పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
ఇంగ్లండ్‌లోని డాన్‌కాస్టర్ సమీపంలో ఉన్న యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పులి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిపై పులి దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సౌత్ యార్క్‌షైర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తి ఎన్‌క్లోజర్‌లోకి ఎలా వెళ్లాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. సందర్శకులను బయటకు పంపిన పార్క్ యాజమాన్యం తాత్కాలికంగా పార్క్‌ను మూసివేసింది.
ఇంగ్లండ్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని డాన్‌కాస్టర్ సమీపంలో ఉన్న ప్రఖ్యాత యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఒక వ్యక్తి పులి నివసించే ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. ఆ వ్యక్తిపై పులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దురదృష్టకర సంఘటనను సౌత్ యార్క్‌షైర్ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. మధ్యాహ్నం సుమారు 1:35 గంటల సమయంలో ఒక వ్యక్తి టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే పులి ఆ వ్యక్తిపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య సిబ్బంది అతడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్ర గాయాల కారణంగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు. ఈ ఘటనలో పులికి ఎలాంటి గాయాలు కాలేదని, అది సురక్షితంగా ఎన్‌క్లోజర్‌లోనే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇచ్చారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఎవరూ పంచుకోవద్దని కోరారు. సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్ యాజమాన్యం.. సందర్శకులందరినీ సురక్షితంగా బయటకు పంపి పార్క్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అసలు ఆ వ్యక్తి ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించగలిగాడు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులతో కలిసి దర్యాప్తు జరుపుతున్నామని యాజమాన్యం వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!
హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు! మూడు నగరాలకు హైస్పీడ్ జర్నీ!
డిగ్రీ అర్హతతో రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. RRB NTPC నోటిఫికేషన్ విడుదల!
