మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
మగ చేపల సహాయం లేకుండానే లక్ష సంవత్సరాలుగా తన సంతతిని కొనసాగిస్తున్న అమెజాన్ మోలీ చేప శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ జాతిలో కేవలం ఆడ చేపలే ఉంటాయి. ‘జైనోజెనెసిస్’ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఇవి సంతానోత్పత్తి చేస్తాయి. జన్యు లోపాలను సరిచేసే ‘జీన్ కన్వర్షన్’ వ్యవస్థ వల్లే ఈ జాతి ఇప్పటికీ ఆరోగ్యంగా మనుగడ సాగిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రకృతి నియమాలకు విరుద్ధంగా.. ఏ మగ తోడు అవసరం లేకుండానే ఓ చేప జాతి పిల్లల్ని కంటూ తరతరాలుగా తన ఉనికిని కొనసాగిస్తోంది.. జీవజాలంలో ఇదో ఆశ్చర్య పరిణామం. సైన్స్ సూత్రాలను తలకిందులు చేస్తున్న అమెజాన్ మోలీ చేప జాతిని చూసి సైంటిస్ట్‌లు ఆశ్చర్యపోతున్నారు. జన్యు రహస్యాన్ని చేధించే ప్రయత్నంలో ఉన్నారు. ‘అమెజాన్ మోలీ చిన్న చేప జాతి. మెక్సికో నదుల్లో కనిపిస్తుంటుంది మగ జీవి అవసరం లేకుండానే 1 లక్ష ఏళ్లుగా జీవిస్తోంది. ఇప్పటికీ ఆరోగ్యంగా తన సంతతిని పెంచుకుంటూ పోతుండడం.. జీవ పరిణామ సిద్ధాంతాలకు పెద్ద సవాల్‌గా మారింది. సాధారణంగా సంతతిని కొనసాగించడానికి మగ–ఆడ కలయిక అవసరం. కానీ ఈ చేప జాతిలో మాత్రం కేవలం ఆడ చేపలే ఉంటాయి. ఈ చేపలు “జైనోజెనెసిస్” అనే అరుదైన ప్రక్రియ ద్వారా సంతతిని కొనసాగిస్తాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఇందులో ఆడ చేప పరాయి జాతి మగ చేపతో జత కలుస్తుంది. కానీ, మగ చేప డీఎన్‌ఏ దాని సంతతికి ఉపయోగపడదు. ఆ చేప వీర్యం కేవలం గుడ్డు అభివృద్ధిని ప్రారంభించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫలితంగా పుట్టే ప్రతి సంతానం కూడా ఆడ చేపలే ఉంటాయి. సైంటిఫిక్‌గా చూస్తే.. ఇలా లింగరహితంగా పుడితే ఆ జాతి తొందరగా అంతరించిపోవాలి. జన్యు లోపాలు తరతరాలకు చేరి జీవనశక్తి తగ్గుతుంది. కానీ అమెజాన్ మోలీ మాత్రం ఆశ్చర్యకర రీతిలో ఒక లక్ష ఏళ్లుగా జీవించి.. దాని సంతతిని పెంచుకుంటూ పోతోంది. శాస్త్రవేత్తల పరిశోధనలో “జీన్ కన్వర్షన్” అనే ప్రక్రియ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ఇది డీఎన్‌ఏలోని లోపాలను ‘కాపీ అండ్ పేస్ట్’ తరహాలో సరిచేసే సహజ వ్యవస్థగా పనిచేస్తుంది. దీని వల్ల హానికరమైన జన్యు లోపాలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ద్వంద్వ జన్యు నిర్మాణం వల్ల దీనికి ప్రారంభంలోనే ఎక్కువ జన్యు వైవిధ్యం లభించింది. ఇలాంటి ప్రక్రియలు భవిష్యత్తులో మనుషులలో జన్యు లోపాలు, క్యాన్సర్ ను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోడిగుడ్డు తింటే.. కొలెస్ట్రాల్ పెరగదు !
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
