నింగిలో మిగ్ గర్జనలు.. పర్యాటకుల హర్షధ్వానాలు!
విశాఖ ఆర్కే బీచ్ వేదికగా భారత నౌకాదళం చేపట్టిన యుద్ధ సన్నాహక విన్యాసాలు అట్టహాసంగా సాగుతున్నాయి. త్వరలో జరగనున్న 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ' మరియు 'మిలన్' వేడుకలను పురస్కరించుకుని నేవీ దళాలు ఈ భారీ రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసాల్లో ప్రధానంగా మిగ్ యుద్ధ విమానాలు ఆకాశంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ చేసిన విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.
సముద్ర మట్టానికి అత్యంత సమీపంలో ప్రయాణిస్తూ ఇవి చేసిన విన్యాసాలు నేవీ సామర్థ్యాన్ని చాటిచెప్పాయి. వీటితో పాటు అత్యాధునిక హెలికాప్టర్లు నింగిలో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేతక్ హెలికాప్టర్ల ద్వారా నౌకాదళ సిబ్బంది సాహసోపేతమైన విన్యాసాలను ప్రదర్శించారు. ముఖ్యంగా..సముద్రంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఎలా కాపాడుతారో కళ్లకు కట్టినట్లు చూపారు. హెలికాప్టర్ల నుంచి తాళ్ల సాయంతో కిందికి దిగడం, నీటిపై గాలిలో నిలకడగా ఉండి సహాయక చర్యలు చేపట్టడం వంటి అంశాలను ప్రదర్శించారు.వీకెండ్ కావడంతో పాటు ఈ విన్యాసాలు జరుగుతుండటంతో ఆర్కే బీచ్ పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. యుద్ధ విమానాల వేగం, హెలికాప్టర్ల శబ్దాలతో విశాఖ తీరం మార్మోగిపోయింది. సందర్శకులు తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధిస్తూ కేరింతలు కొట్టారు. దేశ రక్షణలో నౌకాదళం పోషిస్తున్న కీలక పాత్రను ఈ ప్రదర్శనలు ప్రతిబింబిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
