అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ!

Updated on: Aug 08, 2026 | 5:44 PM

విమానయాన రంగంలో కెరీర్‌ సాధించాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు తెలంగాణ ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసిన అర్హులైన యువతులకు ‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ కార్యక్రమం ద్వారా ఉచిత కమర్షియల్ పైలట్ శిక్షణ అందించనున్నారు. సుమారు 20 నెలలపాటు CPL, ATR టైప్ రేటింగ్‌తో పాటు వసతి, భోజనం, మెడికల్ ఇన్సూరెన్స్, మెంటార్‌షిప్ వంటి సదుపాయాలను కూడా ఉచితంగా అందించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విమానయాన రంగంలో కెరీర్ నిర్మించుకోవాలని కలలు కనే పేద విద్యార్థినులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అర్హులైన యువతులకు ఉచితంగా కమర్షియల్ పైలట్ శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ, ఇండిగో సంస్థ సామాజిక బాధ్యత విభాగం , భారత్ కేర్స్ ట్రస్ట్ సంయుక్తంగా ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ‘గివింగ్ వింగ్స్ టు ఫ్లై’ అనే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా ఎంపికైన విద్యార్థినులకు ఎలాంటి ఖర్చు లేకుండా అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందించనున్నారు. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులకు సుమారు 20 నెలల పాటు సమగ్రంగా ఉచిత శిక్షణ ఇస్తారు. ఇందులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణతో పాటు ఏటీఆర్ టైప్ రేటింగ్ కోర్సు కూడా ఉంటుంది. సాధారణంగా పైలట్ కోర్సు పూర్తి చేయడానికి లక్షలాది రూపాయలు వ్యయం అవుతుంది. అయితే, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, మెడికల్ ఇన్సూరెన్స్, మెంటార్‌షిప్, ఇతర సర్వీసులను ఉచితంగానే కల్పించనున్నారు. ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో ఒప్పంద పత్రాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థినుల జీవితాలను మార్చే గొప్ప అవకాశం ఇదని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు పారదర్శకంగా ఎంపికయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!

Loading...
Unable to load recommendations.
Follow Us