గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది
అంతర్జాతీయ గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకొని, గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ అక్రమాలకు పాల్పడుతున్నారు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఒక వినియోగదారుడికి గ్యాస్ సిలిండర్ డెలివరీ కాకముందే, డెలివరీ అయినట్లు ఓటీపీ సందేశం వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అతనికి ఏజెన్సీ నుండి సరైన స్పందన రాలేదు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఈ డిజిటల్ మోసాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరతను అడ్డంపెట్టుకొని అక్రమదందాకు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బోయ్స్ పాల్పడుతున్నారు. అందుకు మరో ఉదాహరణ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన. వంట గ్యాస్ బుక్ చేస్తే సిలిండర్ ఇంటికి రావడం సాధారణం. కానీ, సిలిండర్ రాకముందే డెలివరీ సక్సెస్ అంటూ ఓటీపీ మెసేజ్ రావడంతో ఒక వినియోగదారుడు విస్తుపోయాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో వెలుగుచూసిన ఈ ఘటన గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆత్రేయపురం బుల్లిపేటకు చెందిన ఉందుర్తి మనోహరం అనే వ్యక్తి సుమారు 12 రోజుల క్రితం వంట గ్యాస్ బుక్ చేసుకున్నాడు. గ్యాస్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, వారం రోజుల క్రితం అతడి మొబైల్‌కు ఒక వింత మెసేజ్ వచ్చింది. గ్యాస్ సిలిండర్ సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ అయ్యిందని, దానికి సంబంధించిన ఓటీపీ ప్రక్రియ కూడా పూర్తయిందని అందులో ఉంది. కనీసం ఇంటికి గ్యాస్ బండి రాకుండానే డెలివరీ ఎలా పూర్తవుతుందని మనోహరం ఆశ్చర్యపోయాడు. గ్యాస్ బండ పై వివరణ కోసం స్థానిక లొల్ల లాకుల వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి విషయం చెప్పాడు. అక్కడి సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. రోజులు గడుస్తున్నా గ్యాస్ ఇవ్వకపోగా, పదేపదే ఏజెన్సీ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. చివరకు ఏజెన్సీ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, మనోహరం ఆత్రేయపురం పోలీసులను ఆశ్రయించాడు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని, తనలాంటి సామాన్య వినియోగదారులకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. మనోహరం ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఇలాంటి అవకతవకలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్ కాల్
