Floods: పాక్, అఫ్గాన్ ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు.. 67 మంది మృతి.. వందల సంఖ్యలో గల్లంతు

|

Aug 22, 2022 | 7:34 AM

ఆకస్మిక వర్షాలు, వరదలు.. పాకిస్తాన్‌ (Pakisthan), అఫ్గానిస్థాన్ ను తీవ్రంగా వణికిస్తున్నాయి. వీటి కారణంగా ఇరు దేశాల్లో 67 మంది మృత్యువాతపడ్డారు. ఆర్థిక నష్టం కూడా అధికంగానే ఉంది. పాకిస్తాన్ లోని పంజాబ్‌, ఖైబర్​పఖ్తుంఖ్వా..

Floods: పాక్, అఫ్గాన్ ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు.. 67 మంది మృతి.. వందల సంఖ్యలో గల్లంతు
Floods In Pakistan, Afghani
Follow us on

ఆకస్మిక వర్షాలు, వరదలు.. పాకిస్తాన్‌ (Pakisthan), అఫ్గానిస్థాన్ ను తీవ్రంగా వణికిస్తున్నాయి. వీటి కారణంగా ఇరు దేశాల్లో 67 మంది మృత్యువాతపడ్డారు. ఆర్థిక నష్టం కూడా అధికంగానే ఉంది. పాకిస్తాన్ లోని పంజాబ్‌, ఖైబర్​పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌, సింధ్‌లను ఆకస్మిక వరదలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు రోజులుగా ఏకధాటిగా కురుసిన వర్షాలు లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలను ముంచెత్తాయి. వరద ప్రవాహం పెరగడంతో వేలాది ఇళ్లు దెబ్బ తిన్నాయి. వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా వరదల ధాటికి 36 మంది మరణించారని అధికారులు ప్రకటించారు.. 150 మంది వరకూ గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. సింధ్‌లో 18 మంది, ఖైబర్​పఖ్తుంఖ్వాలో 11 మంది, పంజాబ్‌లో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా ఉన్నారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్‌లో వరదల ధాటికి చాలా ప్రాంతాల్లో రోడ్డు, వంతెనలు దెబ్బతిన్నాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వంతో పాటు వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టారు. సైన్యంతో పాటు డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ బృందాలు రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కిన వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అఫ్గానిస్థాన్ నూ ఆకస్మిక వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. రాజధాని కాబుల్‌తో పాటు లోగర్‌ ప్రావిన్స్‌లోని ఖుషీ జిల్లా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారం రోజులుగా ఏకధాటి వర్షాలకు 31 మంది మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వరదల తాకిడికి ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడి ప్రజలు పడిపోయిన శిథిలాలను, బురదను శుభ్రం చేసుకుంటున్నారు. వరదల ధాటికి పశువులు, వ్యవసాయ భూములను నష్టపోయామని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం