Space war: అంతరిక్ష యుద్ధం అనివార్యమా?.. కయ్యానికి కాలు దువ్వుతున్న అగ్రరాజ్యాలు..

|

Dec 29, 2021 | 2:31 PM

అగ్రరాజ్యాల మధ్య అంతరిక్ష యుద్ధం జరగబోతుందా.. అమెరికా, చైనాల మధ్య అంతరిక్ష యుద్ధానికి శ్రీకారం చూడుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది.

Space war: అంతరిక్ష యుద్ధం అనివార్యమా?.. కయ్యానికి కాలు దువ్వుతున్న అగ్రరాజ్యాలు..
War
Follow us on

అగ్రరాజ్యాల మధ్య అంతరిక్ష యుద్ధం జరగబోతుందా.. అమెరికా, చైనాల మధ్య అంతరిక్ష యుద్ధానికి శ్రీకారం చూడుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. అంతరిక్షంలో వారు పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్న స్పేస్ సెంటర్లే యుద్ధానికి కారణం కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ కేంద్రం ఐఎస్ఎస్‎కు పోటీగా చైనా తియాంగాంగ్ కేంద్రం ఏర్పాటు చేసింది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు తియాంగాంగ్‎పై దాడికి యత్నించాయంటూ చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణీత కక్ష్యను దాటి తియాంగాంగ్‎ను ఢీకొనే దూరానికి వచ్చిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాలు వెళ్లినట్లు ఆరోపిస్తోంది.

అమెరికా కుట్రలో భాగమేనా?

చైనా అంతరిక్ష పరిశోధనలను లక్ష్యంగా చేసుకుని కావాలని స్పేస్ ఎక్స్ సంస్థ ఈ పనిచేసిందని అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా మధ్య ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య ఇప్పటికే ప్రారంభమైన ప్రచ్చన్న అంతరిక్ష యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది.

తియాంగాంగ్ కు తప్పిన పెను ముప్పు..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) పోటీగా చైనా తన అంతరిక్ష కేంద్రం ‘తియాంగాంగ్’ నిర్మిస్తోంది. భూమి దిగువ కక్ష్య (భూమి నుంచి 340 కి.మీ నుంచి 450 కి.మీ ఎత్తు)లో తియాంగాంగ్ నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో భాగంగా 2021 ఏప్రిల్ 29న తియాన్హే మాడ్యూల్‎ను విజయవంతంగా ప్రయోగించింది. తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి 11 మాడ్యుల్లను ప్రయోగించనుంది. అనంతరం ముగ్గురు క్రూ సిబ్బందిని షెంజూ-13 అంతరిక్ష నౌక ద్వారా తియాన్హే మాడ్యూల్ వద్దకు చేర్చింది. మాడ్యూల్ ద్వారా పరికరాలతో తియాంగాంగ్‎లో చైనా వ్యోమగాములు పనులు చేపట్టింది. అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ పనులు 2022 నాటికి పూర్తవుతాయని చైనా చెబుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తియాంగాంగ్ భూమికి 390 కి.మీ ఎత్తు కక్ష్యలో పరిభ్రమిస్తోంది. భూ దిగువ కక్ష్యలో కృత్రిమ గ్రహాల సంఖ్య పెరుగుతుండడంతో కక్ష్య మార్గాలు ఇరుగ్గా మారుతున్నాయి.

ఎలన్ మస్క్ ఉపగ్రహం గతి తప్పిందో, గతి తప్పించారో?

అమెరికా పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ లింక్- 1095 ఉపగ్రహం ప్రయోగించింది. ఇప్పటికే 2000 వరకు శాటిలైట్స్ ప్రయోగించారు. 12,000 శాటిలైట్లను ప్రయోగించేందుకు ఇప్పటికే స్పేస్ ఎక్స్‎కు అమెరికా అధికార సంస్థ అనుమతిచ్చింది. ఈ శ్రేణిలోనిదే స్టార్ లింక్ 1095 ఉపగ్రహం. నిజానికి స్టార్ లింక్ 1095 కక్ష్య 555 కి.మీ ఎత్తులో ఉంటుంది. 2021 మే 16 నుంచి జూన్ 24 వరకు అది కిందికి వచ్చి 382 కి.మీ ఎత్తులోకి కక్ష్యలో ప్రవేశించింది. 2021 జులై 1న తియాంగాంగ్‎కు అతిచేరువగా వచ్చింది.

ముప్పును పసిగట్టడంతో తప్పించుకున్న చైనా వ్యోమగాములు.

ముప్పును పసిగట్టిన చైనా వ్యోమగాములు తియాంగాంగ్‎ను అతి కష్టంగా స్టార్ లింక్ మార్గం నుంచి తప్పించారు. 2021 సెప్టెంబర్‎లో భూ వాతావరణంలోకి ప్రవేశించిన స్టార్ లింక్ 1095 కాలిపోయింది. ఇటీవల అక్టోబర్‎లో స్టార్ లింక్ 2305 ఉపగ్రహం సైతం కక్ష్యను మార్చుకుంటూ తియాంగాంగ్‎ సమీపంలోకి వచ్చింది. అప్పుడు తియాంగాంగ్ వ్యోమగాములు కక్ష్యను తప్పించి ప్రమాదం నుంచి గట్టెక్కించారు. అనంతరం స్టార్ లింక్ 2305 ఉపగ్రహం 550 కి.మీ కక్ష్యలోకి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అమెరికాపై చైనా ఆగ్రహం…

స్పేస్ ఎక్స్ ఉపగ్రహాల కారణంగా రెండు సార్లు తియాంగాంగ్ ప్రమాదం అంచుల్లోకి వెళ్లడంతో ఆగ్రహంతో చైనా ఆగ్రహంగా ఉంది. వియాన్నాలోని ఐక్యరాజ్య సమితి స్పేస్ ఏజెన్స కి ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ స్పేస్ లా ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నడుచుకోవాల్సి ఉంటుంది. అమెరికాతో పాటు చైనా సైతం అంతరిక్షాన్ని ఉపగ్రహాలతో నింపివేస్తున్నదని హార్వర్డ్ ఖగోళ శాస్త్రవేత్త మెక్ డోవెల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2007లో యాంటి శాటిలైట్ పరీక్షలను చైనా మిలిటరీ జరిపిందని వెల్లడించారు.

చైనా నుంచి పోటీ మొదలైంది.. నాసా పాలనాధికారి బిల్ నీల్సన్…

చైనా అంతరిక్ష ప్రయోగాలతో అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి సవాల్ మొదలైందని నాసా పాలనాధికారి బిల్ నీల్సన్ అన్నారు. అమెరికాకు చైనా ఏకైక పోటీ దేశంగా మారిందని వ్యాఖ్యానించారు. చంద్రునిపైకి మనుషులను తీసుకుపోయే ప్రాజెక్టుకు అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్ నిధులు మంజూరు చేయాలని నీల్సన్ కోరారు. ఇప్పటివరకు అంతరిక్షంలో ఐఎస్ఎస్ ఉండగా తాజాగా చైనా తియాంగాంగ్ కేంద్రం రానున్న నేపథ్యంలో అంతరిక్ష కార్యక్రమాల్లో ఇరుదేశాల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. 1998లో ఏర్పాటైన ఐఎస్ఎస్ నిర్మాణంలో అమెరికా, రష్యా, యూరోప్, జపాన్, కెనడా పాలుపంచుకున్నాయి. 23 ఏళ్లలో 19 దేశాలకు చెందిన 200కు పైగా వ్యోమగాములు ఐఎస్ఎస్ సందర్శించారు. కానీ వీరిలో చైనా వ్యోమగాములు లేరు.

2011 నుంచి చైనా, నాసా(అమెరికా మధ్య) విభేదాలు..

గూఢచారం వ్యవహారంలో కాంగ్రెస్ ది వుల్ఫ్ అమెండ్ మెంట్ (సవరణ) ఆమోదించిన తర్వాత చైనాకిచ్చే సహకారం నిలిపివేశారు. ఈ నేపథ్యంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించాలని చైనా నిర్ణయం తీసుకుంది. ఈ వ్యూహంలో భాగంగా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మిస్తోంది. మరోవైపు ఐఎస్ఎస్ 2024లో విరమించాలని నాసా భావిస్తోంది. ఐఎస్ఎస్ జీవిత కాలం పొడిగించాలన్నదానిపై ప్రాజెక్టులో పాలుపంచుకున్న దేశాలనుంచి ఇప్పటివరకు స్పందన లేకపోవడంతో అమెరికాపై ఒత్తిడి నెలకొంది. ఐఎస్ఎస్ విరమణ జరిగితే అంతరిక్షంలో మిగిలే ఒకే ఒక అంతరిక్ష కేంద్రం చైనా తియాంగాంగ్ మాత్రమే అవుతుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు అమెరికాకు మింగుడు పడడం లేదు.

అమెరికా- చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

చైనా చర్యలతో ఆ చైనా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా-చైనా మధ్య నెలకొన్న విరోధం అమెరికా-సోవియట్ యూనియన్(రష్యా)తో ప్రచ్ఛన యుద్ధం వాతావరణాన్ని తలపిస్తోంది. మరోవైపు తమ తియాంగాంగ్ కేంద్రంలో పాలుపంచుకోవాలని చైనా విదేశీ వ్యోమగాములకు ఆహ్వానిస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2035 నాటికి రష్యాతో కలిసి సంయుక్త పరిశోధన కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయనుంది.

చంద్రుడిపై పరిశోధన, బాధ్యతాయుతమైన ప్రయోగాలు చేపట్టేందుకు అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సంకీర్ణం బృందం ఏర్పాటు అయింది. 2020 మే నెలలో విడుదల చేసిన అర్టిమిస్ ఒప్పందంగా పిలుస్తున్న ఈ పత్రంపై ( అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, లక్సెంబర్గ్, ఇటలీ, యూకే, యూఏఈ, ఉక్రెయిన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, బ్రెజిల్) 12 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై చైనా, రష్యాలు సంతకం చేయలేదు.

Read Also.. Omicron Variant: మరోసారి కలవరపెడుతున్న కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ ముప్పు ఎక్కువే అంటున్న WHO