
ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన అవసరముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రస్తుత అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ విఫలమయ్యారని ఆరోపించారు. ఆయన అసమర్థుడని అభిప్రాయపడ్డ ట్రంప్.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. రష్యాతో ఒప్పందం కుదుర్చుకోగల కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ఉక్రెయిన్ ప్రజలకు తాను సూచిస్తున్నానని, జెలెన్స్కీ ఎప్పుడూ ఒప్పందం వైపు అడుగులు వేయలేదని తెలిపారు. 2022లో తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఉండేది కాదని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మొదలవడానికి ఎటువంటి కారణమూ లేదని, అది అసమర్థత వల్ల మొదలైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ యుద్దం వల్ల పది లక్షలకుపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అది ఎప్పటికీ మొదలవ్వకూడని యుద్ధమన్నారు. అమెరికా-రష్యా డీజిల్ ఒప్పందాన్ని మన భాగస్వాములకు తగనిదని, బలహీనమైన నిర్ణయమని జెలెన్స్కీ విమర్శించిన ఒక రోజు తర్వాత.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందానికి కృతజ్ఞతగా మాస్కో ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసినందుకు కృతజ్ఞతగా రష్యా ఈ రోజు జపోరిజ్జియాలోని నివాస భవనాలపై ఐదు గ్లైడ్ బాంబులను జారవిడిచిందని జెలెన్స్కీ ఎక్స్‌లో తెలిపారు. ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మాస్కోపై యుద్ధ ఆంక్షలను సడలించిన ట్రంప్.. డీజిల్‌ను కొనుగోలు చేసేందుకు రష్యాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు శుక్రవారం తెలిపారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చల అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. రష్యా తక్షణమే అమెరికా, ప్రపంచ మార్కెట్‌కు 3 లక్షల టన్నులకుపైగా డీజిల్‌ను సరఫరా చేస్తుందని చెప్పారు. రష్యా నవంబర్‌లో 500,000 టన్నులు, ఆ తర్వాత ఒక మిలియన్ టన్నులు సరఫరా చేయనుంది. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో విడుదల చేయనుంది.