ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు
కర్ణాటకలోని విజయపురలో పితృత్వ అనుమానంతో మల్లికార్జున అనే కన్నతండ్రి ఆరేళ్ల కుమారుడిని కృష్ణానదిలో విసిరి చంపాడు. మార్చిలో జరిగిన ఈ దారుణం, భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పిల్లాడి పోలికలు తనవి కావని అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు మల్లికార్జునను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేశారు.
అనుమానం పెనుభూతమైంది. కన్నతండ్రిని కసాయిగా మార్చింది.. కన్నపాశం యమపాశంగా మారింది. మానవత్వం మరిచి ముక్కుపచ్చలారని పసివాడిని నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుంది. అనుమానం అనే మాయదారి మహమ్మారి. తన పోలికలు రాలేదంటూ కన్నబిడ్డను కనికరం లేకుండా నదిలోకి విసిరేసాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన కర్నాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది. నాగఠాణెకు చెందిన మల్లికార్జున ఆరేకరి, భాగ్యశ్రీ దంపతులకు సిద్ధార్థ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఆరేళ్ల బాలుడు చూడటానికి ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటాడు. ముద్దులొలికే చిన్నారిని చూసి మురిసిపోవాల్సిన తండ్రి, పిల్లాడిలో తన పోలికలు ఎక్కడా కనిపించడం లేదని అనుమానం పెంచుకున్నాడు. ఏడాదిన్నరగా మల్లికార్జున ఈ అనుమానంతో రగిలిపోతూ చివరకు ఆ పసివాడి ప్రాణాలు తీసేసాడు. మార్చి 16న కుమారుడ్ని బడిలో చేర్పిస్తానని భార్యకు అబద్ధం చెప్పి సిద్ధార్థను బయటకు తీసుకువచ్చాడు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని కరాడ్ ప్రాంతానికి తీసుకెళ్లి, మడోలి భికేశ్వర గ్రామం వద్ద ప్రవహిస్తున్న కృష్ణానదిలోకి ఆ బాలుడిని విసిరేశాడు. మార్చి 18న బాలుడి మృతదేహం లభించినా, ఆ గుర్తు తెలియని బాలుడు ఎవరనేది అప్పట్లో అక్కడి పోలీసులకు అంతుచిక్కలేదు. కొడుకు ఏడీ అని భార్య అడిగితే.. హాస్టల్‌లో చేర్పించానని నమ్మబలికాడు. అయితే ఏప్రిల్ 1న సిద్ధార్థ పుట్టినరోజు రావడంతో, కొడుకును చూద్దామని భాగ్యశ్రీ పట్టుబట్టింది. మల్లికార్జున సమాధానం దాటవేస్తూ, ప్రవర్తనలో మార్పు చూపించడంతో అనుమానం వచ్చిన భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించగా, తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడిని అంత దారుణంగా ఎలా చంపగలిగావని పోలీసులు అడిగిన ప్రశ్నలకు అతను చెప్పిన సమాధానాలు విని అధికారులు సైతం నివ్వెరపోయారు. ప్రస్తుతం పోలీసులు మల్లికార్జునను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేశారు. తండ్రితనానికే మచ్చతెచ్చిన మల్లికార్జున తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్
Mushroom: వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??
గ్యాస్ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు