Russia Ukraine War: ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. 13 మంది దుర్మరణం.. వీడియో..

|

Oct 10, 2022 | 7:33 PM

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం మొదలై నేటికి 229 రోజులు. క్రిమియాకు దారితీసే వంతెనను ఉక్రెయిన్‌ కూల్చివేయడంతో ప్రతీకార దాడులను రష్యా తీవ్రతరం చేసింది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. 13 మంది దుర్మరణం.. వీడియో..
Russia Ukraine War
Follow us on

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. యుద్ధం మొదలై నేటికి 229 రోజులు. క్రిమియా వంతెనను ఉక్రెయిన్‌ కూల్చివేయడంతో ప్రతీకార దాడులను రష్యా తీవ్రతరం చేసింది. వరుసపెట్టి రష్యా పాల్పడుతున్న దాడుల్లో 13 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. 60 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం. జఫోరిజ్జియాలోని నివాస ప్రాంతాలు లక్ష్యంగా రష్యా 75 మిసైల్‌ దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా చేపట్టిన అటాక్స్‌తో ఉక్రెయిన్‌ వణికిపోతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అధ్యక్ష కార్యాలయంపై కూడా రష్యా దాడులు చేపట్టింది. మిస్సైళ్ల దాడికి కీవ్‌లో ఎక్కడ చూసినా తగులబడుతున్న దృశ్యాలు, భయంతో జనాలు పరుగులుపెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వైపు రష్యా దాడులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ భూమి మీద మేము లేకుండా చేసేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మరో వైపు ఉక్రెయిన్‌ దాడిలో తమ బలగాలకు భారీ నష్టం జరగడంతో అత్యంత కీలకమైన సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశాన్ని రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏర్పాటు చేశారు. పుతిన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం గురించి రష్యన్‌ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. కెర్చ్‌ బ్రిడ్జి కూల్చివేతపై ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై అణు దాడులు జరుపుతామని రష్యా హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ అలాంటి పనులకు పాల్పడవద్దని పోప్‌ విజ్ఞప్తి చేశారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి

కెర్చ్ వంతెన పేల్చివేత నాటి నుంచి..

క్రిమియాలోని కెర్చ్‌ వంతెన పేల్చివేతను పుతిన్‌ తీవ్రంగా పరిగణించినట్టు కనిపిస్తోంది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పుతిన్‌ అభివర్ణించారు. దానికి వ్యూహరచన చేసింది ఉక్రెయిన్‌ సీక్రెట్‌ సర్వీసెస్‌ అని ప్రకటించారు. రష్యా పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినందుకే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారనడంలో ఎటువంటి అనుమానం లేదని రష్యా ప్రకటించింది. రష్యాను, రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పానికి ఈ వంతెన అనుసంధానంగా నిలుస్తుంది.

కెర్చ్‌ వంతెనపై పేలుడు జరిగిన సమయంలో దానిపై ఒక ట్రక్క్‌ ప్రయాణిస్తున్నట్టు స్పష్టంగా రికార్డైంది. అదే సమయంలో పక్కనున్న మరో వంతెనపై ఇంధన వ్యాగన్లతో ఒక రైలు వచ్చింది. ఆ రైలు ట్రక్‌ సమీపంలోకి రాగానే పేలుడు సంభవించినట్టు కనిపిస్తోంది. అయితే ఈ పేలుళ్లు ట్రక్‌ నుంచే జరిగినట్టు ఎక్కడా తెలియడం లేదు. అదే సమయంలో బ్రిడ్డి కింద వంతెన మధ్య నుంచి ఒక చిన్న పడవ వంటిది తేలుతూ బయటకు వచ్చినట్టు ఈ వంతెనపై అమర్చిన కెమెరాల్లో రికార్డైంది. దీన్ని బట్టి సముద్ర డ్రోన్ సాయంతో కెర్చ్‌ బ్రిడ్జిని పేల్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కెర్చ్ వంతెన పేల్చివేత వ్యక్తిగత స్థాయిలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. పుతిన్‌ చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో ఈ వంతెన కూడా ఒకటి. ఆయనే స్వయంగా ట్రక్‌ నడిపి ఈ వంతెనను ప్రారంభించారు. ఈ పేల్చివేత కారణంగా యుద్ధక్షేత్రంలో కీలకమైన క్రిమియాకు సరుకులు, ఆయుధాలు, ఇంధన రవాణా దాదాపుగా నిలిచిపోతాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..