China’s Power Crisis: చైనాని చీకటి చేస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ట్రాఫిక్ లైట్లు కూడా వెలగడం లేని స్థితి

|

Sep 30, 2021 | 7:43 AM

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా రూపాంతరం చెందుతోన్న చైనాకు ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయి. క‌రోనా నుంచి క్రమ క్రమంగా

China’s Power Crisis: చైనాని చీకటి చేస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ట్రాఫిక్ లైట్లు కూడా వెలగడం లేని స్థితి
China Power Crisis
Follow us on

China’s Power cuts: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా రూపాంతరం చెందుతోన్న చైనాకు ఇప్పుడు కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయి. క‌రోనా నుంచి క్రమ క్రమంగా బ‌య‌ట‌ప‌డుతూ అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో క‌రెంట్ వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరిగిపోవ‌డంతో తీవ్రమైన కొర‌త ఏర్పడింది. వాణిజ్య ప‌ర‌మైన విద్యుత్ వినియోగం పెర‌గ‌డంతో చివ‌ర‌కు వీధిలైట్లకు కూడా విద్యుత్‌ను క‌ట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం ముగుస్తుందని ఆశిస్తోన్న సమయంలోనే తీవ్రమైన ఎలక్ట్రిసిటీ సంక్షోభం ఆ దేశాన్ని చుట్టుముట్టింది. దీంతో చైనా మందగమనం కేవలం ప్రాపర్టీ రంగానికి మాత్రమే కాక, అన్ని రంగాల మీదా పడే పరిస్థితి దాపురిస్తోంది. ప్రపంచ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి దేశమైన చైనా.. ఇప్పుడు అధిక ఇంధన ధరలు, కార్బన్ ఉద్గారాలపై కఠిన ఆంక్షల నేపథ్యంలో తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

2021 క్యాలెండర్ ఏడాదిలో ఎనిమిది నెలల కాలంలో చైనా ఎలక్ట్రిసిటీ జనరేషన్ 616 టెరావాట్ హవర్స్ (13 శాతం పెరుగుదల)కు పెరిగింది. సేవారంగంలో విద్యుత్ వినియోగం 22 శాతం, ప్రైమరీ ఇండస్ట్రీ రంగంలో 20 శాతం పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 13 శాతం, రెసిడెన్షియల్ వినియోగంలో 8 శాతం పెరిగింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం థర్మల్ జనరేటర్లు, ప్రధానంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల ద్వారా మొదటి ఎనిమిది నెలల కాలంలో అత్యధిక పెరుగుదల 465 టెరావాట్ హవర్స్(14 శాతం పెరుగుదల) నమోదయింది.

అయితే, హైడ్రో ఎలక్ట్రిక్ ఔట్‌పుట్ వాస్తవానికి ఈ ఏడాది కాస్త క్షీణించింది. 2018 తర్వాత ఇదే అత్యల్పం. ఈ లోటును భర్తీ చేయడానికి థర్మల్ జనరేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో బొగ్గు కొరత కూడా రావడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఈ ఏడాది జల విద్యుదుత్పత్తి రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో బొగ్గు ఆధారిత కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. విద్యుత్ డిమాండ్ పదమూడు శాతం పెరిగితే, బొగ్గు ఉత్పత్తి ఆరు శాతం మాత్రమే పెరిగింది. పైగా రెండు ప్రధాన పోర్టులు మూసివేయడంతో బొగ్గు దిగుమతులు పడిపోయాయి.

డిమాండ్‌కు త‌గినంత‌గా విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో దాని ప్రభావం ఉత్పత్తి రంగంపై క‌నిపించే అవకాశం ఉంది. చైనాలో ఉత్పత్తి రంగం కుదేలైతే దాని ప్రభావం ఆ ఒక్కదేశంలో మాత్రమే కాకుండా, యూర‌ప్‌, ఆఫ్రికా ఖండాల్లోని అనేక దేశాలపై ఎక్కువగా, ఇతర దేశాలపై ఎంతోకంత లేకపోలేదు. గత కొద్ది దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదిగిన చైనా ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా పేరొందింది. దీంతో ఇక్కడ ఏ సమస్య తలెత్తినా అది ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

Read also: Visakha: విశాఖకు భవిష్యత్తులో మరింత ముప్పు తప్పదా..! సిటీ ఆఫ్ డెస్టినీకి ఎందుకీ దుస్థితి.?