ఆదేశ ఆదాయ వనరుల పైన మరింత ప్రభావం చూపుతున్నాయి. విద్యుత్ కోత కారణంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు సాయంత్రం కాగానే మూసి వేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారులు సైతం సాయంత్రం కాగానే తమ దుకాణాలను మూసి వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కొన్ని క్యాండిల్ వెలుగులో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే మెడిసిన్స్‌కి కూడా లంకేయులు ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన జబ్బులు లంకేయులను ముంచెత్తాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు మెడిసిన్స్ కూడా దొరకని దుస్థితి ఏర్పడింది.

రాజపక్సే సోదరులు పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత లంక ఆర్థిక సంక్షోభం దిశగా మళ్ళింది. వారి చైనా అనుకూల వైఖరి లంకకు శాపంగా మారింది. రుణభారంలోకి నెట్టింది. అదేసమయంలో 2019లో లంకలో మూడు హోటళ్ళు, మూడు చర్చిలపైనా బాంబు దాడులు జరిగాయి. 269 మంది మరణించారు. ఇది విదేశీ పర్యాటకులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ దేశానికి పెద్ద ఎత్తున వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. లంకకు రావడానికి విదేశీ పర్యాటకులు భయపడిపోయారు. దాంతో పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. విదేశీ మారకద్రవం రాకడ కూడా తగ్గిపోయింది. అదేక్రమంలో 2020 మార్చి నెలలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ప్రపంచవ్యాప్ంగా లాక్ డౌన్లు అమల్లోకి వచ్చాయి. ఇది లంకను మరింత సంక్షోభంలోకి నెట్టింది. పర్యాటక రంగం మూగబోయింది. విదేశీ పర్యాటకుల రావడం నిలిచిపోయింది. అసలే అంతంత మాత్రంగా వున్న విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కనిష్ట స్థాయికి చేరాయి. ఈ పరిస్థితి రెండో విడత కరోనా తాకిడి తర్వాత మరింత ముదిరింది. కరోనా ప్రభావం తగ్గి మెల్లిగా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది అనుకుంటున్న తరుణంలో రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్దం మొదలైంది. నిజానికి శ్రీలంకకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో హెచ్చుశాతం రష్యా, యుక్రెయిన్ దేశాల నుంచే వుంటుంది. యుద్దం కారణంగా ఆ రెండు దేశాలకు చెందిన పర్యాటకులు రావడం నిలిచిపోయింది. ఇది లంక ఆదాయ వనరుపై దారుణంగా దెబ్బకొట్టింది.

సహజ సిద్ధంగా ఏర్పడిన కారణాలు, అదేసమయంలో ముంచెత్తిన కరోనా, వీటన్నింటికీ తోడు ఆ దేశ పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అనుసరించిన అనాలోచిత విధానాలు.. శ్రీలంక ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి కారణమని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు భావిస్తున్నారు. 2007వ సంవత్సరంలో శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేంద్ర రాజపక్సే (MAHENDRA RAJAPAKSA) ఆ దేశాన్ని రెండు దశాబ్దాలకు పైగా వేధిస్తున్న ఎల్టీటీఈ అణచివేతపైనే ముందుగా దృష్టి సారించారు. 2009వ సంవత్సరంలో జరిపిన భారీ సైనిక చర్య ద్వారా ఎల్టిటీఈ (LTTE) అధినేత ప్రభాకరన్‌ని మట్టు పెట్టింది శ్రీలంక ప్రభుత్వం. దాంతో శ్రీలంకలో 26 సంవత్సరాల పాటు కొనసాగిన అంతర్యుద్ధం ముగిసిపోయింది. అయితే ఎల్టీటీఈని విజయవంతంగా మట్టుపెట్టిన తర్వాత రాజపక్సే తీసుకున్న నిర్ణయాలకు ఎదురే లేకుండా పోయింది. అదే ఊపులో మహేంద్ర తీసుకున్న ఆర్థికపరమైన విధానాలు శ్రీలంకను సంక్షోభం దిశగా మళ్ళించాయి. 2015 సంవత్సరంలో రాజపక్సే ఓటమిపాలై మైత్రిపాల సిరిసేన (MAITRIPALA SIRISENA) అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన కూడా రాజపక్సే అనుసరించిన విధానాలనే కొనసాగించారు. 2019లో మహేంద్ర సోదరుడు గొటబాయే రాజపక్సే (GOTABAYA RAJAPAKSA) శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అంతకుముందు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన మహేంద్ర రాజపక్సే మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఈసారి ఆయన ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా మహేంద్ర మరో సోదరుడు బాసిల్ రాజపక్సే పదవీ బాధ్యతలు చేపట్టారు. వారి ఇంకొక సోదరుడు జయంత్ రాజపక్సే అంతర్గత భద్రత, శాంతిభద్రతల శాఖ బాధ్యతలు చేపట్టారు. ఈ నలుగురు సోదరులు తీసుకున్న నిర్ణయాలు శ్రీలంక దేశాన్ని తీవ్రమైన సంక్షోభంలో కి నెట్టేశాయి. రాజపక్సే సోదరులు ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాల పన్నులు తగ్గించడం ఆదేశ ఆదాయంపై పెను ప్రభావం చూపింది. దాంతో నగదు ముద్రణను భారీస్థాయిలో పెంచారు. ఒక్కసారిగా 42 శాతం ఎక్కువగా కరెన్సీ నోట్లను ముద్రించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక కరెన్సీ వ్యాల్యూ దారుణంగా పడిపోయింది. ఇంకోవైపు ఇండియాను ఇబ్బంది పెట్టే వ్యూహంలో భాగంగా శ్రీలంకకు దగ్గరైనా చైనా కూడా ఆదేశాన్ని ఆదుకునేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం శ్రీలంక వద్ద కేవలం వంద కోట్ల అమెరికన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. రాజపక్సే సోదరులు అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇండియాతో దశాబ్దాల పాటు కొనసాగిన సన్నిహిత సంబంధాలకు చెక్ పెట్టారు. డ్రాగన్ కంట్రీకి దగ్గరయ్యారు. దాదాపు 350 కోట్ల అమెరికన్ డాలర్ల మేరకు శ్రీలంక చైనా నుంచి రుణాన్ని పొందింది. ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేని దుస్థితిలోకి శ్రీలంక పడిపోయింది. నిజానికి శ్రీలంకకు భారీ స్థాయిలో రుణం ఇవ్వడం వెనుక డ్రాగన్ కంట్రీ పెద్ద వ్యూహాన్ని అనుసరించింది. ఇండియాను ఇబ్బందులకు గురి చేసే వ్యూహంలో భాగంగా నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలకు చైనా భారీ ఎత్తున రుణాలు మంజూరు చేసింది. అందులో భాగంగానే శ్రీలంకకు 350 కోట్ల అమెరికన్ డాలర్ల మేరకు రుణాన్ని అందించింది. తద్వారా శ్రీలంకలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని వ్యూహరచన చేసింది. పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి శ్రీలంకకు చెందిన కీలకమైన హంబన్‌టోట నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాల కాలానికి గాను 70 శాతం నియంత్రణతో చైనా తీసేసుకుంది. తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు ఇపుడు చైనా ఏ విధంగానూ సాయం అందించడం లేదు. సాయం చేయాలన్న శ్రీలంక విజ్ఞప్తులను చైనా పాలకులు బేఖాతరు చేస్తున్నారు. ఈ సమయంలో అడగకపోయినా సాయమందించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు శ్రీలంక ఆర్థికమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హామీ ఇచ్చారు. ఇండియాను ఇబ్బందులకు గురి చేసే వ్యూహంతో లంకకు దగ్గరైన డ్రాగన్ కంట్రీ ఆదేశం సంక్షోభంలో ఉన్న తరుణంలో మాత్రం ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. డ్రాగన్ కంట్రీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయే రాజపక్సే.. ఇపుడు ఇండియాపైనే ఆశలు పెట్టుకున్నారు. పొరుగుదేశంతో సఖ్యతను కోరుకుంటున్న భారత ప్రభుత్వం శ్రీలంకను గట్టెక్కించే చర్యలపై దృష్టి సారిస్తూ.. దక్షిణాసియాలో పెద్దన్న పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతోంది.