Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 20 మంది సజీవ దహనం..

|

Aug 16, 2022 | 3:30 PM

బస్సు, ట్యాంకర్ ఎదురెదురుగా వేగంతో ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించగా

Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 20 మంది సజీవ దహనం..
Pak Accident
Follow us on

Pakistan Accident: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ప్రయాణికుల బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు లాహోర్ నుండి కరాచీకి ప్రయాణిస్తుంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో డ్రైవర్, కండక్టర్‌తో సహా 26 మంది ఉన్నారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్‌లోని మోటర్‌వేపై అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు, ట్యాంకర్ ఎదురెదురుగా వేగంతో ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. తీవ్ర గాయాలైన ఆరుగురు ప్రయాణికులను ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారి తెలిపారు. చనిపోయిన ప్రయాణీకులలో చాలా మంది మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని.. గుర్తించలేనంతగా ఉన్నాయన్నారు. ఈ మృతదేహాలను DNA పరీక్ష తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని అధికారులు తెలియజేశారు.

ఇదిలా ఉండగా.. పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గత మూడు రోజుల్లో ప్రావిన్స్‌లో ఇది రెండో అతిపెద్ద రోడ్డు ప్రమాదం కావడం గమనార్హం. శనివారం తెల్లవారుజామున ప్రయాణికుల బస్సును లోడుతో కూడిన ట్రక్కు ఢీకొనడంతో 13 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..