సొంత పార్టీలో లుకలుకలు.. ఎదురుతిరిగిన నేతలు.. అవిశ్వాసం నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేనా.?

| Edited By: Ravi Kiran

Mar 30, 2022 | 6:59 PM

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చివరి బంతి వరకు ఆడితే ఆడవచ్చు కానీ విజయం మాత్రం దర్లభం. వైరిపక్షం విజయపు అంచుల మీద నిలబడి సంబరాలు..

సొంత పార్టీలో లుకలుకలు.. ఎదురుతిరిగిన నేతలు.. అవిశ్వాసం నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేనా.?
Pakistan Political Conflict, Imran Khan
Follow us on

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చివరి బంతి వరకు ఆడితే ఆడవచ్చు కానీ విజయం మాత్రం దర్లభం. వైరిపక్షం విజయపు అంచుల మీద నిలబడి సంబరాలు చేసుకుంటోంది.. లాస్ట్ బాల్‌కు సిక్స్‌ కొట్టడం ఈజీనే! లక్కు కలిసివచ్చి అది నోబాల్‌ అయితే మరో సిక్స్‌కు ఛాన్సుంటుంది. కానీ పాకిస్తాన్‌ పొలిటికల్‌ సినేరియోలో ఆ అవకాశాలు కనిపించడం లేదు. సొంత పార్టీ నేతలే హ్యాండిచ్చిన తర్వాత ఇమ్రాన్‌ అవిశ్వాసం నుంచి బయటపడతారని ఎలా అనుకోగలం? స్వపక్షీయులే మాట విననప్పుడు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు ఇమ్రాన్‌కు బాసటగా ఎలా నిలుస్తాయి? వాటిని ఇమ్రాన్‌ తనకు అనుకూలంగా మలచుకోగలరా? ప్రతిపక్ష పీఎంఎల్‌-ఎన్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరగబోతున్నది. ఏప్రిల్‌ మూడున ఓటింగ్‌ ఉంటుంది. ఇంతకు ముందు పాకిస్తాన్‌ ప్రధానులు అవిశ్వాసాన్ని ఎదుర్కోలేదా అంటే చక్కగా ఎదుర్కొన్నారు. 1989లో బేనజీర్‌ భుట్టో పైనా, 2006లో షౌకత్‌ అజీజ్‌లపైనా అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. కానీ అవి వీగిపోయాయి. ఇమ్రాన్‌ విషయంలో మాత్రం అది జరగదేమోనని అనిపిస్తోంది. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ మెజారిటీని నిరూపించుకోవడం కష్టమే! అద్భుతం జరగడానికి ఇది క్రికెట్ కాదు.. రాజకీయ క్రీడ!

గ్రహాలే కాదు, గణాంకాలు కూడా ఇమ్రాన్‌కు ప్రతికూలంగానే ఉన్నాయి. తన కేబినెట్‌లోని మంత్రుల్లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పారు. పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఉన్న మొత్తం 342 సీట్లలో 2018 ఎన్నికల్లో ఇమ్రాన్‌ సారథ్యంలోని పీటీఐ గెల్చుకున్నవి కేవలం 149 స్థానాలే! ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇవి సరిపోవు. అందుకే చిన్నచితకా పార్టీలు, ఇండిపెండెట్ల మద్దతను కూడగట్టుకున్నారు ఇమ్రాన్‌.. వీరు సంకీర్ణానికి జై కొట్టడంతో ఇమ్రాన్‌ బలం 176కు పెరిగింది. ఆ బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాను ప్రధానమంత్రి కాగలిగారు. మూడున్నరేళ్ల ఇమ్రాన్‌ ప్రభుత్వంపై ఇప్పుడు విపక్షాలు కత్తులు దూస్తున్నాయి. ఇమ్రాన్‌కు పాలన చేతకాదని, ప్రస్తుత ఆర్ధిక సంక్షోభానికి ఇమ్రానే కారకుడని అంటున్నాయి. సైన్యం కూడా ఎప్పుడెప్పుడు ఇమ్రాన్‌ను గద్దెదింపుదామా అన్నట్టుగా ఉంది.. ప్రస్తుతం పీటీఐకి 155 సభ్యులున్నారు. ఎంక్యూఎంపీకి ఏడుగురు సభ్యులు, పీఎంఎల్‌-క్యూకు నలుగురు సభ్యులు, గ్రాండ్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌కు ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీఏపీ, ఎఎంఎల్‌లకు ఒక్కొక్క సభ్యుడు ఉన్నారు. ఈ అంకెలన్ని కలిపితే 171 అవుతుంది. కాకపోతే పీటీఐకి చెందిన 24 మంది ఎంపీలు ఇప్పుడు ఇమ్రాన్‌కు వ్యతిరేక శిబిరంలో ఉన్నారు. వీరు అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌కు మద్దతుగా ఓటేస్తారని అనుకోవడానికి లేదు. మరోవైపు ప్రతిపక్ష శిబిరం రోజురోజుకూ బలపడుతోంది. ప్రస్తుతానికి పీఎంఎల్‌ఎన్‌కు 84 మంది, పీపీపీకి 56 మంది, ఎంఎంఏకు 14 మంది ఎంపీలున్నారు. బీఎన్‌పీకి నలుగురు, బీఏపీకి నలుగురు, ఇండిపెండెంట్లు నలుగురు ఉన్నారు. వీరితో పాటు జేడబ్ల్యూపీ చెందిన సభ్యుడు, పీఎంఎల్‌ క్యూకు చెందిన సభ్యుడు కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు.

బీఏపీ మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నా ఇందులో నలుగురు ఎంపీలు ప్రతిపక్షంతో చేతులు కలిపారు. ఇవన్నీ లెక్కేస్తే విపక్షాలకు 169 మంది సభ్యులు బలముంది. ఏ లెక్కన చూసినా అవిశ్వాసంలో ఇమ్రాన్‌ గెలవడం అసాధ్యంగా తోస్తోంది. బల పరీక్షలో నెగ్గడం సాధ్యం కాదు కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇమ్రాన్‌ చేస్తున్నారట! దీనికి తోడు తనపై తిరుగుబాటును ప్రకటించిన సొంత పార్టీ ఎంపీలపై అనర్హత వేటు వేయించాలని కూడా ఇమ్రాన్‌ ప్రయత్నిస్తున్నారు. అదీ కాకుండా ఏడుగురు సభ్యులు ఉన్న పీఎంఎల్‌-క్యూ, అయిదుగురు సభ్యులున్న ముత్తాహిదా క్వామి మూవ్‌మెంట్‌ పాకిస్తాన్‌ పార్టీను బతిమాలుకుంటున్నారు. పీఎంఎల్‌-క్యూకు పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎం పదవి, ఎంక్యూఎంకు సింధ్‌ గవర్నర్‌ పదవి ఇస్తానని మాట ఇస్తున్నారు. మరి ఈ తాయిలాలకు వారు లొంగుతారో లేదో చూడాలి.. ఇక సొంత పార్టీ ఎంపీలు ఇమ్రాన్‌పై తిరుగుబాటు చేయడానికి కారణముంది. వీరిలో చాలా మంది దక్షిణ పంజాబ్‌కు చెందిన వారే.. వారంతా తమ ప్రాంతాన్ని ప్రత్యేక ప్రావిన్స్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నవారే! వీరిని బుజ్జగించడం ఇమ్రాన్‌కు తలకుమించిన పనే!అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్‌లో పాల్గనకూడదంటూ ఇప్పటికే తన పార్టీ సభ్యులకు ఇమ్రాన్‌ ఆదేశించారు. అసలు ఆ రోజుకు సభకు గైర్హాజరు అయితే ఇంకా మంచిదని చెబుతున్నారు. ఒక వేళ వచ్చినా ఓటింగ్‌లో మాత్రం పాల్గొనకూడదని కోరుతూ తన పార్టీ సభ్యులకు ఓ లేఖ కూడా రాశారు. తన ఆదేశాలను పాటించని వారిపై అనర్హత వేటు వేస్తానని హెచ్చరించారు.