ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వెలుగుచూసిన రెండు హత్య కేసులు కుటుంబాల్లో ఏర్పడే తీవ్ర విభేదాలు ఎంతటి విషాదానికి దారితీయవచ్చో చూపించాయి. ఎన్టీఆర్ జిల్లాలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో మహిళ మృతదేహం ముక్కలు లభించగా, పోలీసుల దర్యాప్తులో షఫీపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు హనుమకొండలో కుటుంబ వివాదం నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైంది. రెండు ఘటనల్లోనూ పోలీసుల దర్యాప్తు కీలక ఆధారాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
హాయ్ అండి… ఈరోజు మన సమాజంలో కొందరు చేస్తున్న పొరపాట్లు వల్ల వారి జీవితాలు ఎలా నాశనం చేసుకుంటున్నారో కళ్లకు కట్టే ఓ రెండు సంఘటనలతో మీ ముందుకు వచ్చాను. కుటుంబం అంటే నమ్మకం, బాధ్యత, అనుబంధాల సమాహారం. కానీ నేటి ఆధునిక కాలంలో సోషల్ మీడియా వ్యామోహం, క్షణిక సుఖాల కోసం పాకులాడే వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను, సమాజంలో కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలను గాలికి వదిలేసి దారితప్పుతున్న కొందరి ప్రవర్తన.. చివరకు నమ్మకద్రోహానికి, దారుణ హత్యలకు దారితీస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలు.. వివాహేతర సంబంధాలు ఎంతటి ఘోరమైన పర్యవసానాలకు దారితీస్తాయో కళ్లకు కడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ (VTPS) కూలింగ్ కెనాల్ వద్ద లభ్యమైన ముక్కలు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం తెలుగు రాష్ట్రాల్లో వణుకు పుట్టించింది. కాళ్లు, చేతులు, మొండెం, తల భాగాలను వేర్వేరుగా నరికి కాల్వలో పడేసిన ఆ శవం ఎవరిదో తెలియక పోలీసులు పది రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా విచారణ జరిపారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చినతాడినాడకు చెందిన కళ్యాణి జీవితం చిన్నతనం నుంచే ఒడుదుడుకులతో సాగింది. కళ్యాణికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. దాంతో తండ్రి పిల్లలిద్దరినీ ఓ అనాథాశ్రమంలో చేర్చారు. పెద్దయ్యాక బయటకు వచ్చిన కళ్యాణికి మంగళగిరిలో వివాహమైంది. కానీ, కట్టుకున్న భర్తతో విభేదాలు రావడంతో అతనికి దూరమై, హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తూ సొంతంగా జీవనం సాగించడం మొదలుపెట్టింది. హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో కళ్యాణికి గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తితో పరిచయమేర్పడి సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలో వీరికి ఒక బాబు పుట్టాడు. అయితే గౌస్ మొహిద్దీన్‌కు అంతకుముందే పెళ్లయి ఉండటంతో అతనితో బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత, భవానీపురం హెచ్‌బీ కాలనీలో మటన్ దుకాణం నడిపే షేక్ షఫీ అనే వ్యక్తితో కళ్యాణికి పరిచయం ఏర్పడింది. షఫీకి ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ కొడుకు లేడనే వెలితి ఉండేది. దీన్ని ఆసరాగా చేసుకున్న కళ్యాణి-గౌస్ మొహిద్దీన్‌లు, తమకు పుట్టిన పసిపాపను నాలుగు సంవత్సరాల క్రితం రూ. 1 లక్షకు షఫీకి విక్రయించారు. ఆ బాబును షఫీ ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో కళ్యాణి, షఫీతో కూడా సహజీవనం చేయడం ప్రారంభించింది. అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన కళ్యాణి, డబ్బు కోసం షఫీని వేధించడం మొదలుపెట్టింది. “అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కొడుకును తీసుకెళ్లిపోతాను.. లేదా నీపై అత్యాచారం కేసు పెడతాను” అంటూ షఫీని బెదిరించడం మొదలుపెట్టింది. పసిపాపపై ఉన్న ప్రేమతో షఫీ చాలాసార్లు ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడు. అయినా కళ్యాణి వేధింపులు ఆగకపోగా రోజురోజుకూ ఎక్కువయ్యాయి. సెప్టెంబరు 17న డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగింది. ఇక కళ్యాణి వేధింపులు తట్టుకోలేకపోయిన షఫీ, ఆమెను శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం తన కుటుంబ సభ్యులను ఊరికి పంపించి కళ్యాణిని తన ఇంటికి పిలిపించాడు. అక్కడే ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి VTPS కూలింగ్ కెనాల్‌లో పడేశాడు. కెనాల్‌లో కొట్టుకొచ్చిన శరీర భాగాలను గమనించిన వీటీపీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల దొరక్కపోవడం, మృతురాలి వివరాలు తెలియకపోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది. అయితే, కళ్యాణి చేతిపై ఉన్న పచ్చబొట్టు, ఆమె ఒంటిపై ఉన్న దుస్తుల ఫోటోలను పోలీసులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ పచ్చబొట్టు ఆధారంగా మంగళగిరిలో ఉంటున్న కళ్యాణి సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసులో కీలక పురోగతి సాధించిన పోలీసులు నిందితుడు షఫీని అదుపులోకి తీసుకుని విచారించగా దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా అనాథగా పెరిగిన ఒక మహిళ జీవితం, పెళ్లి బంధాన్ని వదిలేసి దారితప్పిన అక్రమ సంబంధాల వేధింపులు, చివరకు ఒక పసిపాప వ్యాపారంగా మారి అతికిరాతక హత్యగా ముగిసింది. ఇటు తెలంగాణలో జరిగిన మరో ఘటన మరింత దిగ్భ్రాంతి కలిగిస్తుంది. హనుమకొండ జిల్లా కాజీపేట బాలాజీనగర్‌కు చెందిన ఉదయశ్రీకి 40 ఏళ్లు. మంచి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవితం ఎంతో హాయిగా సాగిపోతోంది. ఇంతలో వీరి జీవితంలోకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాజశేఖర్ అనే ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ ప్రవేశించాడు. ఇద్దరికీ పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ, కట్టుకున్న వారిని వదిలేసి ఇద్దరూ కలిసి వెళ్లిపోయి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఉదయశ్రీ కొడుకు దొరబాబుకు ఈ విషయం తెలిసింది. తల్లికి నచ్చజెప్పాడు.. “వద్దమ్మా.. పద్ధతి మార్చుకో, మన పరువు పోతుంది” అని తల్లికి హితవు పలికాడు. కానీ వివాహేతర సంబంధం మైకంలో ఉన్న ఆ తల్లి కొడుకు మాటలను పెడచెవిన పెట్టింది. ప్రియుడితో వెళ్లేందుకే సిద్ధపడింది. తల్లిప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు దొరబాబు. సమాజంలో పరువు పోతుందనే ఆందోళన అతన్ని చుట్టుముట్టింది. తల్లి ప్రవర్తనపై తీవ్ర మనోవేదనకు గురైన దొరబాబు సహనం కోల్పోయాడు. ఇనుప రాడ్డుతో కొట్టి, కత్తితో గొంతుకోసి కన్నతల్లినే హతమార్చాడు. “ప్రాణం కంటే పరువే ముఖ్యం” అనుకున్న ఆ యువకుడు, కసాయిగా మారి తన భవిష్యత్తును కటకటాల పాలుచేసుకున్నాడు. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే, నేటి సమాజంలో నైతిక విలువలు ఏ రేంజ్‌లో పడిపోతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. క్షణికమైన శారీరక, మానసిక ఆకర్షణల కోసం పెళ్లి అనే పవిత్ర బంధాన్ని, కన్న పిల్లల భవిష్యత్తును బలితీసుకుంటున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి మాత్రమే కాదు, వారిపై ఆధారపడిన భాగస్వామి, అమాయకులైన పిల్లలు సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంట్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు పిల్లల్లో, కుటుంబ సభ్యుల్లో విపరీతమైన ఆవేశం, మానసిక కుంగుబాటు పెరిగిపోయి. అది సొంత బంధాలనే అంతం చేసే స్థాయికి చేరుస్తోంది. కట్టుకున్న వారిని మోసం చేయడం ద్వారా మొదలయ్యే ఈ సంబంధాలు చివరకు బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు, హత్యలు లేదా ఆత్మహత్యల రూపంలో ముగుస్తున్నాయి. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు, క్షణిక సుఖాలు నిమిషాల వ్యవధిలో జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఏ బంధమైనా నమ్మకం, బాధ్యతపైనే ఆధారపడి ఉంటుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, నైతికత లేని ప్రవర్తనలు ఒక కుటుంబాన్ని శ్మశానంగా, మరొకరిని హంతకులుగా మారుస్తున్నాయని ఈ రెండు ఘటనలు హెచ్చరిస్తున్నాయి. పరువు, పద్ధతి, కుటుంబ బంధాల విలువను గుర్తించి మసలుకున్నప్పుడే ఇటువంటి ఘోరమైన మారణకాండలకు అడ్డుకట్ట పడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ సైబర్ క్రైమ్! డెంటల్ డాక్టర్‌కు ఫేస్‌బుక్‌లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఈ ఆకుతో పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ల నొప్పులు పరార్!
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా? రవాణా శాఖ క్లారిటీ!
