పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం

Updated on: May 23, 2026 | 9:03 AM

ఏడాది క్రితం కొనుగోలు చేసి మర్చిపోయిన లాటరీ టికెట్ ఓ అమెరికన్ జీవితాన్ని మార్చేసింది. న్యూజెర్సీకి చెందిన వ్యక్తికి పాత ప్యాంటు జేబులో దొరికిన టికెట్ ద్వారా రూ.57 కోట్ల జాక్‌పాట్ లభించింది. గడువు ముగియడానికి కేవలం 8 రోజుల ముందే టికెట్ గుర్తించి బహుమతి క్లెయిమ్ చేసుకోవడంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తి విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. దాదాపు ఏడాది క్రితం కొని, పూర్తిగా మర్చిపోయిన ఓ లాటరీ టికెట్.. అతడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. గడువు ముగియడానికి కేవలం 8 రోజుల ముందు, ఓ పాత ప్యాంటు జేబులో ఆ టికెట్ దొరకడం ఇక్కడ అసలు ట్విస్ట్‌. న్యూజెర్సీకి చెందిన ఆ వ్యక్తి గతేడాది మే నెలలో తాను తరచూ వెళ్లే ఓ గ్యాస్ స్టేషన్‌లో పిక్-6 లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే, కొన్న తర్వాత ఆ టికెట్‌ను ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. ఇటీవల లాటరీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాక్‌పాట్ గెలిచిన టికెట్ ఒకటి ఇంకా ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదని, త్వరలోనే దాని గడువు ముగిసిపోతుందని ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన ఆ వ్యక్తి దృష్టికి రావడంతో గతంలో తానూ ఆ గ్యాస్ స్టేషన్ వద్దనే … కొన్న టికెట్ గుర్తుకొచ్చింది. అయితే, అదెక్కడ పెట్టాడో మాత్రం గుర్తు రాక తెగ ఆలోచించాడు. వెంటనే టికెట్ కొన్న కౌంటర్ కి వెళ్లి..ఆరా తీయగా, నంబర్ తెలియకుండా తామేమీ చెప్పలేమని, ఇంటిలో ఉన్న టికెట్ మీది నంబర్ చెక్ చేయాలని సూచించారు. ఇంటికి వచ్చిన అతను.. బీరువాలు, అరలు, పాత వస్తువులన్నీ వెతికాడు. చివరకు పాత బట్టలు ఉన్న చోట వెతుకుతుండగా ఓ పాత ప్యాంటు జేబులో నలిగిపోయిన ఆ లాటరీ టికెట్ కనిపించింది. ఆ టికెట్‌ను జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. అది గ్యాస్‌ స్టేషన్‌లో కొన్నదేనని నిర్ధారించుకున్నాడు. ఆ టికెట్‌లోని నెంబర్లను సరిచూసుకోగా, అతనికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఆ లాటరీలో తాను ఏకంగా 5.9 మిలియన్ డాల‌ర్లు అంటే సుమారు రూ. 57.11 కోట్లు జాక్‌పాట్ అని తెలిసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే లాటరీ కార్యాలయానికి వెళ్లి గడువుకు 8 రోజుల ముందే బహుమతిని క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో పాత టికెట్లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, చాలామంది విజేతలు వాటిని ఎక్కడ పెట్టారో మర్చిపోయి బహుమతులు కోల్పోతున్నారని లాటరీ అధికారులు ప్రజలకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..

బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్‌ షాక్‌

ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!

Follow Us