మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. లీటర్‌ ఎంతో తెలిస్తే షాకే..

|

Jan 30, 2023 | 7:48 AM

పాకిస్తాన్‌లో సంక్షోభం నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే భారీగా రూపాయి పతనం అవ్వగా.. అక్కడి పరిస్థితులు శ్రీలంకను తలపిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కసారిగా కొండెక్కిపోయాయి.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. లీటర్‌ ఎంతో తెలిస్తే షాకే..
Pakistan's Petrol Diesel Prices
Follow us on

పాకిస్తాన్‌లో సంక్షోభం నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే భారీగా రూపాయి పతనం అవ్వగా.. అక్కడి పరిస్థితులు శ్రీలంకను తలపిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కసారిగా కొండెక్కిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 35 రూపాయలు పెంచుతున్నట్లు పాక్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. ధరలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఈ మధ్యే వెల్లడించిన పాక్ ప్రభుత్వం.. రోజురోజుకూ రూపాయి విలువ తగ్గిపోతుండడంతో ఈ చర్య తీసుకోక తప్పలేదని ప్రకటించింది. పాకిస్తాన్‌ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు రేపో, మాపో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-IMF అధికారుల బృందం ఆ దేశానికి రానున్న సందర్భంలో పెట్రో ఉత్పత్తుల ధరలను ఇలా ఒక్కసారిగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు సోమవారం 11 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలిపింది. తాజాగా పెరిగిన ధరలతో హై స్పీడ్ డీజిల్ లీటరు ధర -262.80, పెట్రోల్ లీటరు ధర 249.80 రూపాయలు, కిరోసిన్ ఆయిల్ లీటరు ధర 189.83 రూపాయలు, లైట్ డీజిల్ ఆయిల్ ధర లీటరు 187 రూపాయలుగా ఉందని పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

అయితే.. మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్‌ ధర లీటరు 45 నుంచి 80 రూపాయలకు పెంచవచ్చు, లేదంటే పెట్రోలు కొరత పెరిగిపోయి బంక్‌లు మూతపడతాయని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఈ చర్యతో తోసిపుచ్చినట్టయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో ఇంధన వనరుల ధరలు అత్యధికంగా ఉన్నట్లు ఆయిల్, గ్యాస్ శాఖల అధికారులు చెప్తున్నారు. వారి సిఫారసుల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాల్సివచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్‌ దర్ ప్రకటించారు.పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇచ్చిన సూచనల మేరకు ఈ నాలుగు ఉత్పత్తుల కనీస ధరను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.

అంతర్జాతీయంగా పెరిగిన ఆయిల్ ధరలు, పడిపోతున్న రూపాయి విలువను పరిగణనలోకి తీసుకొని పెట్రోల్, డీజిల్‌ ధర పెంచాల్సి వచ్చిందన్నారు. చమురు, డీజిల్ కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. వీటి ధరలపై నియంత్రణ ఉండబోదని ఆయిల్, గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ పేర్కొంది. ఈ కారణంగా సంస్థ సిఫారసులు, సూచనలను పరిగణలోకి తీసుకొని రేట్లు పెంచామన్నారు. ప్రభుత్వం ఇలా ప్రకటిస్తుందని ముందే ఊహించిన జనం పెట్రోలు, డీజిల్ కోసం బంకుల ముందు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..