ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..

Updated on: Mar 24, 2026 | 4:53 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ వింత ఘటన వైరల్ అవుతోంది. హాజీ అనే వ్యక్తి కొన్న మటన్ ఎంతకీ ఉడకకపోవడంతో (20 విజిల్స్ తర్వాత కూడా) నాసిరకం మాంసం అంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కుక్కర్‌తో సహా వచ్చిన ఫిర్యాదుదారుడిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. మటన్ షాపు యజమానిని పిలిపించి మాట్లాడగా, చివరకు మరో కిలో తాజా మటన్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు ఎవరైనా ఎందుకు వెళ్తారు? గొడవలు జరిగినా, దొంగతనం జరిగినా లేదా ఏదైనా మోసం జరిగినా వెళ్తారు. కానీ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీస్‌ స్టేషన్‌కు ఓ వింత కేసు వచ్చింది. ఓ వ్యక్తి తాను కొన్న మటన్ ఎంతకీ ఉడకడం లేదని, కూర గిన్నెను పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. తాడిపత్రి పట్టణానికి చెందిన హాజీ అనే వ్యక్తి ఆదివారం కావడంతో ఇంటికి మటన్ తెచ్చుకున్నాడు. ఎంతో ఇష్టంగా వంట మొదలుపెట్టాడు. కుక్కర్‌లో మటన్‌ ఉడకబెట్టాడు. ఓ 5 విజిల్స్‌ వచ్చాక ఓపెన్‌ చేసి చూశాడు. మటన్‌ ఉడకకపోవడంతో మరో ఐదు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాడు.. అయినా మటన్‌ ఉడకలేదు. సరే అని కుక్కుర్‌ మళ్లీ స్టవ్‌ మీద పెట్టి ఏకంగా 20 విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాడు. సాధారణంగా 5-6 విజిల్స్ వస్తేనే మటన్ మెత్తగా ఉడికిపోతుంది. కానీ, ఇక్కడ విచిత్రం ఏమిటంటే 20 విజిల్స్ వచ్చినా ఆ మాంసం ముక్కలు మాత్రం ఉడకలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన హాజీ, తనకు నాసిరకం మాంసం అమ్మి మోసం చేశారని భావించాడు. ఇంకేముంది.. ఆవేశంతో ఊగిపోయిన హాజీ, మటన్‌ ఉడికించిన కుక్కర్‌ను పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. “సార్.. ఈ మటన్ ఎన్ని విజిల్స్ వచ్చినా ఉడకడం లేదు, ఇది మటనో ఇంకేదైనానా అని నాకు అనుమానంగా ఉంది. నన్ను మోసం చేసిన సదరు మటన్ షాపు యజమానిపై చర్యలు తీసుకోండి” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గిన్నెతో వచ్చిన ఫిర్యాదుదారుని చూసి పోలీసులు కూడా ఒక్క క్షణం అవాక్కయ్యారు. హాజీ కుక్కర్‌లో తీసుకొచ్చిన మటన్‌ను పరిశీలించిన పోలీసులు మటన్ షాపు యజమానిని పిలిపించి మాట్లాడారు. చివరికి గొడవ ఎందుకని భావించిన షాపు ఓనర్, హాజీని సముదాయించి.. ఉడకని మటన్‌కు బదులుగా మరో కిలో తాజాగా మటన్‌ను ఇచ్చి పంపించాడు. దీంతో శాంతించిన హాజీ ఫిర్యాదును వెనక్కి తీసుకుని ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “మటన్ ఉడకకపోతే పోలీసుల దగ్గరకు వెళ్లడం ఏంటి సామీ!” అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..

PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి

Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!

Follow Us