అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్!

అమెరికా ఆంక్షలు విధించినా.. హర్ముజ్‌ను జల దిగ్బంధనం చేసినా.. ఇరాన్ తన సైనిక ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే ఉంది. క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను రహస్యంగా దిగుమతి చేసుకుంటోంది. రాయిటర్స్‌ పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా కళ్లుగప్పి ప్రత్యేక నెట్‌వర్క్‌ ద్వారా ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సామగ్రిని తెప్పించుకుంటోందని బయటపడింది.

అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్!
Iran's Secret Military Supply Web Operates Under Us Nose

Updated on: Nov 01, 2026 | 3:18 PM

అమెరికా ఆంక్షలు విధించినా.. హర్ముజ్‌ను జల దిగ్బంధనం చేసినా.. ఇరాన్ తన సైనిక ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే ఉంది. క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను రహస్యంగా దిగుమతి చేసుకుంటోంది. రాయిటర్స్‌ పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా కళ్లుగప్పి ప్రత్యేక నెట్‌వర్క్‌ ద్వారా ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సామగ్రిని తెప్పించుకుంటోందని బయటపడింది.

రహస్య నెట్‌వర్క్ ద్వారా 2 బిలియన్ డాలర్ల (రూ.16 వేల కోట్లకు పైగా) విలువైన సైనిక పరికరాలు, పేలుడు పదార్థాలు, భారీ ట్రక్కులను ఇరాన్ దిగుమతి చేసుకుంది.  రహస్య నెట్ వర్క్ లోని 5,000కు పైగా సంస్థలు ఇరాన్ కు ఆయుధ సామగ్రిని అందిస్తున్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన యుద్ధంలో ఇరాన్ వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. రహస్య నెట్‌వర్క్ ద్వారా వాటి నిల్వలను తిరిగి పెంచుకుంది.

5 వేలకుపైగా సంస్థలతో రహస్య నెట్‌వర్క్

ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేరుతో పనిచేసే ఈ నెట్‌వర్క్‌ సంస్థల పేర్లన్నీ MOD అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఐదు లేదా ఆరు అంకెల సంఖ్య ఉంటుంది. పర్షియన్ భాషలో వీటిని VODJA అని పిలుస్తారు. ఈ సంస్థలన్నీ ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ చిరునామానే తమ కార్యాలయ చిరునామాగా చూపిస్తున్నాయి. 1979 ఫిబ్రవరి 11న సంస్థలను స్థాపించినట్లు రికార్డుల్లో ఉన్నాయి. అయితే వాస్తవానికి వీటిలో చాలా సంస్థలు 2013లో ఏర్పాటయ్యాయి. అప్పట్లో ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో రహస్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్‌వర్క్‌కు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), రాజకీయ, ఆర్థిక ప్రముఖుల ఆధీనంలోని బోన్యాడ్స్‌ (Bonyads) సంస్థలతో సంబంధాలు ఉన్నాయి.

విదేశాల్లో నకిలీ కంపెనీలు, మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ.. అక్రమ చమురు విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును సైనిక సామగ్రి కొనుగోళ్లకు వెచ్చిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. సరుకు రవాణా లావాదేవీల్లో 97 శాతం వరకు ‘కరెన్సీ బదిలీ లేకుండా’ చెల్లింపులు జరిపారు. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో అనుమానాలు రాకుండా లావాదేవీలు జరిపే అవకాశం ఏర్పడింది.

రహస్య వ్యవస్థ బయటపడిందిలా!

240 Analytics అనే ఇజ్రాయెల్ – అమెరికా రిస్క్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన అధికారి నోమ్ బిన్‌స్టాక్ ఈ నెట్‌వర్క్‌ను గుర్తించారు. టెలిగ్రామ్, WikiIran వెబ్‌సైట్‌లో లీకైన బ్యాంక్ సెపా పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సిబ్బందికి జీతాలు చెల్లించే బ్యాంక్ సెపా రికార్డుల్లో ఈ సంస్థల ఆర్థిక లావాదేవీల వివరాలు కనిపించాయి. 2024 చివరి నాటికి 36 సంస్థల వద్ద విదేశీ కరెన్సీ రూపంలో 1.2 బిలియన్ డాలర్లు ఉండగా, మిగిలిన సంస్థల వద్ద స్థానిక కరెన్సీలో మరో 1.8 బిలియన్ డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. 19 వేల దిగుమతి రికార్డులను పరిశీలించి, షిప్పింగ్ పత్రాలు, శాటిలైట్ చిత్రాలు, సోషల్ మీడియా వీడియోలు, ప్రభుత్వ మీడియా కథనాలతో వాటిని సరిపోల్చింది రాయిటర్స్ .

అత్యధికంగా కొనుగోళ్లు చేసిన సంస్థ ఏదంటే?

 

 

ఈ నెట్‌వర్క్‌లో MOD 346428 అనే సంస్థ  2.3 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సామగ్రిని దిగుమతి చేసుకుంది. వీటిలో రాకెట్ ఇంధన తయారీకి రసాయనాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాల విడిభాగాలు ఉన్నాయి. 2025 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య చైనా నుంచి 886 టన్నుల రసాయనాలను బందర్ అబ్బాస్ పోర్టు ద్వారా ఇరాన్‌కు తీసుకొచ్చారు. వీటిలో సోడియం క్లోరేట్, ఇతర పెర్క్లోరేట్లు ఉన్నాయి. ఇవి ఘన ఇంధన రాకెట్ల తయారీలో కీలకమైన పదార్థాలు.

పోర్టు పేలుడికి రసాయనాలే కారణమా?

2025 ఏప్రిల్ 26న దక్షిణ ఇరాన్‌లోని షాహిద్ రాజాయీ పోర్టులో భారీ పేలుడులో కనీసం 70 మంది ప్రాణాలు కోల్పోగా, 1,200 మందికి పైగా గాయపడ్డారు. ఈ పోర్టులో నిల్వ ఉంచిన సోడియం రసాయనం మండటంతోనే పేలుడు సంభవించిందని రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది. ఈ కంపెనీ ఇరాన్ సుప్రీం లీడర్  నియంత్రణలో ఉన్న బహుళ బిలియన్ డాలర్ల బోన్యాడ్ మొస్తజఫాన్ ఫౌండేషన్‌కు చెందింది.

క్షిపణి లాంచర్లుగా ట్రక్కులు!

 

ఈ రహస్య నెట్‌వర్క్ ద్వారా ఇరాన్ భారీ సంఖ్యలో వాహనాలను కూడా దిగుమతి చేసుకుంది. ముఖ్యంగా 435 ఇవెకో (Iveco) ట్రక్కులను కొనుగోలు చేసింది. సైన్యం ఈ ట్రక్కులను మొబైల్ క్షిపణి లాంచర్లుగా మార్చింది. వేల సంఖ్యలో టయోటా హైలక్స్, ల్యాండ్ క్రూజర్ వాహనాలను ఇరాన్ దిగుమతి చేసుకుంది. వీటిని IRGC భారీ మెషిన్ గన్లను అమర్చుకునేలా మార్పులు చేసింది.

యుద్ధం మొదలయ్యాక కొనసాగిన దిగుమతులు

ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా ఇరాన్‌కు సైనిక సామగ్రి సరఫరా ఆగలేదు. యుద్ధానికి ముందు వారాల్లో చైనా నుంచి 93 టన్నుల టైటానియం ఇరాన్‌కు చేరింది. ఇది అత్యంత బలమైన లోహం. క్షిపణుల బయటి నిర్మాణాలు, రాకెట్ మోటార్ల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే 268 టన్నుల నైట్రోసెల్యులోజ్, మరో 276 టన్నుల రసాయనాలను కూడా ఇరాన్ దిగుమతి చేసుకుంది. వీటిని రాకెట్ ఇంధనం, పేలుడు పదార్థాల తయారీలో వాడతారు. రష్యా నుంచి 7.6 మిలియన్ డాలర్ల విలువైన డిటోనేటర్లు ఐదు విడతల్లో ఇరాన్‌కు చేరాయి.

అమెరికా ఏమంటోంది?

రాయిటర్స్ ప్రశ్నలకు స్పందించిన అమెరికా ఆర్థిక శాఖ ప్రతినిధి.. ఇరాన్ ప్రభుత్వ ఆర్థిక వనరులను అమెరికా ఇప్పటికే దెబ్బతీసిందని తెలిపారు. ఆంక్షలను తప్పించుకుని సైనిక కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నప్పటికీ, అమెరికా దానికంటే పది అడుగులు ముందుందని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా ఆర్థిక శాఖ మాజీ అధికారిగా మియాద్ మలేకీ మాత్రం ఈ నెట్‌వర్క్‌ను ఇరాన్ సైన్యానికి ప్రాణాధారంగా అభివర్ణించారు.  రాయిటర్స్‌ ఆరోపణలపై ఇరాన్ సంస్థలు, రష్యా రక్షణ శాఖ, వైట్‌హౌస్, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM), యూఏఈ ఇప్పటివరకు స్పందించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us