ఇదెక్కడి గోల.. రెండేళ్ల కిందటి కరెంట్ బిల్లు ఇప్పుడు కట్టాలా?

Updated on: Nov 15, 2026 | 12:12 PM

తెలంగాణలో నవంబర్ నెల నుంచి విద్యుత్ బిల్లులకు ట్రూ-అప్ ఛార్జీలు అదనంగా చేరుతున్నాయి. నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసలు వసూలు చేయనున్నారు. పాత విద్యుత్ ఖర్చుల లోటును భర్తీ చేసేందుకు ఈ ఛార్జీలు విధిస్తున్నారు. అయితే గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ఈ భారం నుంచి ప్రభుత్వం ఊరటనిచ్చింది.

ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చూస్తే.. నిజంగానే మీకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అసలే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే.. ఇప్పుడు మన రాష్ట్రంలో కరెంట్ బిల్లులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మీలో చాలామందికి ఈ నవంబర్ నెల కరెంట్ బిల్లు చూసేసరికి పెద్ద షాక్ తగిలి ఉంటుంది. ‘ఇదేందిరా బాబు.. నేను గత నెలలో వాడిన కరెంట్ కు ఈ బిల్లుకు సంబంధమేంట్రా నాయనా?’ అని మీలో చాలామంది తలలు పట్టుకుని ఉంటారు. మరికొంతమంది అద్దెదారులు అయితే.. ‘అసలు రెండేళ్ల క్రితం ఎవరో వాడిన కరెంట్ బకాయిలు ఇప్పుడు మేము కట్టాలా?’ అంటూ ఓనర్లతో గొడవలకు దిగుతున్నారు. అసలు ఈ గోలంతా దేనికోసమంటారా? అదేనండి.. తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ‘ట్రూ-అప్ ఛార్జీలు’! అసలు ఈ ట్రూ-అప్ ఛార్జీలు అంటే ఏంటి? ఎందుకు వసూలు చేస్తున్నారు? హైదరాబాద్ లాంటి నగరాల్లో అద్దెదారులు పడుతున్న నరకం ఏంటి? ప్రభుత్వాలు ఎవరికి ఊరటనిచ్చాయి? ఈ సమస్త సమాచారాన్ని క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ ‘ట్రూ-అప్ ఛార్జీలు’ అనే పదం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో విపరీతంగా వినిపిస్తోంది. అసలు దీని అర్థం ఏంటో చాలామందికి తెలియదు. సింపుల్‌గా చెప్పాలంటే.. మన రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలు ఉంటాయి చూశారా? దక్షిణ తెలంగాణ డిస్కం TGSPDCL, ఉత్తర తెలంగాణ డిస్కం TGNPDCL.. అనే పేర్లు వినే ఉంటాం కాదా! ఇవి ఏం చేస్తాయంటే.. ప్రతి ఏటా మార్చి నెలలో వచ్చే ఏడాదికి ఎంత కరెంట్ కావాలి? దాన్ని కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చవుతుంది? అని ముందే ఒక అంచనా వేసి, విద్యుత్ నియంత్రణ మండలి ఇంగ్లీషులో చెప్పాలంటే.. Telangana Electricity Regulatory Commission కు సమర్పిస్తాయి. ఆయా అంచనాల ఆధారంగానే మనకు ఈఆర్సీ టారిఫ్‌లను ఫిక్స్ చేస్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు.. ఆ సంవత్సరంలో వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల వ్యవసాయానికి, ఇతర అవసరాలకు కరెంట్ వాడకం విపరీతంగా పెరిగిపోవచ్చు. లేదా మార్కెట్లో బొగ్గు ధరలు, విద్యుత్ కొనుగోలు ఖర్చులు భారీగా పెరిగిపోవచ్చు. ఇలా డిస్కంలు ముందే అంచనా వేసిన దానికంటే.. వాస్తవంగా కరెంట్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఇలా ఖర్చులు పెరిగినప్పుడు వచ్చే నష్టాన్ని, లోటును భర్తీ చేసుకునేందుకు డిస్కంలు ప్రజల నుంచి అదనంగా వసూలు చేసే మొత్తాన్నే ‘ట్రూ-అప్ ఛార్జీలు’ అంటారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. గతంలో మనం తక్కువ కట్టి, కంపెనీలు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే.. ఆ బకాయిలను ఇప్పుడు మన జేబుల నుంచి గుంజుకుంటారన్నమాట. ఇప్పుడు అసలు లెక్కలు చూద్దాం. డిస్కంలు సమర్పించిన నివేదికల ఆధారంగా.. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏకంగా రూ.7,635.22 కోట్ల అదనపు వ్యయం అయిందని తేల్చారు. ఇందులో 2022-23 విద్యుత్ కొనుగోలు అదనపు వ్యయం రూ.5,186.29 కోట్లు కాగా, 2023-24 రెవెన్యూ లోటు రూ.2,448.93 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తం రూ.7,635 కోట్లలో.. వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా రూ.2,214.99 కోట్లు, వ్యవసాయేతర వినియోగదారుల వాటా రూ.5,420.23 కోట్లుగా లెక్కగట్టారు. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. అంటే మన రైతన్నలకు ఎలాంటి కరెంట్ షాక్ తగలకుండా ప్రభుత్వం ఆదుకుంది. మరి మిగిలిన రూ.5,420.23 కోట్ల మాటేంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ మిగతా భారాన్ని సామాన్య గృహ వినియోగదారులు, వ్యాపారులు, ఇండస్ట్రీల మీద వేశారు. ఈ ట్రూ-అప్ వసూళ్ల పర్వం ఈ ఏడాది నవంబర్ నెల నుంచి అధికారికంగా ప్రారంభమైంది. దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో అయితే ఇది ఏకంగా 29 నెలల పాటు కొనసాగనుంది. ఇక ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో ఇది 26 నెలల పాటు అమలు కానుంది. ఛార్జీల వసూలు విధానం ఎలా ఉందంటే.. నవంబర్ నెలలో మీరు వినియోగించిన ప్రతి యూనిట్‌కు 30 పైసలు అదనంగా వేశారు. డిసెంబర్ నుంచి ఈ ఛార్జీని యూనిట్‌కు 50 పైసలకు పెంచనున్నారు. దీంతో సామాన్య ప్రజలకు వచ్చే నెలవారీ కరెంట్ బిల్లులకు ఈ ట్రూ-అప్ ఛార్జీలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఉదాహరణకు.. ఒక వినియోగదారుడికి గతంలో నెలకు రూ.230 బిల్లు వస్తే, ఇప్పుడు ఆ ట్రూ-అప్ ఛార్జీల రూపంలో మరో రూ.50 అదనంగా కలిపి మొత్తం బిల్లు రూ.280 అయింది. ఇలా మీరు ఎన్ని యూనిట్లు వాడితే, దాన్ని బట్టి మీ బిల్లులో అదనపు మొత్తం పెరుగుతూ పోతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలకైతే ఇది నిజంగానే పెద్ద గుదిబండగా మారింది. TGSPDCL పరిధిలో వసూలు చేస్తున్న మొత్తం ట్రూ-అప్ ఛార్జీల్లో ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే సుమారు 60 శాతం వరకు భారం పడుతోంది. అంటే కేవలం గ్రేటర్ హైదరాబాద్ వాసుల పైనే దాదాపు రూ.2,533 కోట్ల వరకు భారం పడుతోందన్నమాట. సాధారణ ఇళ్లకే కాదు.. ఐటీ కారిడార్‌లోని పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లకూ ఈ ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు.. గచ్చిబౌలిలోని ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలకు, పెద్ద సొసైటీలకు ఈ ట్రూ-అప్ రూపంలో ఒకే రోజు ఏకంగా లక్షల రూపాయల బిల్లు వచ్చింది. ఇలా లక్షల్లో బిల్లులు వస్తుండటంతో అపార్ట్‌మెంట్ వాసులు, నివాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో, ఇతర పట్టణాల్లో అద్దె ఇళ్లలో నివసించేవారికి ఈ ట్రూ-అప్ ఛార్జీలు ఒక పీడకలగా మారాయి. హైదరాబాద్‌లో దాదాపు 70 శాతానికి పైగా ప్రజలు అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారు. మీకు తెలుసు కదా.. అద్దెవాసులు శాశ్వతంగా ఒకే ఇంట్లో ఉండరు. ఉద్యోగాలరీత్యా, పిల్లల చదువులరీత్యా తరచూ ఇళ్లు మారుతుంటారు. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ వస్తోందంటే.. డిస్కంలు వసూలు చేస్తున్న ఈ ట్రూ-అప్ ఛార్జీలు ప్రస్తుత నెల వినియోగానికి సంబంధించినవి కావు. ఇవి ఏకంగా 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినవి. అంటే నాలుగేళ్ల క్రితం నాటి కరెంట్ బిల్లుల బకాయిలు ఇవి. అప్పట్లో వేరే ఎవరో ఆ ఇంట్లో అద్దెకు ఉన్నారు. వాళ్ళు ఆ కరెంట్ వాడారు, ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన అద్దెదారులు ఆ పాత బకాయిలు కూడా కలిపి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అద్దెదారులు.. రెండేళ్ల క్రితం ఎవరో వాడిన కరెంట్ బిల్లు నేను ఎందుకు కట్టాలి? అని ఇంటి యజమానులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కానీ, డిస్కం అధికారులను అడిగితేనేమో.. మాకు వినియోగదారులతో, వ్యక్తులతో సంబంధం లేదు. ఆ కనెక్షన్ నంబర్ మీద ఎంత బకాయి ఉందో అది వసూలు చేస్తాం. అక్కడ ఎవరున్నారనేది మాకు అనవసరం అని తేల్చిచెబుతున్నారు. దీంతో ఓనర్లు, టెనెట్ల మధ్య పెద్ద గొడవలే జరుగుతున్నాయి. ఇన్ని ఇబ్బందులు, ఆందోళనల మధ్య తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిచ్చింది. అదేంటంటే.. రాష్ట్రంలో అమలవుతున్న ‘గృహజ్యోతి’ పథకం. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం జీరో బిల్లులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రూ-అప్ ఛార్జీల విషయంలోనూ గృహజ్యోతి లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గృహజ్యోతి పథకం కింద అర్హత పొందిన సుమారు 54 లక్షల 79 వేల 383 విద్యుత్ కనెక్షన్లపై ఈ ట్రూ-అప్ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించాలని నిర్ణయించింది. మీకు గృహజ్యోతి కింద జీరో బిల్లు వస్తున్నట్లయితే.. ఈ ట్రూ-అప్ ఛార్జీల టెన్షన్ మీకు లేదు. ఆ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి మీకు యథావిధిగా జీరో బిల్లులే వస్తాయి. అయితే, దీనివల్ల ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే గృహజ్యోతి కోసం నెలకు సుమారు రూ.170 కోట్ల నుంచి రూ.210 కోట్లు చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ ట్రూ-అప్ ఛార్జీల రూపంలో అదనంగా మరో రూ.500 కోట్లను డిస్కంలకు చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడ ప్రజల నుంచి, విద్యుత్ రంగ నిపుణుల నుంచి ఒక బలమైన వాదన వినిపిస్తోంది. అదేంటంటే.. డిస్కంల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు, మరి దానికి ప్రతిఫలంగా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, పారిశ్రామిక వాడల్లో ఇప్పటికీ తరచూ పవర్‌ కట్స్‌, లో-వోల్టేజీ సమస్యలు, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను మార్చడంలో జాప్యం వంటివి జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారుల నుంచి వేల కోట్లు అదనంగా వసూలు చేస్తున్నప్పుడు.. సరఫరా నాణ్యతను పెంచడం, అంతరాయాలను తగ్గించడం, నిర్వహణ మెరుగుపరచడం వంటి చర్యలు డిస్కంలు తీసుకోవాలి కదా? కేవలం బకాయిల వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. సేవల నాణ్యతను మెరుగుపరచడంపై కూడా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చూశారుగా.. మొత్తానికి ట్రూ-అప్ ఛార్జీల అసలు కథ ఇది. నవంబర్ బిల్లు నుంచి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసల అదనపు భారం మీ బిల్లులపై పడనుంది. అయితే గృహజ్యోతి లబ్ధిదారులకు మాత్రం ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తుండటం నిజంగా ఊరటనిచ్చే అంశం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాసరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి కొత్త రూట్ వచ్చేసింది

రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖ సమ్మిట్ టార్గెట్ ఏంటి?

వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప.. టక్కున దూకేసి.. పట్టేసిన లారీ డ్రైవర్

వందే భారత్ స్లీపర్‌కు నో తత్కాల్‌..నో వెయిటింగ్‌ లిస్ట్‌!

అభిమానాలు లేక కాదు, సందర్భాలు కుదరాలి కదా! దటీజ్ పవన్ నైజం!

Loading...
Unable to load recommendations.
Follow Us